లెక్చరర్లపై వేటు...!

13 Apr, 2018 12:35 IST|Sakshi

ఏఐసీటీఈ కొత్త నిబంధ    నలతో ఉక్కిరిబిక్కిరి

ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ లెక్చరర్ల మెడపై తొలగింపు కత్తి

తనిఖీలు పూర్తయ్యాక ఉద్వాసన

సిద్ధపడుతున్న ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు

రోడ్డున పడనున్న 200 మందికిపైగా అధ్యాపకులు

భద్రత లేని బతుకులతో దిగాలు

తొలగింపులు చేయొద్దని అభ్యర్థన

శాతవాహనయూనివర్సిటీ: ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ అధ్యాపకుల నెత్తిన మరో పిడుగుపడనుంది. ఏళ్లుగా అరకొర వేతనాలతోనే బోధన చేస్తున్న లెక్చరర్ల ఉద్యోగాలకు కళాశాల యాజమాన్యాలు ఉద్వాసన పలికేందుకు పావులు కదుపుతున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) రూపొందించిన కొత్త నిబంధన కత్తి ఇంజినీరింగ్‌ మాస్టార్ల మెడపై వేలాడుతోంది. ప్రస్తుతం జేఎన్‌టీయూ తనిఖీలు పూర్తై అనుబంధ హోదా ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో ఏఐసీటీఈ తనిఖీలు కూడా జరగనున్నట్లు సమాచారం. ఈ తనిఖీలన్నీ పూర్తయితే అనుబంధ హోదా ప్రకటించగానే పలు కళాశాలలు ఫ్యాకల్టీ సంఖ్య తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఇంజినీరింగ్‌ కళాశాల వర్గాల్లో చర్చ మొదలైంది. ఇదే జరిగితే తనిఖీలు పూర్తవగానే యాజమాన్యాలు అధ్యాపకులను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపనున్నాయి. ఈ పరిణామంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 200పైగా మంది రోడ్డున పడనున్నట్లు సమాచారం. తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని, నిబంధనల పేరుతో బయటకు పంపొద్దని అధ్యాపకులు    ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శరాఘాతంలా 1@20 నిబంధన..
ఏఐసీటీఈ కొత్త నిబంధనలు ఇంజినీరింగ్‌ లెక్చరర్ల ఉద్యోగాలకు ఎసరుపెట్టేందుకు శరాఘాతంగా మారింది. గతంలో 1ః15గా ఉన్న ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ప్రస్తుతం 1ః20గా మార్చింది. దీంతో 60 మంది విద్యార్థులకు నలుగురు ఉండాల్సింది ఇక నుంచి ముగ్గురే అవసరముంటుంది. అంటే ప్రతీ 60 మందికి ఒక అధ్యాపకుడు ఉద్యోగాన్ని కోల్పోతున్నాడని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. కొత్త నిబంధనలతో తమ ఉద్యోగాలు ఏ క్షణాన కోల్పోతామోనని అధ్యాపకులు కలవరపాటుకు గురవుతున్నారు. తనిఖీలు పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగిన లెక్చరర్లలో కొత్త నిబంధన అలజడి సృష్టించింది.

ఇష్టారాజ్యంగా తొలగింపులు..
ఇంజినీరింగ్‌ కళాశాలల్లో లెక్చరర్ల నియామకాలు యూనివర్సిటీలో పరిధిలోనే ఉంటాయని సమాచారం. దీనికోసం యూనివర్సిటీ అ«ధికారులు ప్రత్యేకంగా ర్యాటిఫికేషన్‌ నిర్వహించి అర్హతను తేల్చి వారి సర్టిఫికేట్‌లు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. సబ్జెక్టుల్లో పరిజ్ఞానం స్వయంగా తెలుసుకునేందుకు యూనివర్సిటీ అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో ఎక్కడ తేడా జరిగినా వారిని తిరస్కరిస్తారు. ఈ విధంగా లెక్చరర్లను నియమించే బాధ్యత పూర్తిస్థాయిలో యూనివర్సిటీ అధికారులదే ఉంటుందని విద్యావేత్తలు అంటున్నారు. తొలగింపు మాత్రం యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా చేస్తున్నాయని సమాచారం. ఒక లెక్చరర్‌ను తొలగించాలంటే సాంకేతిక విద్యాశాఖకు సమాచారమిచ్చి తొలగింపునకు గల కారణాలు తెలపాలి. ఈ ఫిర్యాదుపై సాంకేతిక విద్యాశాఖ అధికారులు విచారణ జరిపిన తర్వాత వారు ఇచ్చిన నివేదిక మేరకు నిర్ణయం తీసుకోవాలి. కానీ.. పలు కళాశాలల్లో గతంలో లెక్చరర్ల తొలగింపుల్లో ఇవేమీ జరగడం లేదని ఆరోపణలున్నాయి. అకాడమిక్‌ ఫలితాలు సరిగా లేవని.. ప్యాకల్టీగా నైపుణ్యాలు లేవనే కారణాలు చూపుతూ కొందరు తొలగింపులు చేయడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం.

జిల్లాలో 200 మందిపై వేటు..?
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా 13 ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలున్నాయి. ఇందులో దాదాపుగా విద్యార్థులకు తరగతులు బోధించే లెక్చరర్ల సంఖ్య వేల సంఖ్యల్లో ఉంటుంది. వీరిలో ఏఐసీటీఈ విధిస్తున్న నూతన నిబంధనలతో ఊహించినట్లు తొలగింపులు జరిగితే దాదాపు 200 మందికి పైగానే ఉద్యోగాలు కోల్పోతారనే చర్చ ఇంజినీరింగ్‌ అధ్యాపకవర్గాల్లో జరుగుతోంది. కొన్ని కళాశాలల్లో లెక్చరర్లు ఎక్కువగా ఉన్నా ఫర్వాలేదని వారిని అలాగే కొనసాగించాలని నిర్ణయానికి వస్తున్నట్లు.. మరికొన్ని కళాశాలల్లో నిబంధన ప్రకారం ఫ్యాకల్టీని సరిచూసుకొని మిగితా వారికి ఉద్వాసన పలకాలని చూస్తున్నట్లు సమాచారం. లెక్చరర్లు తగ్గితే చదువుల్లో నాణ్యత కొరవడుతుందని,  ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టిసారించి వెంటనే తొలగింపులు ఆపేలా చర్యలు చేపట్టాలని లెక్చరర్లు, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

తొలగింపులు ఆపాలి
ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఏఐసీటీఈ విధించిన నిబంధనల ప్రకారం తొలగింపులు చేయకూడదని కోరుతున్నాం. ఇప్పటికే భద్రత లేని బతుకులతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాం. లెక్చరర్లు ఎక్కువ సంఖ్యలో ఉంటే చదువులో నాణ్యత కూడా పెరిగేందుకు అవకాశాలుంటాయి. అనవసరంగా ఇలాంటి నిబంధనలను తీసుకొస్తూ ఇంజినీరింగ్‌ కళాశాల లెక్చరర్లను అయోమయానికి గురిచేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే ఈ నిబంధనను వెనక్కి తీసుకొని పాతపద్ధతిని కొనసాగించాలని కోరుతున్నాం.– కె.మహేశ్,పీజీ అసోసియేషన్‌ జాతీయ ఉపాధ్యక్షుడు

మరిన్ని వార్తలు