కన్నవారి ఆశలు...గల్లంతు

9 Jun, 2014 10:31 IST|Sakshi
కన్నవారి ఆశలు...గల్లంతు
  •  సమాచారం అందక విలపిస్తున్న బంధువులు
  •  జాడ లేని కళాశాల యాజమాన్యం
  • నగరం శోకసంద్రమైంది.. సర్వత్రా విషాదం అలముకుంది.. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.. హిమాచల్‌ప్రదేశ్ విహారయాత్ర విషాదంగా మారి నగరానికి చెందిన 24 మంది విద్యార్థులు గల్లంతైన ఘటన సిటీవాసులను తీవ్రంగా కలచివేసింది. విహారయాత్రకు వెళ్లిన తమ పిల్లలు త్వరలో తిరిగి వస్తారని ఆశగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకీ వార్త తీరని గుండెకోతను మిగిల్చింది. చార్‌ధామ్ ఘటనను మరువక ముందే మరో విషాదం సంభవించ డాన్ని నగరవాసులు జీర్ణించుకోలేక పోతున్నారు.

    విజ్ఞానంతోపాటు విహారం అందిస్తుందనుకున్న యాత్ర తమ పిల్లల జీవితాల పాలిట విషాదయాత్రగా పరిణమించడంతో తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా ఉంది. పలువురు విద్యార్థుల కుటుంబాల్లో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. విద్యార్థుల క్షేమసమాచారాలు తెలుసుకునేందుకు వారి తల్లిదండ్రులు తెల్లవార్లూ నిద్ర లేకుండా గడిపారు.

    యాత్రలో పాల్గొన్న విద్యార్థులతో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల బంధువులు వారి కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు. తమ పిల్లలను క్షేమంగా నగరానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
     
    జగద్గిరిగుట్ట(బాచుపల్లి), న్యూస్‌లైన్:  హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం కులుమనాలి సమీపంలోని బియాస్ నదిలో కొట్టుకుపోయిన విద్యార్థుల ఆచూకీ కోసం నగరంలో వారి తల్లిదండ్రులు, బంధువులు కళాశాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లిలోని వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలకు చెందిన 48 మంది విద్యార్థులు ఈ నెల 3న విహారయాత్రకు హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లారు.

    వీరిలో పలువురు నదిలో ఫొటోలు దిగుతుండగా కొట్టుకుపోయారని వెలువడిన వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రులు కలత చెందారు. ఆదివారం రాత్రి పెద్దసంఖ్యలో కళాశాల వద్దకు వచ్చారు. తమ వారి ఆచూకీ తెలపాలంటూ విలపించారు. దూర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల తల్లిద్రండులు కళాశాల సమీప ప్రాంతాల్లో ఉంటున్న తమ బంధువుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. విహారయాత్రకని పంపిస్తే ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తదితరులు కళాశాలకు వచ్చి విద్యార్థుల వివరాలపై ఆరా తీశారు.         
     
     పత్తాలేని యాజమాన్యం..

    విద్యార్థుల ఆచూకీ తెలుసుకునేందుకు కళాశాల వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు, బంధువులకు తగిన సమాచారం అందించేందుకు కళాశాలలో ఎవరూ అందుబాటులో లేకుండా పోయారు. యాజమాన్యం సైతం జాడ లేదు. పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాసరావు కళాశాల వద్ద నుంచి ఫోన్‌లో ప్రిన్సిపాల్‌ను సంప్రదించగా తాను వస్తున్నానంటూ చెప్పి ఎంతకీ రాలేదు. ఆయన కోసం ఏసీపీ మూడు గంటల పాటు నిరీక్షించారు. కళాశాల యాజమాన్యం అటు పోలీసులు ఇటు విద్యార్థుల బంధువులకు సహకరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తమైంది.

     గతంలోనూ ఇదే విధంగా..

     2012లో ఇలాగే గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్ట్‌కు ఈ కళాశాల విద్యార్థులు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ ముగ్గురు విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. ఆ ఘటనతోనైనా విద్యార్థులను బయటకు పంపేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే తాజా ఘటన జరిగి ఉండేది కాదని బాధితులు వాపోయారు.
     

మరిన్ని వార్తలు