‘ఆదిమ’ గుహలను మింగిన క్వారీలు

11 Apr, 2015 01:32 IST|Sakshi
  • కోకాపేట గుహల్లో అద్భుత వర్ణ చిత్రాలు
  •  మూడున్నర వేల ఏళ్ల క్రితం నాటి ఆధారాలు
  •  35 ఏళ్ల క్రితమే గుర్తించిన నాటి పురావస్తు డెరైక్టర్ కృష్ణశాస్త్రి
  •  ఆ తర్వాత పట్టించుకోని ప్రభుత్వాలు
  •  క్వారీలతో ధ్వంసమైన గుట్టలు, కనుమరుగైన చిత్రాలు
  •  మూడొంతులు పోగా మిగిలినవి కొన్నే
  •  హైదరాబాద్ శివారులోనే మసకబారుతున్న ఆదిమ చరిత్ర
  • సాక్షి, హైదరాబాద్: మానవ పరిణామక్రమాన్ని తెలుసుకునేందుకు ఆదిమ కాలం నాటి ఆధారాలే కీలకం. అందుకే అలాంటి ఆనవాళ్లున్న ప్రదేశాలను ప్రభుత్వాలు పదిలంగా కాపాడుతుంటాయి. అవి పరిశోధకులకు, పర్యాటకులకు కేంద్రంగా నిలుస్తాయి. అప్పటి గుహలు, సమాధుల్లో లభించే ఆధారాలే నేటి తరానికి గొప్ప వారసత్వ సంపద. హైదరాబాద్ శివారులోనే ఉన్న అలాంటి ప్రాం తం క్రమంగా కాలగర్భంలో కలి సిపోతోంది. అది నిర్దాక్షిణ్యంగా క్వా రీల పాలైంది. అక్కడి అతి అరుదైన, పురాతన సాక్ష్యాలన్నీ ధ్వంసమయ్యాయి. దాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. దీంతో దాదాపు 3500 సంవత్సరాల క్రితం నాటి ఆదిమ మానవులు గీసిన ‘చిత్ర’ విన్యాసాలు దారుణంగా దెబ్బతిన్నాయి.
       
    ధ్వంసమైందిలా...

    క్రమంగా నగరం విస్తరించడంతో గండి పేట చుట్టూ నివాసాలు వెలిశాయి. ఈ క్రమంలో ఆదిమానవుల చిత్రాలున్న గుట్టలు క్వారీలకు బలయ్యాయి. అయితే ఆదిమానవుల చిత్రాలున్న ఓ గుహను స్థానికులు పురాతన ఆలయంగా భావించేవారు. దాన్ని కూల్చితే అరిష్టం జరుగుతుందని భావించి ఆ ఒక్క దాన్ని మాత్రం వదిలి మిగతా గుట్టను పూర్తిగా ధ్వంసంచేశారు. కానీ పేలుళ్ల ధాటికి గుహలోని చిత్రాలు చాలావరకు దెబ్బతిన్నాయి. గుహ పైకప్పు పొర దెబ్బతిని అక్కడి చిత్రాలు పూర్తిగా పోయాయి. క్వారీ దుమ్ము, వ ర్షం నీటితో కొన్ని చిత్రాలు పూర్తిగా మసకబారిపోయాయి. ఎద్దుల సమూహం.. ఆ మొత్తాన్ని నియంత్రిస్తున్న ఓ వ్యక్తి.. అతని ముందు చేప ఆకారంతోపాటు మరోచోట కొందరు వ్యక్తులు నృత్యం చేస్తున్నట్టు ఉన్న చిత్రాలు మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్థల యజమానులతో చర్చించి కోకాపేట గుహలను రక్షిత ప్రాంతంగా గుర్తించాలి. మిగిలిన చిత్రాలనైనా పదిలపరచాలి.
     
    కూతవేటు దూరంలోనే..

    నగర దాహార్తిని తీర్చే గండిపేట చెరువుకు కూతవేటు దూరంలో కోకాపేట శివారులోని గుట్టపై పురాతన గుహలు ఉన్నాయి. వాటిలో ఆదిమ మానవుల కాలం నాటి చిత్రాలున్నాయి. అయితే ఈ స్థలం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉండటంతో దాన్ని క్వారీలుగా మార్చేశారు. అక్కడి గుట్టలను పేల్చేశారు. దీంతో ఇక్కడి 2 గుహల్లో ఇప్పటికే ఒకటి  పూర్తిగా ధ్వంసమైంది. చుట్టూ గుట్టను తొలిచేసి మరో గుహను మాత్రం మిగిల్చారు. 130 అడుగుల ఎత్తులో ఉన్న ఆ గుహను చేరుకోవడం కూడా ఇప్పుడు కష్టంగా మారింది. ప్రస్తుతం రాష్ర్టవ్యాప్తంగా ఇలాంటి గుహలు 16 మాత్రమే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో చారిత్రక ప్రాంతాలను ప్రజలకు చేరువ చేసిన వేలూరి వెంకట కృష్ణశాస్త్రి ఈ కోకాపేట గుహలను కూడా 1980లోనే అధికారికంగా గుర్తించారు. అప్పట్లో ఆయన ఆంధ్రప్రదేశ్ పురావస్తు విభాగం సంచాలకులుగా ఉన్నారు. వృద్ధాప్యంతో ఆయన పరిశోధనలకు దూరం కావడంతో ఈ గుహల సంగతి మరుగునపడింది. ఆ తర్వాత  ప్రభుత్వాలకు అసలు అక్కడ గుహలున్న సంగతే తెలియలేదు. ‘ప్రోటో హిస్టారికల్ కల్చర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పుస్తకంలో కృష్ణశాస్త్రి ఈ గుహల వివరాలను పదిలపరిచారు.
     
    కంటికి రెప్పలా కాపాడాలి

    ‘ఆదిమానవులు చిత్రించిన రాతి చిత్రాలు అత్యంత విలువైనవి, అంతకుమించి అరుదైనవి. భావి తరాలకు వాటి గొప్పతనం తెలియాలంటే వాటిని కంటికి రెప్పలా కాపాడాలి. అవి ధ్వంసమైతే మళ్లీ దొరకవు. హైదరాబాద్‌లాంటి నగరానికి అలాంటి గుహలు అతి చేరువలో ఉండటం ఓ రకంగా అదృష్టమే. త్వరలో దాన్ని పరిశీలిస్తాను’
     - డాక్టర్ ఎన్ చంద్రమౌళి, రాక్ ఆర్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా
     సంయుక్త కార్యదర్శి

మరిన్ని వార్తలు