పడకేసిన ప్రాథమిక వైద్యం

2 Feb, 2019 02:11 IST|Sakshi

పీహెచ్‌సీల్లో వైద్య సిబ్బంది కొరతతో అందని సేవలు

విధులకు డుమ్మా కొట్టే సిబ్బందితోనూరోగులకు తిప్పలే

24 గంటలు సేవలందించే ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి

పలు ఆస్పత్రుల్లో కాన్పులు కూడా చేయని వైనం..

సాక్షి, హైదరాబాద్‌: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)లో వైద్య సేవలు పడకేశాయి. పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది లేక గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్య సేవలు అందడం లేదు. సిబ్బంది ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవడంతో వైద్యం చేసే నాథుడు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని చోట్ల వైద్య సిబ్బంది విధులకు డుమ్మా కొడుతుండటంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల ఆస్పత్రులకు వస్తున్న గర్భిణులు సైతం అక్కడ వైద్య సిబ్బంది లేక వెనుదిరుగుతున్నారు. దీంతో స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వైద్యుల ఖాళీలను భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు.

294 వైద్య పోస్టుల ఖాళీలు..
పీహెచ్‌సీలు గ్రామాల్లో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తుంటాయి. చిన్నచిన్న అనారోగ్య సమస్యలు మొదలు ఒకస్థాయి వరకు అక్కడ వైద్య సేవలు పొందొచ్చు. మరోవైపు టీకాలు వేయడం కూడా పీహెచ్‌సీల ద్వారానే జరుగుతోంది. తెలంగాణ సామాజిక అభివృద్ధి నివేదిక–2017 ప్రకారం రాష్ట్రంలో 668 పీహెచ్‌సీలున్నాయి. వాటిల్లో 24 గంటలు పనిచేసేవి కూడా కొన్ని ఉన్నాయి. వాటిల్లో ప్రసవాలు సైతం చేస్తారు. అత్యవసర వైద్య సేవలూ అందుబాటులో ఉంటాయి. వీటిల్లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు నర్సులు, ఒక సహాయకుడు ఉండాలి. కానీ అనేకం ఖాళీగా ఉన్నాయి. మొత్తం పీహెచ్‌సీల్లో 1,318 అల్లోపతి వైద్యుల పోస్టులకు గాను, 1,024 మంది వైద్యులు మాత్రమే పనిచేస్తున్నారు.

ఇంకా 294 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని ఖాళీలను భర్తీ చేసినా పట్టణ పీహెచ్‌సీలతో కలుపుకుంటే 350 ఖాళీలున్నట్లు ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. పైగా చాలా ఆస్పత్రుల్లో వైద్యులు కూడా విధులకు వెళ్లకపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారిపై పర్యవేక్షణ కూడా లేదు. దీంతో గ్రామాల్లో ప్రాథమిక వైద్యం అందడం గగనంగా మారింది. కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రవేశ పెట్టిన తర్వాత ప్రసవాల కోసం గర్భిణులు ఎక్కువగా 24 గంటల పీహెచ్‌సీలకు వస్తున్నారు. అయితే అక్కడా సరైన వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో వారు దూర ప్రాంతాలకు వెళ్లలేక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

ఇతర వైద్య సిబ్బంది ఖాళీలూ అధికమే
పీహెచ్‌సీలతోపాటు సబ్‌సెంటర్లలో 9,141 మంది ఆరోగ్య కార్యకర్తలు పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం 7,705 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 1,436 ఖాళీలున్నట్లు సదరు నివేదిక తెలిపింది. అంతేకాదు పీహెచ్‌సీల్లో ఆరోగ్య సహాయకులు 1,111 మంది ఉండాల్సి ఉండగా, 944 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా 167 ఖాళీలున్నాయి. సీహెచ్‌సీలు మొదలుకుని పీహెచ్‌సీల్లో లేబొరేటరీ టెక్నీషియన్లు 765 మంది ఉండాల్సి ఉండగా, 566 మందే పనిచేస్తున్నారు.

ఇంకా 199 ఖాళీలున్నాయి. వాటిల్లో నర్సులు 1,666 మంది ఉండాల్సి ఉండగా, 1,453 మందే ఉన్నారు. ఇంకా 213 ఖాళీలున్నాయి. పీహెచ్‌సీల్లో బ్లాక్‌ ఎక్స్‌టెన్షన్‌ ఎడ్యుకేటర్‌ పోస్టులు 633 ఉండాల్సి ఉండగా, 544 మంది పనిచేస్తున్నారు. ఇంకా 89 ఖాళీలున్నట్లు నివేదిక తెలిపింది. పీహెచ్‌సీల్లో ఖాళీలున్నమాట వాస్తవమేనని, త్వరలో సర్దుబాటు చేసి వాటిని పటిష్టం చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు.

మరిన్ని వార్తలు