జర్నలిస్టులు నిష్పాక్షికంగా వ్యవహరించాలి

14 Sep, 2019 13:24 IST|Sakshi
మాట్లాడుతున్న అల్లం నారాయణ  

సాక్షి, శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్‌) : జర్నలిస్టులు నిష్పాక్షికత, సత్యసంధత, నైతికత అనే మూడు విలువలు పాటించాలని, యధార్థంగా సమాజంలోని మంచి చెడులపై వార్తలు రాయాలని తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ సూచించారు. కరీంనగర్‌లోని ఎస్సారార్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ ఆండ్‌ సైన్స్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.రామకృష్ణ అధ్యక్షతన   ‘జర్నలిజం–సామాజిక బాధ్యత’ అనే అంశంపై శుక్రవారం ఒకరోజు రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా అల్లం నారాయణ హాజరై మాట్లాడారు. మీడియా రంగంలో రోజురోజుకు పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయని, వాటిని అనుగుణంగా జర్నలిస్టులు, జర్నలిజం విద్యార్థులు అనుసరించాలన్నారు. సమాజంలో ఉన్న మంచి, చెడులపై జాగ్రత్తగా వ్యవహరిస్తూ వార్తలు రాయాలన్నారు. డిజిటల్‌ మీడియా ద్వారా అనర్థాలు పెరిగిపోతున్నాయని, జర్నలిజం అనేది కత్తిమీద సాములాంటిదన్నారు.

ఉత్తమ జర్నలిస్టులుగా ఎదగాలంటే సత్యసంధత, నిష్పాక్షికత, నైతికత ఉంటేనే సాధ్యపడుతుందన్నారు. కావాల్సిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వార్తలు రాయాలని, రాసిన వార్తలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయని గుర్తు చేశారు. జర్నలిజం విద్యార్థులు ముందుగా భాష, పదజాలంపై పట్టుండాలని, దీని కోసం పత్రికలు, పుస్తకాలు చదివి పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. మరో అతిథి, ప్రముఖ జర్నలిస్టు కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రస్తుతం వార్తపత్రికలతో పాటు  ఫేస్‌బుక్, వాట్సాఫ్, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాలు సమాచారం అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని, కానీ సోషల్‌మీడియాలో వచ్చిన వార్తలన్నీ సత్యాలు కావని గుర్తించాలని వాటిని నిర్ధారణ చేసుకోవాలన్నారు. మనకు వచ్చిన సమాచారం సహాయంతో జరిగిన సంఘటనతోపాటు జరగబోయే అంశాలపై విశ్లేషణ చేసి వార్తలు రాయాలన్నారు.

సమాజంలోని ప్రజల ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసే శక్తి పత్రికలకు, మీడియాకు ఉంటుందని, రాజకీయ, సామాజిక ఏ పత్రిక ఎంతబలంగా ప్రజల్లోకి తీసుకెళ్తే ఆ పత్రికలను పాఠకులను ఆకర్షిస్తాయన్నారు. టెలివిజన్, సోషల్‌మీడియా జర్నలిజంలో నూతన మార్పులు వచ్చాయన్నారు. ఉన్నది ఉన్నట్లు రాయడం కాకుండా విశ్లేషించి వార్తలు రాయాలని, ఆలోచన శక్తిని పదునుపెడితే జర్నలిజం వృత్తిలో రాణిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం కరీంగనర్‌ జేసీ శ్యాంప్రసాద్‌లాల్, టీయూడబ్యూజే(ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, జర్నలిస్టులు ప్రకాశ్‌రావు,   పీఎస్‌.రవీంద్ర, కవి అన్నవరం దేవేందర్‌ విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. జర్నలిజం కోర్సు కోఆర్డినేటర్‌ కొత్తిరెడ్డి మల్లారెడ్డి, ఎన్‌సీసీ అధికారి పర్లపల్లి రాజు, ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి బి.సురేష్‌కుమార్, అద్యాపకులు, విద్యార్థులు, వివిధ ప్రాంతాలకు చెందిన పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు