నిత్యావసరాలకు ‘కరోనా’ సెగ 

5 Apr, 2020 03:42 IST|Sakshi

పది రోజుల్లో అమాంతం పెరిగిన ధరలు

అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి రూ. 60 నుంచి రూ. 100 పెరుగుదల

కొనలేక పేద, మధ్యతరగతి ప్రజల విలవిల

లాక్‌డౌన్‌తో రవాణా ఖర్చు పెరిగిందంటున్న వ్యాపారులు 

సాక్షిప్రతినిధి, సూర్యాపేట: నిత్యావసర సరుకులకు కరోనా వైరస్‌ సెగ తగిలింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో ఈ పదిరోజుల్లో వివిధ సరుకుల ధరలు ఒక్కసారిగా పెరగాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలంటే విలవిల్లాడుతున్నారు. ఆయా సరుకుల ధరలు సగటున కిలోకు రూ.60 నుంచి రూ.100 వరకు పెరిగాయి. లాక్‌డౌన్‌తో సరుకు రవాణా ఖర్చులు పెరిగాయని, అందుకే నిత్యావసరాల ధరలు పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.

ఎండుమిర్చిపై చైనా ప్రభావం.. 
సూర్యాపేట, ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాలనుంచి ఎండు మిర్చి ఏటా చైనాకు ఎగుమతి అవుతుంది. కరోనా వైరస్‌ ప్రబలడంతో ఆ దేశంలోకి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో వ్యాపారులు, రైతులనుంచి కొనుగోలు చేసిన మిర్చిని పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేయగా, మిగిలినది కోల్డ్‌ స్టోరేజీల్లో పెట్టారు. చైనాలో పరిస్థితులు చక్కబడ్డాక ఎగుమతి చేస్తే అధిక ధర వస్తుందన్న ఆలోచనలో వ్యాపారులున్నారు. ఈ కారణంగా బహిరంగ మార్కెట్‌లో మిర్చి నిల్వలు తగ్గాయి. దీంతో ఒక్కసారిగా ఎండుమిర్చి ధర బాగా పెరిగింది. ఈ పది రోజుల్లోనే కేజీ ధర సాధారణం కంటే అదనంగా రూ.70 వరకు పెరిగింది. వచ్చేది మామిడి పచ్చళ్ల సీజన్‌ కావడంతో ఇంకెంత పెరుగుతుందోనని పేదలు, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

రవాణా తగ్గి ఘాటెక్కిన అల్లం, వెల్లుల్లి ధరలు..  
లాక్‌డౌన్‌తో అల్లం, వెల్లుల్లి ధరలు ఘాటెక్కాయి. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ హోల్‌సేల్‌ మార్కెట్లకు కర్ణాటక, కేరళ రాష్ట్రాలనుంచి అల్లం, వెల్లుల్లి ఎక్కువగా దిగుమతి అవుతుంది. అలాగే మెదక్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో రైతులు పండించింది కూడా ఈ మార్కెట్లకు వస్తుంది. అయితే లాక్‌డౌన్‌తో కర్ణాటక, కేరళ రాష్ట్రాలనుంచి ఉభయ రాష్ట్రాలకు అల్లం, వెల్లుల్లి దిగమతి భారీగా తగ్గింది. కరోనా వైరస్‌ కారణంగా ఆయా రాష్ట్రాల్లో హోల్‌సేల్‌ మార్కెట్ల నుంచి ట్రక్కుల్లోకి సరుకు ఎత్తడానికి కూలీలు బయపడుతుండడంతో మన రాష్ట్రానికి తగినంతగా రావడం లేదని, అందుకే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కరోనా కట్టడికి అల్లం, వెల్లుల్లిని ఎక్కువగా వాడాలని సోషల్‌ మీడియాలో జరిగిన ప్రచారం కూడా ధర పెరగడానికి ఒక కారణమైందని అంటున్నారు. దీంతో అల్లం, వెల్లుల్లి ధర సగటున కేజీకి రూ.60 నుంచి 100 వరకు పెరిగింది.

చింత‘పండ’లేదని.. 
ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపూర్, కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం ప్రాంతాలనుంచి రాష్ట్రానికి చింతపండు దిగుమతి అవుతుంది. ఆయా ప్రాంతాల్లో ఈసారి చింతకాయ పంట దిగుబడి సరిగా లేనందున దీని ధర పెరిగినట్లు హోల్‌సేల్‌ వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇక కంది పప్పు, పెసరపప్పు, పేదలు వాడే మైసూర్‌ పప్పు (ఎర్రపప్పు)ల ధరలు కూడా కేజీకి రూ.10 నుంచి రూ.20 వరకు పెరిగాయి. రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌లో కంది పంట దిగుబడి ఎక్కువగా వచ్చింది. గత సంవత్సరం కొనుగోలు చేసిన దాంట్లో చాలావరకు మార్క్‌ఫెడ్‌ గోదాముల్లో నిల్వ ఉండడంతో కంది పప్పు ధర మాత్రం స్వల్పంగానే పెరిగింది.

రిటైల్‌ దుకాణాల్లో నిత్యావసరాల ధరలు (కిలో.. రూపాయల్లో) ఇలా.. 

మరిన్ని వార్తలు