అంతా.. మా ఇష్టం !

7 Jan, 2019 10:17 IST|Sakshi

నల్లగొండ పట్టణంలోని పాతబస్తీకి చెందిన వినోద్‌(16)కు గత నెలలో వైరల్‌ ఫీవర్‌ వచ్చింది. అతడిని ప్రకాశం బజార్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. వాతావరణంలో వచ్చే మార్పులతో వైరల్‌ ఫీవర్‌ వస్తుంది. దీనికి ఐదు రోజులపాటు విశ్రాంతి తీసుకుంటూ జ్వరం ఉం టే పారాసిటమాల్‌ ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ ఆ ఆస్పత్రి నిర్వాహకులు కాసుల కు కక్కుర్తిపడి అతడికి రోజుకు రెండు చొప్పున మెరోపెనెమ్‌ ఇంజక్షన్లు (ఒక్కొక్కటి రూ.2300) చొప్పున ఐదు రోజుల పాటు ఇచ్చారు. ఇది యాంటీబయాటిక్‌ ఇంజక్షన్‌. ఇది వేసిన రోగికి మున్ముందు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి యాంటిబయాటిక్స్‌ ఇంజక్షన్లు అంతగా పనిచేయవని వైద్యులే పేర్కొంటున్నారు. అదే విధంగా ఆ యువకుడికి జ్వరం తగ్గినప్పటికీ డెంగీ లక్షణాలు ఉన్నాయని మరోవారం రోజులు ఆస్పత్రిలో ఉంచుకుని వివిధ రకాల పరీక్షలు చేసి డిశ్చార్జి సమయంలో రూ.75 వేల బిల్లువేసి ముక్కుపిండి వసూలు చేశారు. ఇది ఒక్క వినోద్‌కు ఎదురైన పరిస్థితికాదు.. జిల్లాలో చిన్నచిన్న రోగాలతో ఆస్పత్రులకు వెళ్తున్న వారందరిదీ.!

నల్లగొండ టౌన్‌ : ‘చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి’ అనే సామెతను జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పతులు తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. ఓ సినిమాలో.. ఓ వ్యక్తి కొంచెం దగ్గితే.. వెంటనే స్కానింగ్‌ చేయించుకోండి అని సలహా ఇస్తాడు ఓ డాక్టర్‌. కరెక్టుగా ఇదే విషయాన్ని ఫాలో అవుతున్నాయి ప్రైవేట్‌ వైద్యశాలలు. సుస్తీ చేసిందని ఓ వ్యక్తి ప్రైవేట్‌ ఆస్పత్రికి వచ్చాడంటే నిర్వాహకులకు పండుగే పండుగ. అవసరం లేకున్నా సదరు డాక్టర్‌ రక్త, మూత్ర, స్కానింగ్‌ ఇతర పరీక్షలను నిర్వహించాలని రాయడం.. తప్పనిసరి పరిస్థితుల్లో డాక్టర్‌ సూచించిన విధంగా పరీక్షలు చేయించుకుని జేబులు ఖాళీ చేసుకోవడం రోగులకు పరిపాటిగా మారింది. వచ్చిన జబ్బుకు డాక్టర్‌ రాసే మందుల ఖర్చుకు.. మూడు, నాలుగు రేట్లు పరీక్షలకు వెచ్చిస్తున్నారు రోగులు. జ్వరం వస్తే.. నాలుగు మందులు రాసి.. తగ్గకపోతే మళ్లీ రండి అని చెప్పే రోజులు పోయాయి.

వచ్చిన వ్యక్తి నుంచి ఎంత గుంజాలో చూస్తున్నారు.. ప్రస్తుతం ఆస్పత్రి నిర్వాహకులు. ఆస్పత్రికి వచ్చే వారి నుంచి అత్యవసర వైద్యసేవలు, పరీక్షల పేరుతో లక్షల రూపాయలు నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్నపాటి జ్వరంతో డాక్టర్‌ వద్దకు వెళ్తే మలేరియా, డెంగీ, టైఫాయిడ్, షుగర్, థైరాయిడ్‌ వంటి పరీక్షలు చేయించుకోవాలని కొందరు డాక్టర్లు రెఫర్‌ చేస్తూ ఆస్పత్రుల నిర్వాహకులను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు వైద్యులు కమీషన్లకు కక్కుర్తిపడి తన వద్దకు వచ్చే ప్రతి వ్యక్తికి అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలని పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాలైన నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండలో స్పెషలైజేషన్‌ వైద్యులు లేకున్నప్పటికీ అర్హత లేని డాక్టర్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేసి.. అమాయక ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.

ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు..
జిల్లాలో అధికారికంగా సూపర్‌స్పెషాలిటీ, మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్‌హోమ్‌లు కలిపి సుమారు 400 వరకు ఉన్నాయి. మొత్తం 70 ల్యాబ్‌లకు మాత్రమే అనుమతులు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రికార్డులు చెబుతున్నాయి. అనుమతులు లేకుండా మరో 50 వరకు చిన్నాచితకా ల్యాబ్‌లు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఎక్కడైనా ప్రైవేట్‌ ఆస్పత్రి లేదా ల్యాబ్‌ ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అనుమతి తీసుకోవాలి. ఆస్పత్రి లేదా ల్యాబ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులు తొలుత తాత్కాలిక ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. అనంతరం పదిరోజుల్లో ఆస్పత్రిని పరిశీలించి అర్హులైన వైద్యులు, మౌలిక వసతులు, పార్కింగ్, అత్యవసర వైద్య పరికరాలు, వ్యర్థపదార్థాల నిర్మూలన వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణ వంటివన్నీ సక్రమంగా ఉంటే శాశ్వత నమోదు పత్రం జారీ చేస్తారు. కానీ జిల్లాలో ఎక్కడా ప్రభుత్వ నిబంధనలు పాటించిన ఆస్పత్రులు, ల్యాబ్‌లు ఉన్నట్లు కనబడడం లేదని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

‘సూపర్‌’ దోపిడీ
జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల పేరుతో నమోదైన ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రోగుల నుంచి లక్షలాది రూపాయలను దండకుంటున్నట్లు సమాచారం. జిల్లాలోని ఏ ఆస్పత్రిలోనూ గుండె, కిడ్నీ, న్యూరో తదితర సూపర్‌స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో లేరని తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వస్తున్న వారిని చేర్చుకుని కేవలం వెంటిలేషన్‌పై ఉంచి నార్మల్‌ వైద్య సేవలను అందిస్తూ వారం పదిరోజులు ఐసీయూలో ఉంచిన తరువాత రోగి బతికినా, చచ్చినా రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డెంగీ, మలేరియా, పాయిజన్‌ కేసులను కూడా ప్రభుత్వ ఆస్పత్రులకు రెఫర్‌ చేయకుండా అరకొర వైద్య సేవలు అందిస్తూ లక్షలు దండుకుంటున్నారని తెలుస్తోంది. రోగుల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నప్పటికీ వాటిని నియంత్రించలేని పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రోగులు చనిపోయి ఆందోళనలు చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి.

నీకింత.. నాకింత..
జిల్లాలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు గ్రామాల్లో చిన్నాచితక వైద్య సేవలను అందిస్తున్న వారిని ప్రలోభాలకు గురిచేస్తూ ప్రజలను ఆస్పత్రుల్లో చేర్పించే విధంగా ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది. జ్వరం, దగ్గు, జలుబు వంటి మామూలు జబ్బులతోపాటు పాయిజన్, బర్నింగ్, డెంగీ, మలేరియా వంటి రోగాల బారిన పడిన వారిని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేర్పించుకునే పనిలో ఉన్నారు. ఆస్పత్రిలో చేరిన రోగికి అవసరం లేకున్నా వివిధ రకాల పరీక్షలను చేయించడం, వెంటిలేషన్‌పై ఉంచడం, అవసరం లేని మందులను వాడినట్లు రికార్డుల్లో నమోదు చేసి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి.

అయితే ఆ వసూలు చేసిన బిల్లులో 40 శాతం ఆస్పత్రికి తీసుకొచ్చిన వ్యక్తికి.. 60 శాతం ఆస్పత్రి యాజమాన్యానికి చెందే విధంగా ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్‌ కళాశాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆస్పత్రిలో 12 పడకల సామర్థ్యం కలిగిన ఐసీ యూ ఏర్పాటు చేశారు. అందులో నాలుగు వెంటిలేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అత్యవసర సేవలు అందించడానికి అనుకూలమైన సౌకర్యాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించడానికి గ్రామాల్లో వైద్యం చేస్తున్న వ్యక్తులు మొగ్గుచూపడంలేదు.

కనిపించని ఫీజులు తెలిపే బోర్డులు..
ప్రైవేట్‌ మెడికల్‌ కేర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ రిజిస్ట్రేషన్‌ అండ్‌ రెగ్యులరైజేషన్‌ యాక్టు ప్రకారం ప్రతి ప్రైవేట్‌ ఆస్పత్రితో పాటు ల్యాబ్‌లోనూ వారు అం దించే సేవలు, వాటికి వసూలు చేస్తున్న ఫీజులను తెలిపే బోర్డులను తెలుగు, ఇంగ్లీష్‌లో ఏర్పాటు చే యాలి. కాని జిల్లాలో ఎక్కడా ఈ విధమైన బోర్డులు కనిపించవు. చిన్న వైద్యానికైనా వేల రూపాయల్లో ఖర్చు అవుతుండడంతో.. ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు.

నిబంధనలకు విరుద్ధ్దంగా వ్యహరిస్తే చర్యలు..
జిల్లాలో నిబంధనల  కు విరుద్ధంగా వ్యవహరించే ప్రైవేట్‌ ఆస్పత్రులతోపా టు ల్యాబ్‌లపై చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేని వాటిని సీజ్‌ చేస్తాం. ఆస్పత్రులు, ల్యాబ్‌లలో అనుమతి పత్రంతో పాటు ఫీజుల వివరాలను తెలిపే బోర్డులను ఏర్పాటుచేయాలి. అవసరం లేని వైద్యం అందించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.             
 – గంగావరప్రసాద్, ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఓ

మరిన్ని వార్తలు