ఒత్తిళ్లు ఉంటే ఫిర్యాదు చేయండి

28 Jun, 2019 10:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పాత్రికేయులు ఎక్కడైనా ఇబ్బందులకు గురైనా, వారిపై ఒత్తిళ్లు ఉంటే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ప్రెస్‌ కౌన్సిల్‌ అఫ్‌ ఇండియా చైర్మన్‌ చంద్రమౌళికుమార్‌ ప్రసాద్‌ తెలిపారు. అదేవిధంగా వార్తలు రాసే ముందు పాత్రికేయులు ఒకటికి రెండు సార్లు వాస్తవాలను తెలుసుకోవాలని, ఆరోపణలు ప్రచురించేముందు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. పాత్రికేయులపై రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు, అరెస్టులు వంటి చర్యలకు పాల్పడవద్దని రాజకీయ నేతలు, ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలోని వివిధ పత్రికలపై దాదాపుగా 37 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. రెండ్రోజులుగా హైదరాబాద్‌ వేదికగా కేసుల విచారణ జరిగిందని తెలిపారు.

ఈ కేసులలో 9 మంది ఫిర్యాదుదారులు పత్రికారంగానికి చెందినవారని, 27 మంది సాధారణ పౌరులని వివరించారు. పాత్రికేయులపై వేధింపులకు పాల్పడితే తామే స్పందించి సుమోటోగా కేసులు నమోదు చేస్తామన్నారు. పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేయడం తమ బాధ్యతన్నారు. తమిళనాడు, తెలంగాణలో పాత్రికేయుల అరెస్టులపై తాము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను నివేదిక కోరామన్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా నడిచే ఓ ఆంగ్ల దినపత్రికపై నమోదైన ఫిర్యాదుల ఆధారంగా వారిపై విచారణ జరిపామని, వారి సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో సదరు దినపత్రికను సెన్సార్‌ చేస్తున్నామని చెప్పారు. సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా అన్ని మీడియాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వానికి ఐదేళ్లుగా సిఫారసు చేస్తున్నామని తెలిపారు. యాడ్లు రాకుండా ఆర్థికంగా చితికిపోతున్న చిన్న పత్రికలకు ప్రభుత్వం నుంచి సహకారం లభించేలా నూతన యాడ్‌ విధానాన్ని రూపొందిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు