సీజనల్‌ వ్యాధుల నివారణకు సన్నద్ధం

17 Jul, 2018 01:14 IST|Sakshi

వైద్యాధికారులకు మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశాలు

‘సాక్షి’ కథనానికి స్పందన  

సాక్షి, హైదరాబాద్‌: సీజనల్‌ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ఏజెన్సీకి ఫీవర్‌’ శీర్షికతో ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యాధి నిర్ధారణ కిట్లు, మందులు సిద్ధం చేశామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టామని, గతంలోలాగే అధికారులు, వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశించామని మంత్రి చెప్పారు. వైద్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉంద న్నారు.

ఈ సీజన్‌లో సాధారణం గా డెంగీ, స్వైన్‌ఫ్లూ, చికున్‌ గున్యా, మలేరియా, టైఫాయిడ్, వైరల్‌ హెపటైటిస్‌ (జాండీస్‌), విరేచనాలు, వాంతులు, డిప్తీరియా వంటి వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయని, వైరల్, సీజనల్‌ వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంటుందన్నారు. అందుకని ఇలాంటి వ్యాధి లక్షణాలు కనిపించిన వారు వెంటనే సమీప ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్ళాలని సూచించారు.

ఈ సీజనల్‌ వ్యాధులను ఎదుర్కోవడానికి, ప్రజలకు సత్వర వైద్యం అందడానికి వీలుగా వ్యాధి నిర్ధారణ కిట్లు, మందులతో సిబ్బంది, డాక్టర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ల్యాబ్‌ టెస్టులు చేయడానికి స్టాఫ్, కిట్లు, ఓపీలోనూ తగు సదుపాయా లు, ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్స్‌ సిద్ధం చేశామన్నారు. దోమలు పెరగకుండా, నీళ్ళు నిల్వ ఉండకుండా, బురద, మురుగునీరు చేరకుండా, పారిశుద్ధ్యం సరిగా ఉండేలా మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, జీహెచ్‌ఎంసీ వంటి శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు.

ఏజెన్సీ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి...
ఏజెన్సీ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో ఇప్పటికే మాట్లాడామన్నారు. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో చర్చించామన్నారు. ప్రజల్లో వ్యాధుల పట్ల అవగాహన, చైతన్యం పెంచామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వైద్యశాలల్లోనూ సదుపాయాలు, మందులు, పరికరాలు పెంచామని, అనేక మంది స్పెషలిస్టు డాక్టర్లను కూడా నియమించామని, దీంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు.

ఇప్పుడిప్పుడే సీజనల్‌ వ్యాధు లు వస్తున్నాయని, వీటిని మొగ్గలోనే తుంచే విధంగా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ప్రాథమిక దశలోనే వైద్యశాలలకు చేరితే ఎలాంటి ప్రమాదాలుండవన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తదితరులతో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు.

మరిన్ని వార్తలు