పల్లెల్లో ప్రైవేటు ఏటీఎంలు

23 Feb, 2015 03:33 IST|Sakshi
పల్లెల్లో ప్రైవేటు ఏటీఎంలు

కుల్కచర్ల: బ్యాంకులో ఖాతా ఉన్నా.. అందులో డబ్బులున్నా.. తీసుకోవడానికి ఒకప్పుడు క్యూ కట్టడం.. గంటల తరబడి వేచి చూడడం చేయాల్సి వచ్చేది. ఏటీఎంలు (ఆటోమేటిక్ టెల్లర్ మిషన్) వచ్చాక వినియోగదారుడికి వెసులుబాటు వచ్చింది. వీటితో బ్యాంకుకు వెళ్లకుండానే క్షణాల్లో డబ్బులు డ్రా చేసుకునే సదుపాయం కలిగింది. అనతికాలంలోనే ఏటీఎంలకు ప్రాధాన్యం పెరిగిపోయిం ది. జేబులో ఏటీఎం కార్డుంటే చాలు ఎక్కడికి వెళ్లినా మన అవసరాల నిమిత్తం కావాల్సిన డబ్బులు తీసుకోవచ్చు. ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ ఏటీఎంలు ప్రస్తుతం మండల కేంద్రాలకు కూడా విస్తరించాయి.

ఇప్పటివరకు జాతీయ బ్యాంకులైన ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్., ఆంధ్రాబ్యాంకు, పంజాబ్‌నేషనల్ బ్యాంకు, కెనరా, సిండికేట్, యూనియన్, ఐసీఐసీఐ బ్యాంకులు ఏటీఎం సేవలను అందిస్తున్నాయి. ఇప్పుడు జాతీయ బ్యాంకులే కాదు ప్రైవేటు సంస్థలు కూడా ఏటీఎం సేవలను అం దించడానికి ముందుకు వస్తున్నాయి. రిజర్వ్‌బ్యాంకు నిబంధనల ప్రకారం ప్రైవేటు సంస్థలు 33శాతం ఏటీఎంలను చిన్న పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలకు అనుగుణంగా ఇప్పుడు మండల కేంద్రాలు, చిన్నచిన్న గ్రామాల్లో సైతం ప్రైవేటు సంస్థలు ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. కుల్కచర్ల, గండేడ్, మహ్మదాబాద్, దోమ, పరిగి, పూడూరు, మన్నేగూడ తదితర గ్రామాల్లో ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ఇండీక్యాష్, ఇండియా వన్, మనిస్పాట్ తదితర ప్రైవేటు సంస్థలు ఈ సేవలను అందిస్తున్నాయి.
 
ఐదుసార్లు ఉచితం..
జాతీయ బ్యాంకుల మాదిరిగానే ప్రైవేటు ఏటీఎంలలో ఐదుసార్లు ఉచితంగా లావాదేవీలు చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువగా వినియోగించుకుంటే మాత్రం సేవా పన్నుకింద కొంతమొత్తం వసూలు చేస్తారు. ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసిన ఏటీఎంలు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని వినియోగదారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు