ఖైదీ..కళ

5 May, 2018 09:56 IST|Sakshi
ఖైదీలు గీసిన చిత్రాలు..

చిత్రలేఖనంలో ఖైదీల ప్రతిభ

జైల్లోని ఖైదీలు.. కుంచెతో అద్భుతాలుచేస్తున్నారు. జీవితసారాన్ని తెలుసుకుంటూ కళాత్మక రంగంలో రాణిస్తున్నారు. నగరానికి చెందిన కళాకృతి ఆర్ట్‌ గ్యాలరీ, జైళ్ల శాఖ సంయుక్తాధ్వర్యంలో చేపట్టిన ఓ వినూత్న కార్యక్రమంతో ఇది సాధ్యమవుతోంది. ఖైదీల జీవితాల్లోసరికొత్త మార్పుకు కారణమవుతోంది.  

కారాగారాల్లో కటకటాలను తడుముతూ గడిపే చేతులు... కుంచెను పట్టాయి. కుటుంబానికి, సమాజానికి దూరంగా భారంగా నడుస్తున్న బతుకులకు కళ జీవం పోస్తోంది. బాహ్య ప్రపంచంతో వారిని అనుసంధానిస్తోంది. 2016లో నగరానికి చెందిన కళాకృతి ఆర్ట్‌ గ్యాలరీప్రారంభించిన ఓ వైవిధ్యభరితమైన కార్యక్రమం... ఖైదీల ‘కల’లకు సరికొత్త ‘కళ’ను అద్దుతోంది.

సాక్షి, సిటీబ్యూరో  : బంజారాహిల్స్‌లోని కళాకృతి ఆర్ట్‌ గ్యాలరీలోకి అడుగిడితే మనల్ని ఆకట్టుకునేవి చిత్రాలు మాత్రమే కాదు... అవి గీసిన చేతుల కథలు కూడా. నగరంలోని చంచల్‌గూడ, చర్లపల్లి కారాగారాలకు చెందిన 21 మంది ఖైదీలకు ఇప్పుడు చిత్రలేఖనం అనేది జీవితాల్లో చిత్రమైన మార్పుకు కారణంగా మారింది. ప్రస్తుతం ఖైదీలు గీసిన చిత్రాలను బంజారాహిల్స్‌లోని కళాకృతి ఆర్ట్‌ గ్యాలరీలో ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శన మే 7 వరకు కొనసాగుతుంది.

అమ్మకంతో ఆదాయం..
జైళ్లలోని ఖైదీల్లో మార్పు కోసం కళాకృతి ఆర్ట్‌ గ్యాలరీతో కలిసి తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్‌ ఆధ్వర్యంలో 2016లో ‘జైల్లో ఆర్ట్‌ క్లాసెస్‌’కు నాంది పలికారు. అప్పటి నుంచి ఇది బలోపేతమవుతూ వచ్చింది. ఈ చిత్రాల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఖైదీల కుటుంబాలకు అందజేస్తున్నారు. వారానికి రెండుసార్లు చిత్రకారుడు సయ్యద్‌ షేక్‌ ఈ రెండు జైళ్లను సందర్శిస్తారు. ఖైదీలకు చిత్రాలు గీయడం నేర్పిస్తారు. ‘ఈ కాన్సెప్ట్‌ గురించి తొలుత రేఖా లహోటి (కళాకృతి ఆర్ట్‌ గ్యాలరీ నిర్వాహకురాలు) నన్ను సంప్రదించినప్పుడు చాలా భయపడ్డాను. చేయనని చెప్పేశాను. అయితే ఆమె నాకు విడమరిచి చెప్పారు. ఇది కేవలం శిక్షణ ఇవ్వడం కాదని, జీవితాలను మలచడమని ఆమె వివరించారు. మొత్తానికి నన్ను ఒప్పించారు. తొలి దశలో ఖైదీలు దగ్గరకు వస్తుంటే నేనంత దూరం జరిగిపోయేవాణ్ని. అయితే ఆ తర్వాత్తర్వాత ఈ అవకాశం ఎంత గొప్పదో నాకు అర్థమైంది. ఇది నాకు ఒక జీవిత కాలంలోనే అత్యంత సంతృప్తిని అందించిన అనుభవం’ అని చెప్పారు సయ్యద్‌ షేక్‌.

కళాఖండాలు...కారాగారాలు  
ఆ చిత్రాలను చూస్తే... ఎలాంటి ముందస్తు అనుభవం లేకుండా గీసిన చిత్రాలంటే అసలు నమ్మలేం. చేయి తిరిగిన చిత్రకారుడి ప్రతిభ అంత చక్కగా ఉంటాయవి. ‘వాళ్లు గతంలో ఎప్పుడూ కాన్వాస్‌ మీద చిత్రాలు గీసిన వారు కానప్పటికీ... వాళ్లలో కొంత మందికి జైలుకి రాకముందు కార్పెంటర్స్‌గా, సైన్‌బోర్డ్‌ వర్కర్స్‌గా, వాల్‌ పెయింటర్స్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఆయా వృత్తుల వ్యాపకాల పరంగా కొంత సృజనాత్మక సామర్థ్యాలు ఎలాగూ అవసరం. కాబట్టి.. అలా కొందరు తేలికగానే చిత్రకారులైపోయారు. మరోవైపు సహజంగానే కొందరు ఏక సంథాగ్రాహులుగా ఉన్నారు. వీరంతా అద్భుతాలు చిత్రించగలిగారు’ అని వివరించారు సయ్యద్‌.

కళాత్మక దృక్పథం...మార్చింది జీవితం  
‘ఖైదీలతో ఎక్కువ సమయం గడపిన క్రమంలోనే వారి జీవితాలను, నేపథ్యాలను తెలుసుకునేందుకు అవకాశం వచ్చింది. చాలా మంది నన్ను కేవలం ఆర్ట్‌ టీచర్‌గా మాత్రమే కాకుండా... మరింత దగ్గరగా చూశారు. ఒకసారి పెయింటింగ్‌ ప్రారంభించగానే దానిపై నిమగ్నమయేవారు. అంతగా వారు ఈ కళపై ఆసక్తి పెంచుకున్నారు. ఎప్పుడైన వాళ్లు అలసటగా ఫీలైతే... ఆ విరామంలో తమ వ్యక్తిగత జీవిత విషయాలను, కథలు, వ్యథలను నాతో పంచుకునేవారు. తాము జైలుపాలు కావడానికి కారణాలు చెప్పేవారు. జేబులు కొట్టడం లాంటి నేరాల దగ్గర్నుంచి స్నాచింగ్‌లకు పాల్పడ్డవారు, హత్యలు, అత్యాచారాలు చేసిన వారు కూడా ఉన్నారు. అయితే వారితో అంతకాలం గడిపాక, వారి చిత్రలేఖనం చూశాక వాళ్లు అలాంటి క్రూరమైన నేరాలు చేశారంటే నమ్మడం కష్టంగా అనిపించేది.

ముఖ్యంగా పెయింట్‌ చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా, నిశబ్దంగా ఉండేవారు. ఒకసారి ల్యాండ్‌ స్కేప్స్, ప్రకృతి దృశ్యాలు, పర్వతాలు, పంట పొలాలను గీస్తున్నప్పుడు వాళ్లలో ఒకరు ఏడవడం ప్రారంభించారు. ఎందుకంటే.. తాను వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చాడు. ఆ చిత్రాలు అతనికి తన పొలాన్ని గుర్తు చేశాయి. తాము చేసిన పనులకు పశ్చాత్తాపం పడుతున్నట్టు వాళ్లు నాకు చెప్పేవారు’ అన్నారు సయ్యద్‌. తాము పెయింటింగ్స్‌ వేయగలగమని ఎప్పుడూ అనుకోలేదని, పెయింటింగ్స్‌ వేస్తూ కూడా హాయిగా బతకొచ్చునని అనుకొని ఉంటే తమ జీవితాలు వేరేగా ఉండేవని వారు భావిస్తున్నారని సయ్యద్‌ చెబుతున్నారు. వీరిలో కొందరు తాము విడుదలయ్యాక దీనినే ప్రొఫెషన్‌గా ఎంచుకోవాలనుకుంటున్నారట. అందుకే యానిమేషన్, ఫైన్‌ఆర్ట్స్‌ రంగాల్లోకి వెళ్లడానికి సలహా చెప్పమని అడిగేవారట. ‘కళాత్మక దృక్పథం వీరిలో ఎంత మార్పు తెచ్చింది.. వీరు ఇప్పుడు మరింత వినయంగా మారారు. ఇంటికి డబ్బులు పంపించడం వారికి చాలా ఆనందాన్ని ఇస్తోంది’ అంటూ జైళ్ల శాఖ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా