పప్పుల ధరలు పైపైకి

20 Apr, 2016 07:27 IST|Sakshi
పప్పుల ధరలు పైపైకి

* గ్రేడ్-1 కంది కిలో ధర రూ.145 నుంచి రూ.150, గ్రేడ్-2 రూ.125 నుంచి రూ.130
* గత ఏడాదితో పోలిస్తే రూ.50 నుంచి రూ.60 మేర ఎక్కువ
* తగ్గిన పప్పుధాన్యాల దిగుబడి

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి భగభగల మాదిరే.. పప్పుల ధరలు దడ పుట్టిస్తున్నాయి. పప్పుధాన్యాల దిగుబడి, పప్పుల దిగుమతి పడిపోయింది. వినియోగదారుల దిగులు పెరిగిపోయింది. దీంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ధరలు మండిపోతున్నాయి. గడిచిన నెల రోజుల్లోనే కందిపప్పు ధర రూ.10 మేర పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరలు అదనంగా రూ.50 నుంచి రూ.60 వరకు పెరిగాయి.

గత ఏడాది ఖరీఫ్‌లో మొత్తంగా 4.67 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాలు సాగు కావాల్సి ఉండగా కేవలం 3.17 లక్షల హెక్టార్లలోనే రైతులు సాగు చేశారు. పెసర 48 శాతం, మినుములు 45 శాతం, కందులు 78 శాతం మేర సాగు అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీంతో పప్పుధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. కంది మొత్తం ఉత్పత్తి లక్ష్యం 1.67 లక్షల మెట్రిక్ టన్నులుండగా అది 1.05 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయింది.

మహారాష్ట్రలో కంది సాగు తగ్గిపోవడంతో అక్కడి నుంచి దిగుమతులు పూర్తిగా క్షీణించాయి. దీనికి తోడు రబీలోనూ కంది సాగు తగ్గడం ధరల పెరుగుదలకు కారణమవుతోంది. గత ఏడాది ఇదే సమయానికి కిలో కంది గ్రేడ్-1 రకం రూ.90 ఉండగా అది ఈ ఏడాది ఏకంగా రూ.145 నుంచి రూ.148 మధ్య ఉంది. ఇక గ్రేడ్-2 కంది ధర గత ఏడాది రూ.82 నుంచి రూ.85 మధ్య ఉండగా, ప్రస్తుతం రూ.125 నుంచి రూ.128 వరకు ఉంది. ఈ ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశముంది.
 
రంగంలోకి కేంద్రం
రాష్ట్రంలో మున్ముందు పప్పుల ధరలు మరింత పెరిగే అవకాశముంది. డిమాండ్‌ను ఆసరాగా తీసుకొని వ్యాపారులు నిల్వలను దాచేసి కృత్రిమ కొరత సృష్టించే అవకాశాలున్న దృష్ట్యా ప్రభుత్వం రంగంలోకి దిగింది. పప్పుల నిల్వలపై పరిమితిని నిర్దేశిస్తూ గత ఏడాది సెప్టెంబర్‌లో ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని రాష్ట్రాలకు రెండు రోజుల కిందట ఆదేశాలు జారీ చేసింది.  దీంతోపాటే భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) కేంద్ర ఆదేశాల అనుగుణంగా ఇప్పటికే 25 వేల మెట్రిక్ టన్నుల కందిపప్పును సేకరించి అదనపు నిల్వలు(బఫర్ స్టాక్) సిద్ధం చేసి పెట్టుకుంది.

రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాలు ఏ మేరకు ఉంటాయో అంచనా ఇవ్వాలని, డిమాండ్‌కు అనుగుణంగా తన బఫర్ స్టాక్ నుంచి పప్పుల విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ అవసరాలు తీరాక మిగులు ఉంటే, రాష్ట్ర సమ్మతి మేరకు ఇతర రాష్ట్రాల అవసరాలకు మార్కెట్‌లోకి ఇదే బఫర్ స్టాక్‌ను విడుదల చేస్తామని తెలిపింది.

మరిన్ని వార్తలు