ఫిబ్రవరి లేదా మార్చి..!

26 Aug, 2018 00:57 IST|Sakshi
శరవేగంగా సాగుతున్న యాదాద్రి ప్రధానాలయం పనులు

యాదాద్రి ప్రధానాలయం ప్రారంభానికి ఏర్పాట్లు 

దేశంలోని వివిధ ప్రాంతాల పీఠాధిపతులకు ఆహ్వానం  

రూ.2 కోట్లతో ప్రారంభ కార్యక్రమానికి ప్రణాళిక  

 సీఎం ఆమోదానికి ప్రతిపాదనలు 

సాక్షి, యాదాద్రి: ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి ప్రధానాలయం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో ప్రధానాలయాన్ని ప్రారంభించి స్వామి, అమ్మవార్ల నిజదర్శనాన్ని భక్తులకు కల్పించాలని వైటీడీఏ ప్రయత్నాలు ప్రారంభించింది. ఆలయాన్ని ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చి దిద్దుతున్నట్లుగానే ఆలయ ప్రారంభాన్ని కూడా అంతే స్థాయిలో చేయాలన్న లక్ష్యంతో అధికారులు ప్రణాళికలను రూపొందించారు. యాదాద్రి ఆలయాన్ని మూడు సంవత్సరాలుగా పునర్‌నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

కృష్ణ శిలలతో అత్యంత నిష్టతో నిర్మాణం జరుగుతోంది. కొండపైన 2.33 ఎకరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు, పెద్దగుట్టపై టెంపుల్‌ సిటీని అభివృద్ధి చేస్తున్నారు. పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా పనులు చేస్తున్నారు. ముందుగా ప్రధానాలయం ప్రారంభించి బాలాలయంలో ఉన్న స్వామి, అమ్మవార్ల దర్శనాన్ని భక్తులకు కల్పించేందుకు ముహూర్తం నిర్ణయించారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ అక్టోబర్‌లో ఆలయాన్ని పునః ప్రారంభించాలని అనుకున్నా మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఫిబ్రవరి, లేదా మార్చిలో గర్భాలయంలోకి భక్తులను అనుమతించాలని నిర్ణయించారు. 

దేశం నలుమూలల నుంచి ప్రతినిధులు 
ప్రధానాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే ప్రతిపాదనలు సిద్ధం చేసిన వైటీ డీఏ, ఆమోదంకోసం సీఎం కేసీఆర్‌కు పంపించింది. చిన జీయర్‌స్వామి సూచనల మేరకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పర్యవేక్షణలో ప్రధానాలయం ప్రారంభ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. రూ.2 కోట్ల వ్యయంతో నిర్వహించే ఈ కార్యక్రమానికి అవసరమైన బడ్జెట్‌కోసం ప్రభుత్వానికి విన్నవించారు. జాతీయస్థాయిలో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చిన జీయర్‌ స్వామి సూచనలు తీసుకోనున్నారు. దేశంలోని మఠాధిపతులు, పీఠాధిపతులు, జీయర్లతో పాటు ఇతర ప్రముఖులను ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని నిర్ణయించారు. యాదాద్రి పుణ్యక్షేత్ర మహాత్మ్యాన్ని దేశం నలుమూలలా తెలియజేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తిరుమల తరహాలో భక్తులు యాదాద్రికి వచ్చే అవకాశం ఉన్నందున ఆ«ధ్యాత్మిక శోభను పెంపొందించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమా లు నిర్వహించాలని భావిస్తున్నారు.  

కొనసాగుతున్న శక్తి ఆవాహన పూజలు 
బాలాలయంలో ఉన్న స్వామి వారిని ప్రధానాలయం లో పునః ప్రతిష్టించడానికి సమయం దగ్గరపడుతుండటంతో 2 నెలలుగా శక్తి ఆవాహన పూజలు జరుగుతున్నాయి. స్థానాచార్యులు, ప్రధానాచార్యులు, వేదపండితులు ఆవాహన జప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పురోగతిలో పనులు..
గర్భాలయం, ప్రధానాలయం పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రధానాలయం చుట్టూ  తూర్పు, ఉత్తరంలో ఐదంతస్తుల రాజగోపురాలు పూర్తయ్యాయి. మాడవీధులు, ప్రాకారాలు, ఆలయంలో శిల్పాల సుందరీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కొండపైన శివాలయం, పుష్కరిణి పనులు పురోగతిలో ఉన్నాయి. విద్యుదీకరణ, క్యూ లైన్లు, మంచినీటి సరఫరా, ఫ్లోరింగ్‌ పనులు చే యాల్సి ఉంది. ఈ పనులను అక్టోబర్‌ చివరి నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. 

>
మరిన్ని వార్తలు