మహిళలపై నేరాలను అరికట్టండి: బీజేపీ 

9 May, 2019 05:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు, హత్య లు, లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని, వెంటనే వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ నేతృత్వంలో బీజేపీ నేతల బృందం బుధవారం గవర్నర్‌ నరసింహన్‌ను కలసి వినతి పత్రం సమర్పించింది. తెలంగాణలో 2015 నుంచి 2017 వరకు 1,024 బాలికల మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయని, ఇందులో చాలామంది అమ్మాయిలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెడుతున్నారని, మరికొందరిని హత్య చేస్తున్నారని గవర్నర్‌కు ఈ బృందం వివరించింది. హాజీపూర్‌ గ్రామంలో బాలికల వరుస హత్యల ఘటనలో ఆ గ్రామం నుంచి భువనగిరికి, భువనగిరి నుంచి హైదరా బాద్‌కు ప్రజారవాణా సౌకర్యం లేకపోవడంతో మర్రి శ్రీనివాస్‌రెడ్డి బాలికలకు బైక్‌పై లిఫ్ట్‌ ఇచ్చి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డాడని తెలిపింది. గవర్నర్‌ను కలసిన వారిలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్, బీజేపీ మహిళా అధ్యక్షురాలు విజయ, మాధవి తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు