స్వైన్‌ స్వైప్‌

23 Oct, 2018 10:53 IST|Sakshi

‘స్వైన్‌ ఫ్లూ’ కేసులను క్యాష్‌ చేసుకుంటున్న ప్రైవేట్‌ ఆస్పత్రులు

క్లినికల్‌గా నిర్ధారించే అవకాశం ఉన్నా.. చేయని వైనం

వైద్య పరీక్షల పేరుతో  రూ.వేలల్లో బిల్లులు

సాక్షి, సిటీబ్యూరో: స్వైన్‌ఫ్లూ భయం కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇటీవల నగరంలో స్వైన్‌ఫ్లూ కేసులు పెరుగుతుండటంతో సాధారణ జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పికే ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. రోగుల్లో నెలకొన్న భయాన్ని కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు క్యాష్‌ చేసుకుంటున్నాయి. ఎలాంటి పరీక్షలు లేకుండానే కేవలం క్లినికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారానే ఫ్లూను నిర్ధారించే అవకాశం ఉన్నప్పటికీ..పలు కార్పొరేట్‌ ఆస్పత్రులు నమూనాలు సేకరిస్తున్నాయి. వ్యాధి నిర్ధారణ పేరుతో రోగుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. నిజానికి గాంధీ, ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పైసా ఖర్చు లేకుండానే చికిత్స పొందే అవకాశం ఉంది. కానీ రోగులను భయాందోళనకు గురిచేసి చికిత్సల పేరుతో అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన తల్లిని చికిత్స కోసం ఇటీవల మలక్‌పేటలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో అడ్మిట్‌ చేయగా, అనుమానిత ఫ్లూ పేరుతో చికిత్సలు అందించి రూ.3.50 లక్షలకుపైగా బిల్లు వసూలు చేశారు. స్వైన్‌ఫ్లూ పేరుతో రోగుల నుంచి ఎంతలా డబ్బులు గుంజుతున్నారో చెప్పడానికి  ఇది ఒక ఉదాహరణ మాత్రమే.  అనుమానాస్పద కేసు అంటూ...

గ్రేటర్‌హైదరాబాద్‌ పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 125 కేసులు నమోదు కాగా, వీటిలో ఒక్క హైదరాబాద్‌ జిల్లా పరిధిలోనే 101 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటికే ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఫ్లూ వైరస్‌ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి విస్తరించే అవకాశం ఉంది. సాధారణంగా క్లోజ్‌ కాంటాక్ట్‌లో త్వరగా విస్తరించాలి. కానీ ఇప్పటి వరకు నగరంలో నమోదైన పలు కేసులను పరిశీలిస్తే పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. ఒకే ఇంట్లో వారు కాకుండా ఆ ఇంటికి చుట్టుపక్కల నివసించే పిల్లలు, వృద్ధులు, గర్భిణులు త్వరగా ఫ్లూ బారినపడుతున్నారు. డబీర్‌పుర–9, మలక్‌పేట్‌–9, ముషీరాబాద్‌–6, కుత్భుల్లాపూర్‌–4, కింగ్‌కోఠి పరిధిలో 6 చొప్పున స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ కేసులు నమోదవడం విశేషం. ప్రస్తుతం గాంధీలో పది మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఇదే అదునుగా భావించిన పలు కార్పొరేట్‌ ఆసుపత్రులు దోపిడీకి తెర తీస్తున్నాయి. చిన్న పాటి జలుబు, దగ్గు, గొంతు నొప్పినే స్వైన్‌ఫ్లూగా అనుమానించి పరీక్షలు చేయిస్తున్నాయి. ఒక్కసారి ఆసుపత్రిలో అడుగు పెడితే చాలు...పరీక్షలు ఇతరాల కింద రూ.10 వేల వరకు ఖర్చవుతోంది. ఇక స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు తేలితే ఇక రోగులకు చుక్కలే. నిజానికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేకరించిన నమూనాలను నారాయణగూడలోని ఐపీఎం (ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌)లో ఉచితంగా పరీక్షిస్తారు. అదే ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చే పరీక్షలకు ఒక్కో దానికి రూ.3,500 ఛార్జీ చేస్తుంటారు. వైద్యపరంగా ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు బాధితులను అనుమానాస్పద స్వైన్‌ఫ్లూ కేసుగా అడ్మిట్‌ చేసుకుని వైద్యం ముసుగులో దోచుకుంటున్నారు.

ఫ్లూ వ్యాపిస్తుంది ఇలా...
హెచ్‌1ఎన్‌1 స్వైన్‌ఫ్లూ కారక వైరస్‌ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఫ్లూ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఫ్లూ కారక వైరస్‌ వాతావరణంలోకి ప్రవేస్తుంది. ఇలా వాతావరణంలోకి చేరిన వైరస్‌ ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు జీవిస్తుంది. సాధారణంగా ఈ సీజన్‌లో సాధ్యమైనంత వరకు జనసమూహంలోకి వెళ్లకపోవడమే ఉత్తమం. అనివార్యమైతే ముక్కుకు మాస్క్‌ ధరించాలి. ఫ్లూ సోక కుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్ర త పాటించాలి. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నవారు తుమ్మినా, దగ్గినా చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి. బయట నుంచి ఇంటికి వచ్చినప్పు డు చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పి ల్లలకు విధిగా ఈ అలవాటు నేర్పించాలి.

ఈ లక్షణాలుంటే అనుమానించాల్సిందే...
దగ్గు, జలుబు, ముక్కు కారడం, దిబ్బడగా ఉండటం.
101, 102 డిగ్రీల జ్వరం
ఒళ్లు నొప్పులు, బాగా నీరసం, నిస్సత్తువ
తలనొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు
మూడు రోజులు కంటే ఎక్కువ వేధిస్తే ఫ్లూగా అనుమానించాలి

ఉస్మానియా ఆస్పత్రిలో7 స్వైన్‌ఫ్లూ కేసులు
అఫ్జల్‌గంజ్‌: ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో ఇప్పటి వరకు 7 సైన్‌ ఫ్లూ కేసులు నమోదైనట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నాగేందర్‌ తెలిపారు. గత జనవరి నుండి ఇప్పటి వరకు మొత్తం 18 మంది అనుమానితులు ఆస్పత్రిలో అడ్మిట్‌ కాగా వారందరికి సైన్‌ ఫ్లూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామన్నారు. అందులో ఏడుగురికి సైన్‌ ఫ్లూ సోకినట్లు తేలిందన్నారు. వీరిలో ముగ్గురు చనిపోయారని, మరో ఇద్దరు ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లారని తెలిపారు. మరో ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నారన్నారు. వీరందరికి నాణ్యమైన వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ పేర్కొన్నారు. ఈ రోగుల కోసం ప్రత్యేక వార్డును సైతం ఏర్పాటు చేశామన్నారు.    

వారి చేతిలో మోసపోవద్దు
చాలా ప్రాంతాల్లో ప్రజలకు ఫ్లూపై సరైన అవగాహన లేదు. బస్తీల్లో నిరక్షరాస్యతకు తోడు హైజిన్‌ లోపం, పిల్లలకు ఇమ్యునైజేషన్‌ సరిగా చేయించకపోవడం, గాలి వెలుతురు సోకని గదుల్లో ఎక్కువ మంది నివసిస్తుండటమే ఫ్లూ విస్తరణకు కారణం. నిజానికి సాధారణ ఫ్లూ, స్వైన్‌ఫ్లూ లక్షణాలు చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. కానీ తేడా ఉంది. ఎలాంటి పరీక్షలు అవసరం లేకుండానే కేవలం క్లినికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా వ్యాధిని గుర్తించే అవకాశం ఉంది. కానీ కొన్ని ఆస్పత్రులు అవసరం లేకపోయినా పరీక్షలు నిర్వహి స్తున్నాయి. వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అనుమానాస్పద ఫ్లూ కేసుగా నమోదు చేసుకుని చికిత్స చేస్తున్నాయి. ప్రభుత్వం గాంధీ, ఉస్మానియా, ఫీవర్, నిలోఫర్‌ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. ఇక్కడ రోగులకు అన్ని రకాల సేవలు ఉచింతంగా అందిస్తుంది. జ్వరం, జలుబుతో ఆందోళన చెంది ప్రైవేటు ఆస్పత్రు లకు పరుగులు తీసి, వారి చేతిలో మోసపోవద్దు.–  డాక్టర్‌ శ్రీహర్ష, స్వైన్‌ఫ్లూకో ఆర్డినేటర్, హైదరాబాద్‌ జిల్లా

మరిన్ని వార్తలు