యూత్ కాంగిరేస్..!

31 Jul, 2015 00:13 IST|Sakshi

నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. పార్టీలోని యువ నాయకత్వం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న యూత్ కాంగ్రెస్ పదవులకు త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ మేరకు నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల పరిశీలకులుగా నియమించిన లోక్‌సభ రిటర్నింగ్ అధికారులు(ఎల్‌ఆర్వో) ఆయా నియోజకవర్గాల్లో పర్యటించారు. ఓటరు జాబితాలో తిరస్కరణకు గురైన ఓటర్ల వివరాలను రిటర్నింగ్ అధికారులు మరోసారి పరిశీలిస్తున్నారు. దీంతోపాటు ఎన్నికలు ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఇటీవల నియోజకవర్గ కేంద్రాల్లో  పర్యటించారు. ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు తలెత్తకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు పోలీస్‌శాఖ సహకారాన్ని కూడా కోరారు.

హోరాహోరీ పోరు...
పార్టీలో యువతరానికి ప్రాధాన్యత పెరిగిన క్రమంలో యూత్ కాంగ్రెస్ పదవులకు పోటీ అనివార్యమైంది. దీంతో నల్లగొండ పార్లమెంటరీ కమిటీ అధ్యక్ష స్థానానికి కుమ్మరికుంట్ల వేణు (సూర్యాపేట), రమేష్ యాదవ్ (హాలియా) పోటీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే భువనగిరి పార్లమెంటరీ కమిటీ అధ్యక్ష స్థానానికి మందడి ఉదయ్‌రెడ్డి, వనం చంద్రశేఖర్ (బీసీ), పృధ్వీరాజ్ (బీసీ) పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు రామన్నపేట మండలానికి చెందిన వారే. పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు జిల్లా పార్టీ పెద్దల మధ్య వర్గపోరు లేకుంటే యువజన విభాగం.. ఎన్నికలు పోటీ లేకుండానే ఏకగ్రీవమయ్యే అవకాశం ఉండేది. కానీ నాయకులది తలోదారి కావడంతో పార్లమెంటరీ అధ్యక్ష స్థానాలకు పోటీ చేసేవారు కూడా గ్రూపులు కట్టారు. ఎవరికి వారు తమకున్న పలుకుబడితో కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారు.

నల్లగొండ పార్లమెంటరీ కమిటీ అధ్యక్ష స్థానానికి ఇ ద్దరు పోటీ పడుతుండగా వీరిలో ఒకరికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి సపోర్ట్ ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండో వ్యక్తి.. సీఎల్‌పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావుల సహకారం కోరుతున్నారు. ఇక భువనగిరి స్థానానికి ముగ్గురు పేర్లు వినపిస్తుండగా...మాజీ ఎంపీ రాజగోపాల్‌రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, భువనగిరి ఇన్‌చార్జ్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు అండదండలతో ఒకరు ముందుకు పోతున్నారు. మరొకరికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి , మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, రాజ్యసభ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, మూడో వ్యక్తికి ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డిల సహకారం ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల నాటికి వీరిలో ఎంతమంది పోటీ నుంచి త ప్పుకుంటారో వేచి చూడాల్సిందే.

రెండు విడతల్లో ఎన్నికలు..
రెండు పార్లమెంటరీ స్థానాలకు కలిపి మొత్తం ఓటర్లు 17,400 మంది ఉన్నారు. దీంట్లో నల్లగొండ పరిధిలో 8,500, భువనగిరి పరిధిలో 8,900 మంది ఉన్నారు. రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. మొదటి విడత ఎన్నికలు గ్రామ పంచాయతీ, అసెంబ్లీ కమిటీలకు కలిపి ఒకేసారి జరుగుతాయి. కాబట్టి ఓటర్లు ఒక్కొక్కరు రెండేసి ఓట్లు వేయాలి. దీంట్లో మెజార్టీ ఓట్లు వచ్చిన వారిని ప్రాధాన్యత క్రమంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నియమిస్తారు. అసెంబ్లీ కమిటీలో 15, గ్రామ కమిటీలో ఏడుగురు సభ్యులు ఉంటారు.  పోలింగ్ నియోజకవర్గ కేంద్రాల్లో ఉంటుంది.

రెండో విడత పార్లమెంటరీ, రాష్ట్ర కమిటీ స్థానాలకు కలిపి ఒకేసారి జరుగుతాయి. అసెంబ్లీ, గ్రామ కమిటీల్లో ఎన్నికైన సభ్యులు అంతా కలిసి రెండు కమిటీల సభ్యులను ఎన్నుకుంటారు. ఒక్కో సభ్యుడు 4 ఓట్లు వేయాల్సి ఉంటుంది. పార్లమెంటరీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి స్థానాలకు రెండు, రాష్ట్ర కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి స్థానాలకు రెండు ఓట్లు వేయాలి. ఒక్కో కమిటీలో 15మంది సభ్యులు ఉంటారు. అయితే రాష్ట్ర కమిటీలో అదనంగా మరో 17మంది సభ్యులను సెక్రటరీలుగా తీసుకోవాలని ఇటీవల నిర్ణయించారు. ఈ ఎన్నికలు నల్లగొండ, భువనగిరి కేంద్రాల్లో జరుగుతాయి.  కమిటీల్లో అన్ని కులాల యువతీ, యువకులకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలన్న ఉద్దేశంతో జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మ హిళ, వికలాంగులకు రిజర్వేషన్లు కేటాయించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వయోపరిమితి 18-35 ఏళ్ల లోపు ఉండాలి.
 

మరిన్ని వార్తలు