సారూ.. ఇదేం పాపం

5 Jun, 2020 08:47 IST|Sakshi
సమస్యపై జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్న ఆశా వర్కర్లు

చంటి బిడ్డలకు కనీసం పాలైనా ఇప్పించండి

కంటైన్మెంట్‌ నివాసంలో ఓ బాధితురాలి ఆవేదన  

నర్సుగా పని చేసిన వ్యక్తినే పట్టించుకోని వైనం

కనీసం ఆస్పత్రికి కూడా తరలించని అధికారులు  

తల్లీ, పిల్లలు, భర్తను ఒకే ఇంట్లో బంధించిన తీరు

ఆ వైపు ఎవరూ తొంగి చూడటంలేదంటూ మనోవ్యధ

జూబ్లీహిల్స్‌: కన్నీళ్లకే కన్నీళ్లు వచ్చే.. కష్టానికే కష్టం వేసే.. అన్నట్టుగా ఉంది ఆ ఇల్లాలు ఎదుర్కొంటున్న దయనీయత. చంటిబిడ్డలు.. కన్నవారికి కంటిపాపలే. వారికి చిన్న బాధ కలిగినా తట్టుకోలేరు. అలాంటిది కరోనా రూపంలో ఆ కన్నతల్లికి కష్టాలు వచ్చిపడ్డాయి. కోవిడ్‌ లక్షణాలున్నట్లు నిర్ధారణ అయిన మహిళను హోం క్వారంటైన్‌లో పెట్టడంతో ఇద్దరు పసివాళ్లకు పాలు పట్టే పరిస్థితి లేకుండాపోయింది. వారి ఆలనాపాలనా చూసుకోలేని దుస్థితి నెలకొంది. మనోవ్యధను ఎవరితో చెప్పుకోవాలి? పసివాళ్లను ఎవరు చూసుకోవాలో తెలియడంలేదని బాధితురాలు, ఆమె భర్త దీనంగా దిక్కులు చూస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఫిలింనగర్‌లోని దుర్గాభవానీనగర్‌ బస్తీలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సుకు బుధవారం కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారణ అయింది. సమాచారం అందుకున్న ఆశా వర్కర్లు వెంటనే అక్కడికి చేరుకొని అధికారులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌కు ఫోన్‌ చేసినా రాలేదు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు బారికేడ్లు తీసుకొచ్చి ఇంటిని బంధించారు. కరోనా వచ్చిన సదరు నర్సుకు ఏడాదిన్నర బాబు, నాలుగేళ్ల కూతురు ఉన్నారు. ఆమె భర్తను కూడా అదే నివాసంలో ఉంచారు. తమ పిల్లలు పాల కోసం ఏడుస్తున్నా.. ఏ ఒక్కరూ స్పందించడం లేదని దంపతులు  కన్నీరుమున్నీరవుతున్నారు. అక్కడికి చేరుకున్న ఆశా వర్కర్లు జీహెచ్‌ఎంసీ, ఆస్పత్రి వర్గాలకు ఫోన్‌ చేసినప్పటికీ ఎవరూ స్పందించడంలేదు. దీంతో వారే తలా కొంత డబ్బు పోగు చేసుకొని ఆ కుటుంబానికి పాలు, ఇతర వస్తువులను పంపించడం గమనార్హం.  

నర్సుగా సేవలందించిన తనకే..  
ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న మహిళ పది రోజుల క్రితం సొంతూరు ఆదిలాబాద్‌ జిల్లాకు వెళ్లి నగరానికి తిరిగి వచ్చారు. ఆమెను కరోనా పరీక్ష చేసుకోవాలని ప్రైవేట్‌ ఆస్పత్రి అధికారులు చెప్పారు. దీంతో సదరు నర్సు కోవిడ్‌ పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్‌గా తేలడంతో ఆమెను ఇంటికి పంపించారు. ఇంటి చుట్టూ బారికేడ్లు పెట్టించారు. కనీసం ఏ మందులు వేసుకోవాలి? ఏం తినాలి? ఏదైనా అయినప్పుడు ఎవరిని సంప్రదించాలో కూడా చెప్పలేదని ఆమె భర్త  ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తన భార్య నర్సుగా ఎంతో మంది రోగులకు సేవలు చేసిందని, ఇప్పుడు ఆమెకు కష్టమొస్తే ఒక్కరూ కూడా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇంట్లో చంటి బిడ్డలున్నారని, పాల కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పత్తా లేని అధికారులు..   
కంటైన్మెంట్‌ జోన్‌ పెట్టినప్పుడు ఆ జోన్‌ వద్ద  జీహెచ్‌ఎంసీ అధికారులతో పాటు ఓ పోలీసు, ఆరోగ్య సిబ్బంది కచ్చితంగా ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం ఎవరూ లేరు. కనీసం ఆ ఇంట్లో ఉన్నవారికి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఎవరికి ఫోన్‌ చేయాలో నంబర్‌ను కూడా ఇవ్వలేదు. ఫోన్‌ చేసి ఫలానా మందులు వేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పిన వారు ఎవరూ లేరని బాధితులు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు