రోగుల ప్రాణాలతో ఆస్పత్రుల ఆటలు

22 Oct, 2019 02:50 IST|Sakshi

కొరవడిన అగ్నిప్రమాద నియంత్రణ చర్యలు

కళ్లు మూసుకుని ఎన్‌వోసీలు ఇస్తున్న జిల్లా వైద్యాధికారులు

సాక్షి, హైదరాబాద్‌: ఆస్పత్రులు వైద్యం అందించడంలోనే కాదు.. రోగులకు భద్రత ఇవ్వడంలోనూ విఫలం అవుతున్నాయి. ఆస్పత్రుల్లో అనుకోని ఘటనలు ఎదురైతే రోగులు, వారి బంధువులను కాపాడేందుకు కూడా వీలు లేకుండా నిర్మాణాలు ఉంటున్నాయి. అసలు అనేక ఆస్పత్రులు అగ్ని ప్రమాద రక్షణ వ్యవస్థలే లేకుండా నడుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌ ఎల్బీ నగర్‌లోని షైన్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగి ఒక నెలల శిశువు మాడి మసై పోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో శిశువు కూడా చనిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. మరికొందరి పరిస్థితి కూడా సీరియస్‌గా ఉందని సమాచారం. ఆస్పత్రుల్లో కొరవడిన అగ్ని ప్రమాద నివారణ వైఫల్యానికి షైన్‌ పిల్లల ఆస్పత్రి ఘటన నిలువెత్తు సాక్ష్యం. 

తూతూమంత్రంగా విచారణ..
తాజా దుర్ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ విచారణకు ఆదేశించారు. దీనిపై జిల్లా వైద్యాధికారి నుంచి ప్రాథమిక నివేదిక కూడా వచ్చింది. కానీ అందులో ఎటువంటి స్పష్టతా లేదు. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదానికి కారణాలు, వైఫల్యాలపై ఎటువంటి వివరాలూ ఇవ్వలేదు. మంటలార్పేందుకు అవసరమైన 50 వేల లీటర్ల సామర్థ్యం గల అండర్‌గ్రౌండ్‌ నీటి ట్యాంకు ఉండాల్సి ఉంటే, 10 వేల లీటర్ల సామర్థ్యం కలిగినదే ఉందని తేల్చారు. ఇక సదరు ఆస్పత్రికి అసలు ఫైర్‌ ఎన్‌వోసీ (నో అబ్జెక్షన్‌ సర్టి ఫికెట్‌) లేదని అధికారులు చెబుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఉందని వాదిస్తున్నారు. 

నియంత్రణ వ్యవస్థే లేదు..
రాష్ట్రంలో 8,807 రిజిస్టర్డ్‌ ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. వాటిలో దాదాపు 2 వేల ఆస్పత్రులు అగ్ని ప్రమాద రక్షణ వ్యవస్థ లేకుండానే నడుస్తున్నాయి.  అనుమతులన్నీ సక్రమంగా ఉన్న తర్వాతే డీఎం హెచ్‌వోలు వాటికి లైసెన్స్‌లు ఇస్తారు. కొందరు జిల్లా వైద్యాధికారులు కాసుల కోసం కక్కుర్తి పడి కళ్లుమూసుకుని ఎడాపెడా లైసెన్స్‌లు ఇస్తున్నారు. 

గ్రేటర్‌లో మరీ ఘోరం..
గ్రేటర్‌ పరిధిలోని చాలా ఆస్పత్రులు ఫైర్‌ సేఫ్టీ, ఫైర్‌ ఎన్‌వోసీ లేకుండానే నడుస్తున్నాయని డైరెక్టర్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ జనవరిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. డీఎంహెచ్‌వోలు లంచాలకు అలవాటు పడి ఎడాపెడా అనుమతులు జారీ చేస్తున్నారని పేర్కొంది. ఆ నివేదిక ఆధారంగా ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ఆస్పత్రుల్లో ఫైర్‌ ఎన్‌వోసీ లేకుండా లైసెన్స్‌లు ఇవ్వవద్దని, రెన్యువల్‌ చేయవద్దని సర్క్యులర్‌ జారీ చేశారు. అయితే చాలామంది డీఎంహెచ్‌వోలు ఇదేం పట్టించుకోవడం లేదు.

అధ్వానంగా నిర్మాణాలు
రాష్ట్రంలోని చాలా ఆస్పత్రులు ఇరుకైన గదుల్లో ఉంటున్నాయి. అందులోనూ గాలీ వెలుతురు వచ్చే అవకాశం లేని కిటికీలు, అత్యవసర పరిస్థితి తలెత్తితే బయటకు వెళ్లలేని స్థితుల్లో ఆస్పత్రుల నిర్మాణాలుంటున్నాయి. అగ్ని ప్రమాదం సంభవిస్తే సాధారణ పౌరుల మాదిరిగా రోగులు ఉరుకులు పరుగులు తీసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆస్పత్రుల్లో అత్యంత ప్రత్యేకమైన నివారణ చర్యలు తీసుకోవాలి. షైన్‌ ఆస్పత్రిలో నెలల చిన్నారి ఎటు పరిగెత్తగలదు? ఎంతో కీలకమైన ఆస్పత్రుల్లో కనీస ప్రమాదం నివారణ చర్యలే లేవంటే ఎంత దారుణం? 
 

>
మరిన్ని వార్తలు