హరితహారానికి సన్నాహాలు

14 May, 2018 12:28 IST|Sakshi

ఉమ్మడి జిల్లా పరిధిలోని నర్సరీల్లో సాగవుతున్న 4.87 కోట్ల మొక్కలు

అటవీ, ఉద్యానవన, డ్వామా శాఖల ద్వారా నర్సరీ సాగు

నర్సరీకి లక్ష మొక్కల చొప్పున పెంపకం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో హరితహారం ఒకటి. మూడేళ్లుగా ప్రభుత్వం రాష్ట్ర మంతటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఉమ్మడి జిల్లాలో మూడేళ్లుగా  సుమారు 6 కోట్ల మొక్కలు నాటినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా నాలుగోవిడత హరితహారం లక్ష్యం ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో కంటే ఎక్కువ మొక్కలు నాటాలని అటవీ, డ్వామా అధికారులను ఆదేశించింది. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో 4.87 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించింది

మిర్యాలగూడ రూరల్‌ : ఉమ్మడి జిల్లాలో 70 మండలాలు 1,159 పాత పంచాయతీలు ఉన్నాయి. గతంలో ప్రతి పంచాయతీకి 30 వేల మొక్కలు నాటించిన అధికారులు ఈ సంవత్సరం మాత్రం తప్పని సరిగా 40 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించింది. మూడవ విడత హరితహారం ముగిసిన వెంటనే, నాల్గవ విడత హరితహారానికి ప్రతి పాదనలు పంపాలని ,రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులను కోరారు.

కాగా జిల్లా అధికారులు 2కోట్ల మొక్కలు నాటడానికే ప్రతిపాదనలు పంపారు. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల పరిధిలో అటవీవిస్తీర్ణం పెంచేదులు విరివిరిగా మొక్కలు నాటాలని ఉన్నతాధికారులు సూచించారు. ఐదుకోట్ల మొక్కలు నాటేలా లక్ష్యం నిర్దేశించుకోవాలని వారు సూచించారు.పంచాయతీల వారీగా లక్ష్యం నిర్దేశించడంతో ఉమ్మడి జిల్లాలో లక్ష్యం మారి 4.87 కోట్లకు చేరుకుంది.

గత ఏడాది అక్టోబర్‌ నెలలో  ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూర్యాపేట జిల్లాలో పర్యటించి ఇంటికి ఆరుమొక్కలు నాటి పెంచాలని ప్రజలను కోరారు. కాగా అందుకు అనుగునంగా ఉద్యాన వన శాఖ అధికారులు తమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే నర్సరీల్లో పండ్ల , పూల మొక్కలు పెంచుతున్నట్లు చెబుతున్నారు. 

శాఖల వారీగా నర్సరీల సాగు 

ప్రభుత్వం నిర్దేశించిన మొక్కలు పెంచేందుకు శాఖల వారీగా  అటవీ, డ్వామా, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. ఒక్కొక్క నర్సరీలో లక్ష మొక్కలు సాగు చేసే లక్ష్యంతో నర్సరీలు నిర్వహిస్తున్నారు. నల్లగొండ జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో 159 నర్సరీల్లో 1కోటి 59 లక్షల మొక్కల పెంపకం ప్రారంభించారు.ఆలటవీశాఖ ,డ్వామా ద్వారా నిర్వహించే నర్సరీల్లో టేకు మొక్కలు సాగుచేయాలని అధికారులు నిర్ణయం తీసుకుని ఆదిశగా పనిచేస్తున్నారు.

అదే విధంగా సూర్యాపేట జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో 59 నర్సరీల్లో 59 లక్షల మొక్కలు, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 40 నర్సరీల్లో 40 లక్షల మొక్కలు, ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో 8నర్సరీల్లో  పండ్ల ,పూల మొక్కలు 8 లక్షల మొక్కలు పెంచుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అటవీశాఖ, డ్వామా ఆధ్వర్యంలో 90 నర్సరీల్లో 90లక్షల మొక్కలు పెంచాలని నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇంటింటికీ ఆరు మొక్కలు అందించాలన్న లక్ష్యంతో„ý  10 లక్షల మొక్కలు ప్రత్యేకంగా సాగు చేస్తున్నారు. 

ఇంటి ఆవరణలో పూల, పండ్ల మొక్కలు

కాగా ఇంటి ఆవరణలో ఆసక్తిగా పెంచుకొనేందుకు కావలసిన పండ్ల, పూల మొక్కలు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నర్సరీలు సాగుచేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో నాటేందుకు వేప, కానుగ. మర్రి, ఉసిరి,నేరేడు, చింత మొక్కలను పెంచుతున్నారు. 

నర్సరీలకు ఎండదెబ్బ

ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో సాగవుతున్న నర్సరీలకు ఎండ దెబ్బ ఇబ్బంది పెడుతోంది. నర్సరీల్లో సాగు చేసిన మొక్కలు లేతవి కావడంతో సూర్య ప్రతాపం వల్ల వడబారి పోతున్నాయి. కొన్ని మొక్కలు వాటిపోయి ఎండిపోదున్నాయి.

నాటిన ప్రతి మొక్కా బతికేలా చూడాలి

హరితహారంలో నాటిన ప్రతి మొక్క బతికేలా చూడాలి. లేక పోతే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని కోట్ల మొక్కలు నాటిన ప్రయోజనం శూన్యం. ప్రభుత్వం రెండు సంవత్సరాల మొక్క పెరిగే వరకు ప్రత్యేక రక్షణ కల్పించాలి. ప్రజలను, అధికారులను బాధ్యులు చేయాలి  –పోలాగాని వెంకటేష్, రాయినిపాలెం  

మరిన్ని వార్తలు