కొను‘గోల్‌మాల్‌’!

18 Oct, 2017 01:50 IST|Sakshi

రిజిస్ట్రేషన్ల శాఖలో కోట్లు కొట్టేసేందుకు స్కెచ్‌ వేసిన ప్రైవేటు సంస్థ

టెండర్లలో పేర్కొన్నవి కాకుండా వేరే కంపెనీల పరికరాలు అంటగట్టే ప్రయత్నాలు

నాణ్యమైన పరికరాలు ఇస్తామని టెండర్‌ దక్కించుకున్న విస్సియన్‌ ఇన్ఫోటెక్‌ సంస్థ

నాసిరకం కంప్యూటర్లు, హార్డ్‌వేర్‌ పరికరాల సరఫరాకు సర్వం సిద్ధం

ఓ మంత్రి ద్వారా అధికారులపై ఒత్తిడి..

రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాయాలకు (ఎస్‌ఆర్‌ఓ) కొత్త కంప్యూటర్లు, ఇతర హార్డ్‌వేర్‌ పరికరాల కోసం రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జరుపుతున్న కొనుగోళ్లలో గోల్‌మాల్‌కు రంగం సిద్ధమైంది. ప్రముఖ కంపెనీల హార్డ్‌వేర్‌ పరికరాలను సరఫరా చేస్తామని చెప్పి టెండర్‌ దక్కించుకున్న సంస్థ ఇప్పుడు టెండర్‌ నిబంధనలకు విరుద్ధంగా తక్కువ ధర గల వేరే కంపెనీల పరికరాలను సరఫరా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఓ మంత్రి ద్వారా అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి తక్కువ ధర, తక్కువ నాణ్యత ఉన్న పరికరాలు అంటగట్టేందుకు పథక రచన చేసింది. ప్రధానంగా వచ్చే ఐదేళ్లలో సరఫరా చేయాల్సిన 35 వేల క్యాట్రిడ్జీల విషయంలో బ్రాండ్లు మార్చి రూ.కోట్లు మిగుల్చుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రంలోని ఎస్‌ఆర్‌వోల్లో కొత్త కంప్యూటర్లు, హార్డ్‌వేర్‌ పరికరాలను అమర్చేందుకు విధించిన గడువు మరో వారం రోజుల్లో ముగుస్తుండగా, బ్రాండ్ల విషయంలో తాత్సారం చేస్తోంది. ఈ సంస్థకు ఓ రాష్ట్ర మంత్రి అండదండలు ఉండటంతో అధికారులు కూడా గడువు పొడిగించడం గమనార్హం.    
– సాక్షి, హైదరాబాద్‌

నాణ్యమైనవి పంపిణీ చేస్తామని చెప్పి..
రాష్ట్రంలోని 141 ఎస్‌ఆర్‌వోల కోసం కొత్త కంప్యూటర్లతో సహా 20 రకాల కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ పరికరాల కొనుగోళ్లు, నిర్వహణ సేవల కోసం గత మార్చిలో ప్రభుత్వం టెండర్లు పిలిచింది. విస్సియన్‌ ఇన్ఫోటెక్‌ అనే సంస్థ రూ.76 కోట్ల వ్యయంతో టెండర్‌ దక్కించుకుంది. ఇంతకంటే తక్కువ వ్యయం రూ.75 కోట్లకు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ అనే సంస్థ బిడ్‌ దాఖలు చేసింది. అయితే విస్సియన్‌ ఇన్ఫోటెక్‌ సంస్థ బిడ్‌లో సూచించిన కంపెనీల పరికరాలు సాంకేతికంగా అధిక నాణ్యమైనవని భావించిన ప్రభుత్వం ఈ సంస్థకే టెండర్‌ను అప్పగించింది. ఈ మేరకు పరికరాలను 60 రోజుల గడువులో బిగించడం, 5 ఏళ్లపాటు వాటికి నిర్వహణ సేవలు అందించేందుకు గత ఆగస్టు 23న రాష్ట్ర ప్రభుత్వంతో విస్సియన్‌ ఇన్ఫోటెక్‌ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని 141 ఎస్‌ఆర్‌ఓలకు చెరో ఐదు కలిపి మొత్తం 1,200 డెస్క్‌టాప్‌ కంప్యూటర్లతోపాటు ప్రతి ఎస్‌ఆర్‌ఓలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 141 ప్రింటర్లు, స్కానర్లు, యూపీఎస్, బయో మెట్రిక్‌ పరికరాలు, సీసీటీవీ వ్యవస్థ, వర్క్‌ స్టేషన్‌ తదితర మొత్తం 20 రకాల పరికరాలను ఈనెల 23వ తేదీలోగా బిగించాల్సి ఉంది.

క్యాట్రిడ్జీల అవసరాలను తక్కువగా అంచనా వేసి..
రాష్ట్రంలోని ఎస్‌ఆర్‌వోలకు కంప్యూటర్లు, ఇతర హార్డ్‌వేర్‌ పరికరాల సరఫరా కోసం ఐదేళ్ల కిందట జరిగిన టెండర్లను ఓ ప్రముఖ ఐటీ కంపెనీ దక్కించుకుంది. అయితే క్యాట్రిడ్జీల అవసరాలను అంచనా వేయడంలో విఫలమైన ఈ సంస్థ తక్కువ ధరకు టెండర్‌ వేసి తీవ్రంగా నష్టపోయింది. తాజాగా టెండర్లను దక్కించుకున్న విస్సియన్‌ సంస్థ కూడా క్యాట్రిడ్జీల అవసరాలను తక్కువగా అంచనా వేసినట్లు సమాచారం. ఐదేళ్లలో రూ.12 కోట్లు విలువైన క్యాట్రిడ్జీలు అవసరం కాగా, రూ.2 కోట్లతోనే సరఫరా చేసేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చినట్లు తెలిసింది. దీంతో టెండర్లను వదులుకోవడం ఇష్టం లేక నాసి రకం పరికరాలు అంటగట్టేందుకు యత్ని స్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

వేరే కంపెనీల పరికరాలు అంటగట్టే యత్నం
గడువు సమీపిస్తున్నా ఇంత వరకు పరికరాలు సరఫరా చేయని విస్సియన్‌ సంస్థ కొత్త మాయాజాలానికి తెర లేపింది. ఏసర్‌ డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు, లెక్స్‌మార్క్‌ బ్రాండ్‌ ప్రింటర్లు, క్యాట్రిడ్జీలు, అర్రే వ్యాన్‌ ఆప్టిమైజర్లు, జునిపర్‌ రూటర్లకు బదులు ఇతర కంపెనీలకు చెందిన పరికరాలను కొనుగోలు చేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తోంది. వచ్చే ఐదేళ్లలో ఈ సంస్థ రూ.12 కోట్ల వ్యయంతో లెక్స్‌మార్క్‌ కంపెనీకి చెందిన 35 వేల క్యాట్రిడ్జీలను సరఫరా చేయాల్సి ఉండగా, వేరే బ్రాండ్‌ను అంటగట్టేం దుకు ప్రయత్నిస్తోంది. మిగతా పరికరా లను కూడా వేరే కంపెనీల పరికరాలను సరఫరా చేస్తామని మొండికేసింది. ఇలా రూ.15 కోట్ల వరకు మిగుల్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు ఈ సంస్థకు రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ 45 రోజులపాటు గడువు పొడిగించి మరో అవకాశం కల్పించినట్లు తెలిసింది.

కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు..
విస్సియన్‌ సంస్థ టెండర్లలో సూచించిన కంపెనీలు... తమ బ్రాండ్లకు బదులు ఇతర కంపెనీ పరికరా లను సరఫరా చేసేందుకు జరుగుతున్న ప్రయ త్నాలపై రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, ఐటీ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి. ఈ కంపెనీల ప్రతినిధులు ఇటీవల రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ, తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీస్‌ సర్వీసెస్‌ విభాగం మేనేజింగ్‌ డైరెక్టర్‌ను కలసి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు