‘తెలంగాణ రాష్ట్ర సోదరసోదరీమణులకు నమస్కారం’

2 Jun, 2020 09:48 IST|Sakshi

హైదరాబాద్ ‌: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు నమస్కారం! తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్ దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అంటూ రాష్ట్రపతి తెలుగులో ట్వీట్‌ చేశారు. (తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ నివాళి)

రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ మూడు భాషల్లో ట్వీట్‌ చేశారు. ‘తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఘనమైన చరిత్ర, సహజవనరులతోపాటు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తున్న తెలంగాణ.. వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతితో దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగిస్తూ.. మరింత సమృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్‌ చేశారు. (కేసీఆరే స్టార్‌)

ప్రధాని నరేంద్ర మోదీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను’ అంటూ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని ట్వీట్‌ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు.  కృషి మరియు పట్టుదల, ఈ సంస్కృతికి మారు పేరు. దేశ పురోభివృద్ధిలో ఈ రాష్ట్ర భూమిక ఎంతో గణనీయమైనది. ఈ రాష్ట్ర ప్రజల అన్ని ప్రయత్నాలూ విజయవంతం కావాలని ఆశిస్తున్నాను’అంటూ మరో ట్వీట్‌లో ఏపీ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 

‘తెలంగాణ ప్రజలందరికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకంక్షలు!! కేసీఆర్‌ గారి బాటలొ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ప్రతి తెలంగాణ బిడ్డకు వందనం!! ఉద్యమ ప్రస్థానంలో అమరులైన వీరులకు జోహార్లు !!జై తెలంగాణ !! జై జై తెలంగాణ !!’ అంటూ మాజీ ఎంపీ కవిత ట్వీట్‌ చేశారు. (కలలు నెరవేరుతున్న కాలం)

మరిన్ని వార్తలు