శిలలపై శిల్పాలు చెక్కినారు...

24 Oct, 2016 00:50 IST|Sakshi
శిలలపై శిల్పాలు చెక్కినారు...

‘యాదాద్రి’కి సిద్ధమవుతున్న శిల్పాలు
 
 యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని ప్రధానాలయానికి సంబంధించి శిల్పాలు తయారవుతున్నాయి.  పనులను ఆదివారం స్థపతులు సుందరరాజన్, వేలు, ఆర్కిటెక్టు ఆనంద్‌సాయి గుంటూరు జిల్లా కమలాపురం, ప్రకాశం జిల్లా మార్టూరుకు వెళ్లి పర్యవేక్షించారు. ఆలయం చుట్టూ రిటైనింగ్ వాల్, ఆలయ ప్రాకారం, ఆరు రాజగోపురాలు, ముఖ మండపాలు, ఉప ఆలయాలు, తిరుమాడవీధుల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శిల్పాలను తయారుచేస్తున్నారు. వీటిలో సింహం ఆకారంలో ఉన్న రాతి స్తంభాలు, చతుర్భుజి ఆకృతుల్లో శిల్పాలు ఉన్నాయి.

ఆలయ ముఖద్వారం ముందు 20 సింహం ఆకృతి  రాతి స్తంభాలు వస్తాయని ఆర్కిటెక్టులు తెలిపారు. వెయ్యేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా ఆలయాన్ని తీర్చి దిద్దుతున్నారు. క్యూలైన్లలోని భక్తులకు చల్లదనాన్ని ఈ శిల వెదజల్లుతుందని వైటీడీఏ అధికారులు తెలిపారు. శిల్పాల మధ్య సిమెంట్ వాడకుండా ఒక విధమైన జిగురు పదార్థం వాడుతున్నామని ఆర్కిటెక్టు ఆనంద్‌సాయి తెలిపారు.   900 మంది స్థపతులు, ఆర్కిటెక్టుల ఆధ్వర్యంలో శిల్పాలు తయారవుతున్నాయి. ఈ శిల్పాలను కృష్ణ శిలతో తయారు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు