నేరపరిశోధనలో నంబర్‌ వన్‌!

26 Nov, 2019 04:04 IST|Sakshi

పాపిలాన్‌ సాంకేతికతతో దూసుకుపోతున్న తెలంగాణ పోలీసులు

ఇంగ్లండ్‌ కంటే పదిరెట్లు వేగంగా నిందితుల గుర్తింపు

మరో 26 ఫింగర్‌ప్రింట్ల యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు

డైరెక్టర్‌తో సహా 88 మంది నిపుణులు.. సిబ్బంది కేటాయింపు పూర్తి

సాక్షి, హైదరాబాద్‌: నేర పరిశోధన దర్యాప్తులో ఆధునిక సాంకేతికతను వినియోగించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన తెలంగాణ పోలీసు శాఖ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో పాత జిల్లాల ప్రకారం ఉన్న 10 ఫింగర్‌ ప్రింట్‌ యూనిట్లకు తోడు మరో 26 ఫింగర్‌ ప్రింట్‌ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు తగినన్ని నిధులు, సిబ్బందిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవి పనిచేయడం ప్రారంభిస్తే.. ఆధారాల సేకరణ, నిందితుల గుర్తింపు, నేర దర్యాప్తులో ప్రపంచదేశాల సరసన చేరుతామని పోలీసు ఉన్నతాధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఎలా ఉండబోతోంది?
నేరదర్యాప్తులో ఆధారాలు చాలా కీలకం. క్లూస్‌ టీంలు ఆలస్యంగా రావడం వల్ల చాలావరకు ఆధారాలు కోల్పోయే పరిస్థితి తలెత్తుతోంది. అదే నిమిషాల్లో చేరుకోగలిగితే కీలకమైన ఆధారాలు అప్పటికప్పుడు సేకరించగలుగుతారు. ఫలితంగా జరిగిన ఘటనలో నిందితుల పాత్రను శాస్త్రీయంగా, పకడ్బందీగా నిరూపించగలుగుతారు. అందుకే అదనంగా మరో 26 ఫింగర్‌ప్రింట్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తూ హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కమిషనరేట్ల పరంగా హైదరాబాద్‌లో ఇకపై 5, సైబరాబాద్‌లో 3, రాచకొండలో 3, వరంగల్‌లో 2, రామగుండంలో ఒకటి చొప్పున ఏర్పాటు కానున్నాయి.

మొత్తం విభాగానికి ఐపీఎస్‌ (నాన్‌కేడర్‌) అధికారి డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. ఇంకా నలుగురు డీఎస్పీలు, 26 మంది ఇన్‌స్పెక్టర్లు, 57 మంది ఎస్సైలను త్వరలోనే ప్రభుత్వం నియమించనుంది. ఈ విషయంలో డీజీపీ కార్యాలయం కసరత్తు పూర్తి చేసింది. అన్ని కొత్త యూనిట్లకు కనీసం ఒక ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లతో కూడిన జాబితాను ఇప్పటికే రూపొందించింది. వీరంతా ఫోరెన్సిక్‌ సైన్స్, ఫింగర్‌ప్రింట్స్, శాంపిల్స్‌ సేకరణలో అనుభవమున్నవారు కావడం విశేషం. ఈ యూనిట్లకు కావాల్సిన సాంకేతిక పరికరాలు, వాహనాలను త్వరలోనే ఆయా కేంద్రాలకు పంపనున్నారు.

త్వరలో ప్రపంచ దేశాల సరసన...
వేలిముద్రల ఆధారంగా కేవలం 10 సెకండ్లలో పాతనేరగాళ్ల చిట్టా విప్పే అత్యాధునిక సాంకేతికత ‘పాపిలాన్‌’దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రత్యేకం. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఈ పాపిలాన్‌ సాఫ్ట్‌వేర్‌తో పాత నేరస్తులను కేవలం 10 సెకండ్లలో గుర్తిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక డేటాబేస్‌ కూడా నిర్వహిస్తున్నారు. మొబైల్‌ గాడ్జెట్ల ద్వారా ఘటనా స్థలం నుంచే నిందితుడిని గుర్తించే విధానం దేశంలో ఒక్క తెలంగాణలోనే ఉంది.

ఈ విషయంలో తెలంగాణ పోలీసులు ఇంగ్లండ్‌ కంటే ముందుండటం విశేషం. ఇంగ్లండ్‌లో పాత నేరస్తులను గుర్తించేందుకు కనీసం 60 సెకండ్లు పడుతుండటం గమనార్హం. కొత్త 26 యూనిట్లు కూడా పనిచేయడం ప్రారంభమైతే.. నేర దర్యాప్తు, నిందితుల గుర్తింపు, కేసుల పరిష్కారంలో వరల్డ్‌ టాప్‌–10లో నిలబడుతుందని పోలీసు శాఖ ధీమాగా ఉంది.

మరిన్ని వార్తలు