రోగిని తీసుకొస్తే ‘నీకింత... నాకింత’

14 Mar, 2020 08:05 IST|Sakshi
కరీంనగర్‌లోని డాక్టర్స్‌ స్ట్రీట్‌లో ఓ భాగం

పేద రోగుల నుంచి పెద్ద దోపిడీ

కమీషన్‌ ఏజెంట్లుగా మెడికల్‌ ప్రాక్టీషనర్లు

కోల్‌బెల్ట్‌లో ప్రైవేటు మెడికల్‌ మాఫియా

బిల్లులో 20 నుంచి 50 శాతంకుపైగా కమీషన్‌

ఉమ్మడి జిల్లాలో 3 వేలకు పైగా ప్రైవేటు ప్రాక్టీషనర్లు

‘‘కరీంనగర్‌ డాక్టర్స్‌ స్ట్రీట్‌లోని ఓ హాస్పిటల్‌కు జగిత్యాలలో రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన వ్యక్తిని బంధువులు, ఆర్‌ఎంపీ సహకారంతో తీసుకొచ్చారు. కాలు తొంటిభాగం విరగడంతో బాల్‌ రీప్లేస్‌మెంట్‌ చేయాలన్నాడు డాక్టర్‌. వెంటనే హాస్పిటల్‌ నిర్వాహకుడు రంగప్రవేశం చేశాడు. రూ.2 లక్షల ప్యాకేజీ కింద బేరం కుదిరింది. అడ్వాన్స్‌ చెల్లించి ఆసుపత్రిలో చేర్చారు. హాస్పిటల్‌ పీఆర్‌వో అక్కడికక్కడే 30 శాతం కమీషన్‌ రూ.60 వేలు ఆర్‌ఎంపీకి ఇచ్చేశాడు.’’

‘ఓ గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ రిఫరెన్స్‌తో వచ్చిన రోగి నుంచి ఓ ప్రైవేటు హాస్పిటల్‌ వైద్యం కోసం లక్ష రూపాయలు వసూలు చేసింది. అయితే ఆర్‌ఎంపీకి ఇవ్వాల్సిన 30 శాతం కమీషన్‌ ఇవ్వలేదు. దీంతో సదరు ఆర్‌ఎంపీ సమస్యను వాళ్ల అసోసియేషన్‌ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో హాస్పిటల్‌ యాజమాన్యం కొంత మొత్తాన్ని కమీషన్‌గా చేతిలో పెట్టి పంపించారు. తనకు రావలసిన పూర్తి కమీషన్‌ కోసం ఆయన చాలా కాలమే పోరాడాడు.’’

‘‘1980–90 దశకంలో పీపుల్స్‌వార్‌ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మెడికల్‌ ప్రాక్టీషనర్లుగా రూ.లక్షల్లో సంపాదించిన వాళ్లు ఉమ్మడి కరీంనగర్‌లో ఉన్నారు. వైద్యంతోపాటు గర్భ విచ్చిత్తి స్పెషలిస్టుగా రూ.లక్షలు సంపాదించిన ఓ ప్రైవేటు మెడికల్‌ ప్రాక్టీషనర్‌ కరీంనగర్‌లోని ఓ సినిమా థియేటర్‌ సమీపంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మించాడు. ఈ అబార్షన్‌ స్పెషలిస్టు హాస్పిటల్‌పై గతంలో దాడి కూడా జరిగింది. కన్సల్టెంట్‌ డాక్టర్లతో, ఎలాంటి సర్టిఫికెట్‌ లేకపోయినా తాను కూడా వైద్యం చేస్తూ ఇప్పటికీ ‘క్యాష్పిటల్‌’ను నిర్వహిస్తున్నాడు. తాను వచ్చిన దారిలోనే మెడికల్‌ ప్రాక్టీషనర్లనే ఏజెంట్లుగా చేసుకుని వైద్య వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు.’’

సాక్షి, కరీంనగర్‌ : కరీంనగర్‌ పట్టణంలో హాస్పిటల్స్‌ డబ్బులు సంపాదించి పెట్టే ‘క్యాష్‌’పిటల్స్‌గా మారాయి. వైద్యం పక్కా వ్యాపారంగా తయారైంది. వైద్యుడే ఆసుపత్రి స్థాపించి రోగులకు సేవలు అందించే కాలం నుంచి వైద్యున్ని నియమించుకుని, ఆర్‌ఎంపీలు, అంబులెన్స్‌ డ్రైవర్లు, పీఆర్‌వోల సాయంతో వ్యాపారం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. రోగం లేకపోయినా.. సృష్టించి వైద్యం చేసే స్థాయికి కరీంనగర్‌లోని ‘కాసు’పత్రులు దిగజారాయి. రోగి బాధను, భయాన్ని ‘క్యాష్‌’ చేసుకునే వ్యాపారం ప్రణాళికాబద్ధంగా సాగిపోతోంది. కొత్తగా ఏర్పాటైన దవాఖానాల నుంచి అంతో ఇంత పేరున్న హాస్పిటళ్ల వరకు గ్రామాలు, కోల్‌బెల్ట్‌ ఏరియాలోని మెడికల్‌ ప్రాక్టీషనర్ల పైనే ఆధారపడి వ్యాపారం సాగిస్తున్నాయి. రోగి చెల్లించే ఫీజుల నుంచి 30 నుంచి 60 శాతం వరకు కమీషన్లు ఇస్తున్నాయి. చివరకు ఒకటి రెండు కార్పొరేట్‌ ఆసుపత్రులు సైతం కమీషన్లు ఇచ్చి రోగులను ఆసుపత్రులకు రప్పించుకునే దయనీయ స్థితి కరీంనగర్‌లో నెలకొంది. రోగిని తీసుకొస్తే నీకింత...  నాకింత అనే ధోరణిలో వైద్య వ్యాపారం సాగిపోతోంది. 

రోగుల డబ్బుతో హైఫై బతుకులు
గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్‌ఎంపీ(రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌), పీఎంపీ (ప్రైవేటు మెడికల్‌ ప్రాక్టీషనర్‌) నుంచి పట్టణాల్లోని పెద్ద డాక్టర్ల వరకు పేద, మధ్య తరగతి రోగుల నుంచి వసూలు చేసే డబ్బులతోనే  బతుకుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇన్‌పేషంట్‌గా చేరినప్పుడే “రెఫర్‌ బై’ అనే కాలంలో సదరు మెడికల్‌ ప్రాక్టీషనర్‌ పేరును రాసుకుని వసూలు చేసిన మొత్తం నుంచి మాట్లాడుకున్న కమీషన్‌ ఇవ్వడం పరిపాటిగా మారింది. కరీంనగర్‌ జిల్లాలో జరిగే వైద్య వ్యాపారంలో మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల పేషెంట్లదే సింహభాగమని చెప్పవచ్చు. ఆయా ప్రాంతాల ఆర్‌ఎంపీలు నేరుగా కరీంనగర్‌లోని తమకు కమీషన్లు ఇచ్చే ఆసుపత్రులకు బలవంతంగా పంపిస్తున్నారు.

ప్రొఫెషనల్‌ డాక్టర్‌ కూడా సంపాదించలేనంత సొమ్మును కేవలం రెఫరల్‌ కేసుల ద్వారా ఆర్‌ఎంపీలు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో డాక్టర్లను నియమించుకుని సొంతంగా హాస్పిటల్స్‌ ఏర్పాటు చేసుకున్నవారు కూడా ఉన్నారు. దీంతో కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు పూర్తిగా ఆక్రమ మార్గంలోనే పయనిస్తున్నాయి. ఆసుపత్రుల యాజమాన్యాలు డాక్టర్లకు లక్షల రూపాయల వేతనాలు ఇస్తూ పోషిస్తున్నాయి. ఆ ఖర్చును సైతం రోగులపై రుద్దుతూ.. మరో వైపు డాక్టర్లకు సైతం రోగుల సంఖ్య పెంచేలా టార్గెట్లు నిర్దేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాలు, సింగరేణి కోల్‌బెల్ట్‌లోని ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ఆర్‌ఎంపీల ద్వారా వచ్చిన రోగుల నుంచి వసూలు చేసిన సొమ్మును అందరూ కలిసి పంచుకుంటున్నారు.  ఇదంతా పెద్ద మాఫియాగా నడుస్తున్న వ్యవహారం. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతో వీరి వ్యాపారం దిగ్విజయంగా  సాగిపోతోంది. 

మెడికల్‌ టెర్మినాలజీ తెలియకున్నా...
అక్షరం ముక్క మెడికల్‌ టెర్మినాలజీ రాని ఆర్‌ఎంపీలు, పీఎంపీలు డాక్టర్ల పేరుతో చలామణి అవుతున్నారు. ఇంటికి వచ్చి మందులు ఇచ్చే మెడికల్‌ ప్రాక్టీషనర్ల వెనుక పెద్ద మాఫియానే నడుస్తోంది. కమీషన్లు, గిఫ్టులు, వాటాలు, స్టార్‌ హోటళ్లలో విందులు, విదేశీయానాలు ఇలా చెప్పుకుంటూ పోతే... కొందరు ఆర్‌ఎంపీలు అనుభవిస్తున్న రాజభోగం అంతా ఇంతా కాదు. కరీంనగర్‌తోపాటు కొన్ని పట్టణాల్లోని ప్రైవేటు, కార్పొరేట్‌‡ ఆసుపత్రులు గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్‌ఎంపీలకు 20 నుంచి 60 శాతం వరకు హాస్పిటళ్ల స్థాయిని బట్టి కమిషన్లు ఇచ్చి మరీ రోగులను ఆసుపత్రులకు రప్పించుకుంటున్నా రు. ఇలాంటి కమీషన్లకు ఆశపడుతున్న ఆర్‌ఎంపీలు రోగులను భయపెట్టి మరీ వారు చెప్పిన ప్రైవేటు ఆసుపత్రులకు పంపిస్తున్నారు. గ్రామీ ణ, పట్టణ ప్రాంతాల్లో చిన్నా చితకా వైద్యం చేసుకునే ప్రాక్టీషనర్లు ప్రైవేటు ఆసుపత్రులను, వైద్యులను శాసించే స్థాయికి ఎదిగారు.

అవసరం లేకపోయినా రోగుల్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు పంపించి అడ్డగోలు ఆపరేషన్లు చేయిస్తున్నారు. చిన్నపాటి జబ్బులకు కూడా రకరకాల పరీక్షలు చేయించి తమ వాటా తీసుకుంటున్నారు. ఇటీవల ఆర్‌ఎంపీలు ఏర్పా టు చేస్తున్న క్లినిక్‌ల సంఖ్య పెరుగుతోంది. వీళ్లకు కమీషన్లు ఇచ్చేందుకు ప్రతీ ఆసుపత్రిలో ప్రత్యేకంగా పీఆర్‌వో (పేషంట్‌ రిలేషన్‌ ఆఫీసర్‌)ను ఏర్పాటు చేసుకున్నారు. ఏ ఆపరేషన్‌కు ఎంత కమీషన్‌ ఇవ్వాలి, ఏ ఆర్‌ఎంపీలకు ఎంత ముట్టజెప్పాలో వీరు చూసుకుంటారు. అప్పుడప్పుడూ గ్రామాలకు వెళ్లి ఆర్‌ఎంపీలతో కొత్త డీల్స్‌ కుదుర్చుకుంటారు. జిల్లా వైద్యాధికారులు ఎవరూ పీఎంపీ, ఆర్‌ఎంపీల ద్వారా సాగుతున్న దందాపై కనీసం దృష్టి పెట్టడం లేదు. 

కోల్‌బెల్ట్‌ ఏరియాలో మాఫియాగా
సింగరేణి ప్రాంతంలో మెడికల్‌ ప్రాక్టీషనర్ల దందా మాఫియాగా తయారైంది. బొగ్గు గనులు అధికంగా ఉన్న పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖ ని, యైటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీ, బేగంపేటతోపాటు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్, సీసీసీ, రవీంద్రఖని, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి, కాసిపేట, తాండూరు, ఆసిఫాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మెడికల్‌ ప్రాక్టీస్‌ ద్వారా లక్షల్లో సంపాదించిన వారు ఉన్నారు. గని కార్మికుల కోసం సింగరేణి ఏరి యా ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా మెడికల్‌ ప్రాక్టీషనర్లేనే ఆశ్రయించడం పరిపాటిగా మారింది. ప్రమాదాల నుంచి పెద్ద రోగాల వరకు సింగరేణి ఉచితంగా చికిత్స చేయించే అవకాశాలను కాదని,  కార్మికులను ఏమార్చి చికిత్స కోసం ఆర్‌ఎంపీ, పీఎంపీలు కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రులకు పంపిస్తున్నారు. సింగరేణి నుంచి రిఫరల్‌ కేసులుగా వచ్చే రోగులకు సంబంధించి అధిక మొత్తంలో కమీషన్లు ముట్ట జెపుతున్నాయి కరీంనగర్‌ హాస్పిటళ్లు. 

వేల మంది మెడికల్‌ ప్రాక్టీషనర్ల ద్వారా...
కరీంనగర్‌ జిల్లాలో 259 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో కరీంనగర్‌ పట్టణంలోనే 200 వరకు చిన్నా, పెద్ద ఆసుపత్రులున్నాయి. వీట న్నింటికీ అనుసంధానంగా సుమారు 3 వేల మంది ఆర్‌ఎంపీలు పనిచేస్తున్నారు. గ్రామాల్లో జ్వరం, దగ్గు, దమ్ము, ప్రాథమిక చికిత్స వరకు ఆర్‌ఎంపీ, పీఎంపీలు చేసే వైద్యంపై అభ్యంతరాలు ఏమీ ఉండవు. నిబంధనల ప్రకారం ఆర్‌ఎంపీలు ప్రాథమిక చికిత్స మినహా ఆపరేషన్లు చేయడం, స్టెరాయిడ్స్‌ ఇవ్వడం, యాంటీ బయోటిక్స్‌ వాడకూడదు. కరీంనగర్‌ గోదావరిఖని, జగిత్యాల, సిరిసిల్ల వంటి పట్టణాల్లో ప్రైవేటు ఆసుపత్రులకు ఆదాయాన్ని సమకూర్చిపెట్టే సాధనాలుగా వీరు మారిపోయారు.

మరిన్ని వార్తలు