కాంగ్రెస్‌ గూటి పక్షులు!

5 Apr, 2019 10:15 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: పాలమూరు లోక్‌సభ స్థానానికి సంబంధించి ఓ ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ పడుతున్న మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు కాంగ్రెస్‌ గూటి నుంచి వచ్చిన వారే కావడం విశేషం. బీజేపీ తరఫున బరిలో ఉన్న డీకే అరుణ 20ఏళ్లు పాటు కాంగ్రెస్‌ పార్టీలో సేవలందిస్తూ పక్షం రోజుల క్రితమే కాషాయం కండువా కప్పుకున్నారు. నవాబ్‌పేట మండలానికి చెందిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌ పార్టీ నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ప్రముఖ ఎంఎస్‌ఎన్‌ ఫార్మా కంపెనీ అధినేత సత్యనారాయణ రెడ్డి సోదరుడైన శ్రీనివాస్‌రెడ్డి 2005లో నవాబ్‌పేట మండలంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి సింగిల్‌ విండో చైర్మన్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

తర్వాత 2009 స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే పార్టీ నుంచి పోటీ గురుకుంట ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. వీరితో పాటు కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి సైతం పదహారేళ్ల నుంచి కాంగ్రెస్‌ పార్టీ, అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా పని చేస్తున్న ఆయనను కాంగ్రెస్‌ అధిష్టానం మహబూబ్‌నగర్‌ నుంచి బరిలో దింపింది. అయితే.. గతంలో ఒకే పార్టీలో పని చేసిన ముగ్గురు అభ్యర్థులు ప్రస్తుతం వేర్వేరు పార్టీల నుంచి లోక్‌సభ ఎన్నికల్లో తలపడుతుండడంతో ఎవరు గెలుస్తారో అనే చర్చ జోరుగా సాగుతోంది.  

ఇద్దరు సీనియర్లు.. 
పాలమూరు బరిలో ఉన్న ముగ్గురు ప్రధాన అభ్యర్థుల్లో డీకే అరుణ, వంశీచంద్‌రెడ్డికి రాజకీయ అనుభవం ఎక్కువే ఉందని చెప్పాలి. బీజేపీ అభ్యర్థి డీకేది రాజకీయ కుటుంబ నే పథ్యం. ఆమె తండ్రి చిట్టెం నర్సిరెడ్డి మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే. భర్త డీకే భరతసింహారెడ్డి గద్వాల మాజీ ఎమ్మెల్యే. తండ్రి, భర్త నుంచి రాజకీయ వారసత్వ పునికి పుచ్చుకున్న అరుణ 1996లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగ్రేటం చేశారు. అదే సమయంలో మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తర్వాత 1999లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆమె గద్వా ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2000లో వనపర్తి జిల్లా పరిధిలోని పాన్‌గల్‌ జెడ్పీటీసీగా గెలుపొందారు.

జెడ్పీ చైర్‌పర్సన్‌కు పోటీ పడి రెండు ఓట్లతో పదవి కి దూరమయ్యారు. 2002లో పీసీసీ మహిళా కార్యదర్శిగా నియామకమై.. అప్పటి టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలే ని పోరాటాలు చేశారు. ఆర్డీఎస్‌ సాధన కోసం మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలో ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 2003లో నెట్టెంపాడు సాధన కోసం గద్వాల నుంచి హైదరాబాద్‌ వరకు పాదయాత్ర నిర్వహించి ప్రాజెక్టు సాధించారు. 2009లో గద్వాల ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లోనూ మంత్రిగా ఉన్నారు. 2014లో గద్వాలలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఐదో సారి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన ఆమె గత నెల 19న కమలం గూటికి చేరుకుని ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు.  

విద్యార్థి దశ నుంచే.. 
కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచందర్‌రెడ్డి సైతం 2003–04 నుంచే కాంగ్రెస్‌ అనుబంధ సంస్థ అయిన ఎన్‌ఎస్‌యూఐలో చేరి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2004లో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అధ్యక్షుడిగా, 2005లో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2006 ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, 2011లో ఎన్‌ఎస్‌యూఐ ఎలక్షన్‌ కమిషన్‌ పీఆర్వో, 2012 ఏపీ యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన వంశీచంద్‌రెడ్డి 2018లో ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఆయన మహబూబ్‌నగర్‌ ఎంపీ టికెట్‌ దక్కించుకుని మరోసారి బరిలో దిగుతున్నారు. 
 

మరిన్ని వార్తలు