సారీ...నో డ్రైవింగ్‌ లైసెన్స్‌..

27 Apr, 2019 08:22 IST|Sakshi

2 నెలలుగా స్తంభించిన డ్రైవింగ్‌ లైసెన్సులు,ఆర్సీల జారీ

పెండింగ్‌లో  1.50 లక్షల కార్డులు మొరాయిస్తున్న ప్రింటర్లు

గత రెండేళ్లుగా ఇదే తంతు వాహనదారుల అవస్థలు  

సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏలో  డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీల జారీ  మరోసారి స్తంభించింది. దాదాపు 1.5 లక్షల స్మార్ట్‌కార్డుల పంపిణీ పెండింగ్‌ జాబితాలో పడింది. దీంతో  డ్రైవింగ్‌ లైసెన్సు పరీక్షలకు  హాజరైన వారు,  కొత్త వాహనాలను నమో దు చేసుకొన్న వాహనదారులు గత రెండు నెలలు గా   డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీల కోసం పడిగాపులు కాస్తున్నారు. నిబంధనల  మేరకు రూ.వేలల్లో ఫీజులు చెల్లించినప్పటికీ   సకాలంలో లైసెన్సులు, ఆర్సీ కార్డులను అందుకోలేకపోతున్నా రు. గ్రేటర్‌ పరిధిలోని అన్ని  ఆర్టీఏ  కార్యాలయాలతో పాటు, జిల్లాల్లోనూ  ప్రతి ఆర్టీఏ  కార్యాలయం పరిధిలో  సుమారు  8 వేల నుంచి  10 వేలకు పైగా   డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీల పంపిణీ  నిలిచిపోయింది. స్పీడ్‌ పోస్టు  ద్వారా  వారం రోజుల్లో వాహనదారుల ఇంటికి చేరాల్సిన  స్మార్ట్‌కార్డులు  2 నెలలు దాటినా  అందకపోవడంతో వాహనదారులు ఆర్టీఏ  కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిబంధనల మేర కు స్మార్ట్‌ కార్డు ప్రింటింగ్‌ ఖర్చుతో పాటు, పోస్టల్‌ చార్జీలు, వివిధ పౌరసేవల ఫీజులు, తదితర ఖర్చులన్నీ కలిపి రూ.వేలల్లో వసూలు చేస్తున్న  అధికారులు సకాలంలో  సేవలను అందజేయకపోవడం పట్ల  వాహనదారులు ఆగ్రహం  వ్యక్తం చేస్తున్నారు. గత  రెండేళ్లుగా తరచూ కార్డుల కొరత  తలెత్తుతుండటంతో నెలల తరబడి పంపిణీ స్తంభించిపోతోంది. అయినాప్రభుత్వం ఇప్పటి  వరకు శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు  చేపట్టకపోవడం గమనార్హం. 

బకాయిలే కారణం...
డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీలు, వివిధ రకాల పౌరసేవల రెన్యువల్స్‌ పత్రాలను  రవాణాశాఖ స్మార్ట్‌కార్డుల రూపంలో  అందజేస్తోంది. ఇందులో భాగంగా కార్డులు, ప్రింటింగ్‌కు  అవసరమయ్యే రిబ్బన్‌లు, తదితర సామాగ్రిని  ప్రైవేట్‌ సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఏటా సుమారు 21 లక్షల కార్డుల కోసం కాంట్రాక్టు పద్ధతిలో కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ స్టేట్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌  ద్వారా టెండర్లను నిర్వహించి అర్హత కలిగిన సంస్థలను ఎంపిక చేస్తారు. పూణేకు చెందిన ఎం–టెక్‌ సంస్థ  గత కొన్నేళ్లుగా స్మార్ట్‌కార్డులను సరఫరా చేస్తోంది. ఒక్కో  కార్డుకు  రూ.21 చొప్పున చెల్లించి  సదరు సంస్థ నుంచి కార్డులను కొనుగోలు చేస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా  రవాణాశాఖ   బకాయిలు  చెల్లించకపోవడంతో  సదరు సంస్థ  తరచూ కార్డుల  సరఫరాను నిలిపివేస్తోంది. ఇప్పటి వరకు సుమారు రూ.7 కోట్ల మేర బకాయిలు ఎం.టెక్‌కు చెల్లించాల్సి ఉన్నట్లు అంచనా. దీంతో రెండేళ్లుగా  కార్డు ల జారీకి బ్రేక్‌ పడుతూనే ఉంది. పెద్ద సంఖ్యలో కార్డుల ప్రింటింగ్‌ స్తంభించిన ప్రతిసారీ  వాహనదారులు  తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

కాంట్రాక్టర్‌ మారితే పరిష్కారం లభిస్తుందా...
ఒకవైపు  కార్డుల కొరత ఇలా కొనసాగుతుండగానే మరోవైపు రవాణా అధికారులు  పాత కాంట్రాక్ట్‌  స్థానంలో మూడు రోజుల క్రితం కొత్త  సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. పూణేకు చెందిన  ఎం–టెక్‌ సంస్థకు బదులు  తాజాగా ఖైరోస్‌ అనే కొత్త సంస్థకు కార్డుల సరఫరా  కాంట్రాక్టును కట్టబెట్టారు. పాత సంస్థ  రూ.21 కి ఒక కార్డు చొప్పున అందజేస్తుండగా, ఖైరోస్‌ మాత్రం రూ.19.17 కే కార్డు చొప్పున ప్రింట్‌ చేసి ఇచ్చేందుకు ముందుకు రావడంతో పాత సంస్థ స్థానంలో కొత్త  సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా ఏ సంస్థకైనా కార్డులు  సరఫరా చేయాలంటే  డబ్బులు  చెల్లించాల్సిందే.  

మొరాయిస్తున్న ప్రింటర్లు...
మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో  డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీలు ప్రింట్‌ చేసే యంత్రాలు కూడా  పాడయ్యాయి. కొన్ని చోట్ల పూర్తిగా పనికి రాకుండా పోయాయి. కొన్ని ఆర్టీఏ కేంద్రాల్లో పని చేస్తున్నప్పటికీ వాహనదారుల డిమాండ్‌కు తగిన విధంగా కా>ర్డులను ప్రింట్‌ చేసి అందజేయలేకపోతున్నారు. ఒకవైపు సకాలంలో స్మార్ట్‌ కార్డులు సరఫరా కాకపోవడం, మరోవైపు ప్రింటర్లు మొరాయించడంతో  కొన్ని చోట్ల  2 నుంచి 3 నెలల వరకు కూడా  వినియోగదారులకు స్మార్ట్‌కార్డులు  అందజేయలేకపోతున్నారు. కార్డులు, ప్రింటర్లు, టెక్నికల్‌ సామాగ్రి, వాహనాల అద్దెలు, తదితర ఖర్చులన్నీ  కలిపి  సుమారు రూ.26 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిధులు మంజూరు చేయాలని ఏడాదిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా స్పందన లేదని, దీంతో అన్ని రకాల కార్యకలాపాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని  పేర్కొన్నారు.  

ఇంత నిర్లక్ష్యమా...
జీవితకాల పన్ను, త్రైమాసిక పన్ను, వివిధ రకాల పౌరసేవలపై విధించే  ఫీజులు, అపరాధ రుసుములు, పర్మిట్లు, తదితర రూపంలో  రవాణాశాఖకు ఏటా రూ.6 వేల కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. పౌరసేవలకు సంబంధించి  ముఖ్యంగా  డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీలు, రెన్యువల్స్, తదితర సేవల కోసం ఆన్‌లైన్‌లో వాహనదారుల నుంచి ఫీజులు ముందే వసూలు చేస్తారు. ఉదాహరణకు డ్రైవింగ్‌ లైసెన్సు కోసం రూ.1500 ఫీజు ఉంటే అందులో నిర్ధారిత ఫీజు మినహాయించి  కార్డు ధర, ప్రింటింగ్‌ ఖర్చు,  స్పీడ్‌ పోస్టు కోసం  రూ.250 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా అన్ని రకాల ఫీజులు ముందే చెల్లించినప్పటికీ  వినియోగదారులకు సకాలంలో పౌరసేవలను మాత్రం అందజేయలేకపోతున్నారు. ఏటా రూ.6 వేల కోట్ల ఆదాయాన్ని సముపార్జించే రవాణాశాఖ కేవలం   రూ.26 కోట్ల  బకాయిలు చెల్లించలేక, వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు