ఆర్టీసీలో ‘ప్రైవేట్‌’ పరుగులు!

30 Oct, 2019 13:28 IST|Sakshi

752 ప్రైవేట్‌ బస్సులకు సన్నాహాలు 1133 అద్దె బస్సులు

సిటీలో బాగా తగ్గిపోనున్న ఆర్టీసీ బస్సులు

సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాలో సింహభాగంగా ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌లో సమూలమార్పులు చోటుచేసుకోనున్నాయా? ఆర్టీసీ ముఖచిత్రం మారనుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒకవైపు కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె కొనసాగిస్తున్నప్పటికీ  ప్రభుత్వం ప్రైవేట్‌ దిశగా  అడుగులు వేస్తూనే ఉంది. ఇప్పటికే అద్దె బస్సులకు నోటిఫికేషన్‌  ఇచ్చారు. ప్రైవేట్‌ బస్సుల అనుమతులపైనా కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ ప్రతిపాదనలు ఆచరణలోకి వస్తే  ఆర్టీసీలో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. అద్దె బస్సులు, ప్రైవేట్‌ బస్సుల సంఖ్య పెరిగి ఆర్టీసీ బస్సుల సంఖ్య చాలా వరకు తగ్గిపోనుంది. ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా 50 శాతం ఆర్టీసీ  బస్సులు ఉంటే  మిగతా 30 శాతం అద్దె బస్సులు, మరో 20 శాతం  ప్రైవేట్‌ బస్సులు ప్రజారవాణా రంగంలోకి ప్రవేశిస్తాయి. కానీ ఆర్టీసీలో కొత్త బస్సులు కొనలేని స్థితి. చాలా వరకు డొక్కు బస్సులే ఉన్నాయి. దశలవారీగా ఈ డొక్కు బస్సులను తొలగిస్తే  ఆర్టీసీలో 1000 బస్సులు కూడా మిగలకపోవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 3,550 బస్సులతో ప్రతి రోజు 32 లక్షల మందికి  రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న  గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ చాలా వరకు తగ్గనుంది.

అద్దె బస్సులకు ఆహ్వానం..
నగరంలో ప్రస్తుతం 375  అద్దె బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు ఆర్టీసీలో భాగంగానే కొనసాగుతున్నాయి. కిలోమీటర్‌కు కొంత మొత్తాన్ని అద్దె రూపంలో చెల్లిస్తూ ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసేందుకు ఆర్టీసీ అద్దె బస్సులను వినియోగిస్తోంది. వీటి సంఖ్యను 375 నుంచి 1133కు పెంచేందుకు  కొద్ది రోజుల క్రితమే నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇప్పటి వరకు 60 బస్సులకు దరఖాస్తులు వచ్చాయి. నిర్దేశించిన 1133 అద్దె బస్సులను క్రమంగా భర్తీ చేసేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. దీంతో ప్రస్తుతం కొన్ని రూట్లకే పరిమితమైన అద్దె బస్సులు నగరంలోని మరిన్ని రూట్లకు విస్తరించనున్నాయి. ఈ బస్సుల నిర్వహణ పూర్తిగా ఆర్టీసీ పరిధిలోనే ఉంటుంది. అద్దె బస్సులకు  డ్రైవర్‌లను వాటి యజమానులు ఏర్పాటు చేస్తే కండక్టర్‌లను మాత్రం ఆర్టీసీయే ఏర్పాటు చేస్తుంది. 

శివార్లకు ప్రైవేట్‌ సేవలు...
నగరంలోని ప్రధాన ప్రాంతాలకు  ఆర్టీసీ సొంత బస్సులతో పాటు, అద్దె బస్సులను నడుపుతూ నగర శివారుల్లోని కాలనీలు, గ్రామాలకు మాత్రం ప్రైవేట్‌ బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. 20 శాతం చొప్పున 752 ప్రైవేట్‌ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఒకవైపు కార్మికుల సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతోంది. మరోవైపు  ప్రభుత్వం ప్రైవేట్‌ బస్సుల ఏర్పాటు దిశగా కార్యాచరణ చేపట్టింది. ప్రైవేట్‌ బస్సులు తప్పనిసరైతే ప్రస్తుతం ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్న 32 లక్షల మంది ప్రయాణికుల్లో  సుమారు 10 లక్షల మందికి పైగా ప్రైవేట్‌ బస్సులపైన ఆధారపడాల్సివస్తోంది. ఆర్టీసీలోని అన్ని రకాల బస్‌పాస్‌లన ు ప్రైవేట్‌ బస్సుల్లోనూ అనుమతించనున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో ఎలాంటి విధానాలు అమలవుతాయో తెలియదు. మరికొంత కాలంవేచి చూడాల్సిందే.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా