ప్రైవేటు పరీక్షలు.. తప్పుల తడకలు!

27 Jun, 2020 02:21 IST|Sakshi

గందరగోళంగా ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్షలు

జాగ్రత్తలు, అనుభవజ్ఞులు లేకుండానే నిర్వహణ

16 ల్యాబ్‌లలో వైద్య, ఆరోగ్యశాఖ తనిఖీలు

ప్రభుత్వానికి నిపుణుల కమిటీ ప్రాథమిక నివేదిక

ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు ఇలా

ఐసీఎంఆర్‌ పోర్టల్‌ ప్రకారం చేసిన పరీక్షలు 9,577

 పాజిటివ్‌గా నిర్ధారించినవి 2,076

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పోర్టల్‌ ప్రకారం చేసిన పరీక్షలు 6,723

పాజిటివ్‌గా నిర్ధారించినవి 2,836

ల్యాబ్‌ల రికార్డుల ప్రకారం చేసిన పరీక్షలు 12,700 

పాజిటివ్‌ వచ్చినవి 3,571 

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు మెడికల్‌ ల్యాబ్‌లలో నిర్వహిస్తున్న కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. శాంపిల్స్‌లో ఉన్న వాస్తవ పరిస్థితికి భిన్నంగా రిపోర్టు లు ఇవ్వడంతో సర్వత్రా అయోమయం నెలకొంటోంది. అటు వైరస్‌ లక్షణాలున్నట్లు భావించి శాంపిల్స్‌ ఇచ్చినవారికి.. ఇటు వివరాలు పరిశీలిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగానికి ఈ పరిస్థితి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. లెక్కకు మించి పరీక్షలు నిర్వహిస్తుండగా.. వైరస్‌ లేనప్పటికీ పాజిటివ్‌ కేసులుగా పేర్కొంటూ రిపోర్టులు ఇస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు ఏమిటో తెలుసుకునేందుకు ఉపక్రమించిన వైద్య, ఆరోగ్య శాఖ.. ప్రైవేటు ల్యాబ్‌లలో వసతులు, సౌకర్యా లు, పరీక్షల నిర్వహణ, రిపోర్టుల జారీ తదితర అంశాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మైక్రోబయాలజీ ప్రొఫెసర్లు, వైద్య విద్య సంచాలక కార్యాలయ నిపుణులు, ఖాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం నిపుణులతో కూడిన నాలుగు బృందాలు ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రైవేటు ల్యాబ్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి పలు అంశాలను వెలుగులోకి తెచ్చాయి. 

సరైన శిక్షణ లేకుండానే... 
రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు అనుగుణం గా ఈ పరీక్షలు నిర్వహించాలి. కానీ చాలాచోట్ల కనీస జాగ్రత్తలు పాటించడంలేదని తనిఖీ బృం దాలు గుర్తించాయి. పలు ల్యాబ్‌లలో శాంపిల్స్‌ తీసుకునే సిబ్బంది పీపీఈ కిట్లు కూడా ధరించడం లేదు. ల్యాబ్‌ వాతావరణం ఇబ్బందికరంగా ఉం డగా.. చాలామంది సిబ్బందికి కేబిన్‌లు కూడా లేవు. ప్రధానంగా పరీక్షలు నిర్వహించే సిబ్బంది సరైన అనుభవం లేకుండానే పరీక్షలు చేస్తుండటంతో ఎక్కువ కేసులు నెగిటివ్‌కు బదులు పాజి టివ్‌గా వస్తున్నట్లు తనిఖీ బృందం గుర్తించింది.

ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో పూల్డ్‌ టెస్టింగ్‌ విధానం పూర్తయిన తర్వాత వచ్చేవాటిలో పాజిటివ్‌ కేసులతో పాటు నెగిటివ్‌ కేసులను కూడా పాజిటివ్‌గా పే ర్కొంటున్నట్టు నిర్ధారించింది. జాగ్రత్తలు పాటిం చకపోడంతో శాంపిల్స్‌ కలుషితం కావడంతో పా టు నెగిటివ్‌ వచ్చే శాంపిల్స్‌ కూడా పాజిటివ్‌గా ని ర్ధారణయ్యే అవకాశముందని అంచనాకు వచ్చింది. కొన్ని ల్యాబ్‌లలో భౌతికదూరం పాటించకుం డా ఇష్టానుసారంగా శాంపిల్స్‌ తీసుకుంటున్నట్లు గుర్తించింది. మరికొన్ని ల్యాబ్‌లలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని, పరికరాలను శుభ్రం గా ఉంచకపోడంతో పరీక్షల ఫలితాలు ప్రమాదకరంగా వచ్చే అవకాశం ఉందని కమిటీ తేల్చింది. 

మరింత లోతైన అధ్యయనం... 
వైద్య, ఆరోగ్య శాఖ నిపుణుల కమిటీ తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. నిబంధనలకు విరుద్దంగా, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు లోబడి నడుచుకోని ల్యాబ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. మరోవైపు ల్యాబ్‌లలో లోపాలపై లోతైన అధ్యయనం చేసి వాస్తవ పరిస్థితులను విశ్లేషించనున్నట్లు నివేదికలో పేర్కొంది.  

మరిన్ని వార్తలు