కరోనా బాధితుల్లో ‘ప్రివొటెల్లా’

7 Jul, 2020 07:36 IST|Sakshi

కరోనా బాధితుల్లో తీవ్రత పెంచుతున్న ప్రివొటెల్లా బ్యాక్టీరియా

దీర్ఘకాలిక వ్యాధుల్లేని వారిలోనూ దుష్ప్రభావాలకు ఇదో కారణం

ఐసీఎంఆర్, ఎయిడ్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌ 

సంయుక్త పరిశోధనలో గుర్తింపు

కరోనా చికిత్సల్లో ప్రివొటెల్లా పరిస్థితిని పరిగణించాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: కరోనా బాధితుల్లో రోగనిరోధకశక్తి తగ్గుతున్న క్రమంలో శరీరంలో ఉండే బ్యాక్టీరియాలు కరోనా వైరస్‌కు సహకరిస్తున్నాయని ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) తాజా పరిశోధనలో తేలింది. ముఖ్యంగా ప్రివొటెల్లా బ్యాక్టీరియా ఎక్కువ ప్రొటీన్లు విడుదల చేయడంతో వైరస్‌ ప్రభావం మరింత పెరుగుతోందని, దీంతో కరోనా బాధితులు రిస్క్‌లో పడుతున్నట్లు గుర్తించింది. దేశంలో కరోనా తీవ్రత పెరిగిన వారిలో అసలు కారణాలను గుర్తించేందుకు నిర్దేశిత కేసుల హిస్టరీని సేకరించి మ్యాథమెటికల్‌ మోడల్‌లో పరిశీలించింది. ఐసీఎంఆర్‌.. తమ శాస్త్రవేత్తలతో పాటు జాతీయ ఎయిడ్స్‌ పరిశోధన సంస్థ ప్రతినిధులతో కలిసి ఈ పరిశీలన జరిపి పలు ఆసక్తికర అంశాలు గుర్తించింది. ప్రధానంగా ప్రివొటెల్లా బ్యాక్టీరియా కరోనా వైరస్‌కు నేరుగా కాకుండా ఉత్ప్రేరకంగా సహకరిస్తున్నట్లు ఈ పరిశోధనలో తేలింది.  ఫలితంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు లేని వారిలో కరోనా తీవ్రం కావడానికి ఇదే కారణమనే అంచనాకు వచ్చింది. ఈ క్రమంలో కరోనా చికిత్సలో ప్రివొటెల్లా స్థితిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది.

ప్రివొటెల్లా అంటే..?
ఇది బ్యాక్టిరాయిడెట్స్‌ వర్గానికి చెందిన గ్రామ్‌ నెగెటివ్‌ బ్యాక్టీరియా. గొంతు, అన్నవాహిక, మహిళల గర్భాశయ ముఖద్వారం లో ఇది పరాన్నజీవిగా ఉంటూ ఇతర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌కు ఉ త్ప్రేరకంగా పనిచేస్తుంది. ఈ బ్యాక్టీరియా వల్ల శరీరానికి ప్రత్యక్షంగా ఎలాంటి ఇన్ఫెక్షన్‌ ఉండనప్పటికీ ఇతర బ్యాక్టీరియాకు ఊతంగా పనిచేస్తున్నట్లు పరిశోధనల్లో గుర్తించారు. దీని పనితీ రు ఇతర వాటిపై అధికంగా ఉంటే ప్రొటీన్లు ఎక్కువ విడుదలవుతాయి. ఇది ఇతర భాగాలపై ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. కరోనా బాధితుల్లో రోగనిరోధకశక్తి క్రమంగా పడిపోతుంది. ఈ సమయంలో ప్రివొటెల్లా మరింత చురుగ్గా పనిచేసినప్పుడు ప్రొటీన్లు అధికసంఖ్యలో విడుదలై ఇతర కణా లను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా దంతక్షయం, ఊపిరితిత్తుల్లో నిమ్ముకు కారణమవుతుందని ఐసీఎంఆర్‌ గుర్తించిం ది. దీంతో బాధితులు మరింత రిస్క్‌లో పడతారు. ఈ సమయం లో ప్రివొటెల్లా పరిస్థితిపై దృష్టిపెడితే కరోనా చికిత్స సులభతరమవుతుందని తాజా పరిశోధన ద్వారా శాస్తవేత్తలు కనుగొన్నా రు. తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ హెల్త్‌ జర్నల్‌లో ఐసీఎంఆర్‌ పరిశోధనను ప్రచురించారు. ఇదే సమయంలో కరోనా చికిత్సలో ప్రివొటెల్లా స్థితిపైనా ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను ఇటీవల జారీచేసింది.

రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలి
దీర్ఘకాలిక వ్యాధుల్లేని వారిలో కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు చూస్తున్నాం. అయితే ఈ పరిస్థితికి కారణం మనలో ఉండే ప్రివొటెల్లా బ్యాక్టీరియా ప్రభావమని ఐసీఎంఆర్‌ చెబుతోంది. ఈ బ్యాక్టీరియా పనితీరులో మార్పుల ప్రభావం ఊబకాయం, దంత సమస్యలు, ఊపిరితిత్తుల్లో çనిమ్ము ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధకశక్తి పెంచుకోవడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. ప్రస్తుతం కరోనా వ్యాప్తిచెందిన వారిలో రోగనిరోధకశక్తి బలహీనపడి ప్రమాదకరంగా మారుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలి. యోగా, ప్రాణాయామం, సమతులాహారం, తగినంత నిద్ర ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.– డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాల

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు