రెవెన్యూలో ‘ప్రక్షాళన’ లొల్లి!

2 Dec, 2017 03:06 IST|Sakshi

భూరికార్డుల ప్రక్షాళనతో రెవెన్యూ యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి

సొమ్ము చేతులు మారుతోందంటూ ఆరోపణలు..

జగిత్యాలలో తహసీల్దార్, వీఆర్వోపై క్రిమినల్‌ కేసులు

పెద్దపల్లిలో తహసీల్దార్లందరితో సహా 50 మందికి కలెక్టర్‌ నోటీసులు

అత్యవసరంగా తహసీల్దార్ల అసోసియేషన్‌ సమావేశం

అవసరమైతే ‘ప్రక్షాళన’ను బహిష్కరించే యోచన

సీఎస్‌కు వినతిపత్రం.. ఆయన హామీ మేరకు బహిష్కరణపై వెనక్కి..

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళనలో ఎదురవుతున్న ఇబ్బందులు రెవెన్యూ యంత్రాంగంపై ఒత్తిడి పెంచుతున్నాయి. రికార్డులను సరిచేయడంలో సొమ్ములు చేతులు మారుతున్నాయంటూ వస్తున్న ఆరోపణలు, నమోదవుతున్న కేసులతో తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో రెవెన్యూ సిబ్బందిపై క్రిమినల్‌ కేసులు నమోదవడం.. తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందికి పెద్దపల్లి ఇన్‌చార్జి కలెక్టర్‌ చార్జి మెమోలు జారీ చేయడం వంటి ఘటనల నేపథ్యంలో.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ‘భూరికార్డుల ప్రక్షాళన’కార్యక్రమాన్నే బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీనిపై తహసీల్దార్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ సీఎస్‌కు వినతిపత్రం సమర్పించారు. సీఎస్‌ సూచన మేరకు బహిష్కరణ యోచనను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించారు.

కేసులు.. మెమోలు..
భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ఊపందుకున్న నాటి నుంచి రెవెన్యూ యం త్రాంగంపై ఒత్తిడి పెరుగుతోంది. సాధారణ పని ఒత్తిడికి తోడు రికార్డులను సరిచేసే క్రమంలో స్థానికులు, రాజకీయ నాయకులు, గ్రామపెద్దల సిఫార్సులు, ఒత్తిళ్లతో రెవెన్యూ సిబ్బంది ఆందోళనలో మునిగిపోతున్నారు. రెవెన్యూ సిబ్బంది రికార్డులు సరిచేసేందుకు లంచాలు అడుగుతున్నారని, ఎకరానికి రూ.3 వేల చొప్పున ఇస్తేనే సరిచేస్తామంటున్నారని ఆరోపణలు వస్తున్నా యి. ఈ క్రమంలో ఇంతకుముందు మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తహసీల్దార్లు, ఆర్డీవోపై కూడా కేసులు నమోదయ్యాయి. తాజాగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి తహసీల్దార్, ఇతర రెవెన్యూ సిబ్బందిపై నాన్‌–బెయిలబుల్‌ కేసులు నమోదయ్యాయి. రెవె న్యూ అధికారులు ఒక రైతు ఆత్మహత్యకు కారణమయ్యారంటూ పెట్టిన ఈ కేసు... రెవెన్యూ శాఖలో అగ్గి రాజేసింది. ఇక అనుమతి లేకుండా నిరసన తెలియజేశారన్న కారణంగా గురువారం పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ జిల్లాలోని తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందికి చార్జ్‌మెమోలు ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్‌ (టీజీటీఏ) ఆధ్వర్యంలో.. రాష్ట్రంలోని పలువురు ఆర్డీవోలు, తహసీల్దార్లు శుక్రవారం సీసీఎల్‌ఏ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. అనంతరం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.

డీజీపీకి ఫోన్‌చేసి ఆరా తీసిన సీఎస్‌
తహసీల్దార్ల అసోసియేషన్‌ వినతిపత్రం అందించాక.. సీఎస్‌ ఎస్‌పీ సింగ్‌ జగిత్యాల ఘటనకు సంబంధించి డీజీపీ మహేందర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఏం జరిగిందన్న దానిపై ఆరా తీసి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక భూరికార్డుల ప్రక్షాళన, సాదాబైనామాల క్రమబద్ధీకరణ సందర్భంగా తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందికి ఇబ్బంది కలగకుండా పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజుల్లో లిఖిత పూర్వక ఆదేశాలు జారీచేస్తానని సీఎస్‌ హామీ ఇచ్చారని టీజీటీఏ నేత వి.లచ్చిరెడ్డి తెలిపారు. దీంతో ప్రక్షాళన కార్యక్రమాన్ని బహిష్కరించాలన్న యోచనను తాత్కాలికంగా విరమించుకుంటున్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు