పట్టాలెక్కనున్న ‘ఏటీపీఎస్’

25 Nov, 2014 01:00 IST|Sakshi
పట్టాలెక్కనున్న ‘ఏటీపీఎస్’
  • ప్రమాదాల నివారణ ప్రయోగాలకు రైల్వే బోర్డు పచ్చజెండా
  •  లింగంపల్లి-వాడీ, వికారాబాద్-బీదర్ సెక్షన్లలో అమలు
  • తాండూరు: ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా.. వెనుక నుంచి రైళ్లు ఢీకొనకుండా ప్రమాదాలను నివారించేందుకు రైల్వే అధికారులు చేపట్టిన ఆటోమేటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (ఏటీపీఎస్) ప్రయోగాలు ఎట్టకేలకు పట్టాలెక్కనున్నాయి.

    హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్, మేథా, కర్నెక్స్ కంపెనీల ఆధ్వర్యంలో రెండేళ్లుగా చేసిన ప్రయోగాలకు రైల్వే బోర్డు సభ్యులు పచ్చజెండా ఊపారు. సోమవారం రైల్వే బోర్డు సభ్యులు ఏకే మిట్టల్(ఎలక్ట్రికల్), మరో అడిషనల్ మెంబర్ మనోహరన్( సిగ్నల్స్), సికింద్రాబాద్ డీఆర్‌ఎం ఎస్ కే మిశ్రా, మూడు కంపెనీల ప్రతినిధులు కుర్‌గుంట, నవాంద్గీ, మంతట్టి రైల్వే స్టేషన్‌ల మధ్య రైలులో వెళ్లి ప్రయోగాల తీరును పరిశీలించారు.

    ఈ ప్రయోగాల అమలుకు మొదటగా రైల్వేబోర్డు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను ఎంపిక చేసింది. లింగంపల్లి- వాడీ వరకు, వికారాబాద్-బీదర్ సెక్షన్ల మధ్య ఏటీపీఎస్‌ను మొదట అమలు చేయనున్నారు. ఈ రెండు సెక్షన్‌ల మధ్య సుమారు 40కి పైగా రైల్వేస్టేషన్ల పరిధిలో 40 రైలు ఇంజిన్లలో ఏటీపీఎస్ సాంకేతిక  పరికరాలను అమర్చనున్నారు.

    వచ్చే ఏడాది మార్చి- జూన్ మధ్య ఏటీపీఎస్‌ను అమలు చేయనున్నట్టు రైల్వే బోర్డు అడిషనల్ మెంబర్ (టెలి కమ్యూనికేషన్స్) మహేష్ మంగళ్ తెలిపారు. ప్రయోగాలకు రూ.22 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు.  ప్రస్తుతం ట్రైన్ కొలిజన్ అవైడింగ్ సిస్టమ్(టీకాస్)లో ఉన్న అన్ని అంశాలు ఏటీపీసీలో ఉంటాయన్నారు. ఇప్పటి వరకు చేసిన 32 ప్రయోగాలు విజయవంతం అయ్యాయని ఆయన వివరించారు.
     

మరిన్ని వార్తలు