‘గాంధీ’లో దళారీ దందా

25 May, 2019 08:36 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితులు రవికుమార్, శామ్యూల్‌ , రోగి నుంచి సేకరించిన రక్తనమూనాలు

ప్రైవేటు ల్యాబోరేటరీల నిర్వాకం

లేబర్‌వార్డులో రక్తనమూనాల సేకరణ  

దళారిని రెడ్‌హ్యాండెడ్‌ పట్టుకున్న వైనం  

సహకరించిన సెక్యూరిటీ గార్డుపై ఫిర్యాదు  

పోలీసుల అదుపులో నిందితులు  

గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్‌ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేటు ల్యాబోరేటరీలు యథేచ్చగా దందా కొనసాగిస్తున్నాయి.  మాయమాటలు చెప్పి నిరుపేదరోగుల నుంచి రక్తనమూనాలు సేకరించి రెండుచేతులా సంపాదిస్తున్నాయి. ఇందుకుగాను ల్యాబ్‌ నిర్వాహకులు ప్రత్యేకంగా కొందరు దళారులను నియమించుకోవడం గమనార్హం. గైనకాలజీ విభాగం లేబర్‌వార్డులో ఓ మహిళారోగి నుంచి రక్తనమూనాలు సేకరిస్తున్న దళారిని శుక్రవారం సెక్యూరిటీ సిబ్బంది  రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆస్పత్రి పాలనయంత్రాంగం ఫిర్యాదు మేరకు  దళారితోపాటు అతనికి సహకరించిన సెక్యూరిటీగార్డును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్, ఆర్‌ఎంఓ–1 జయకృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పద్మారావునగర్, నేహా ల్యాబ్‌కు చెందిన రవికుమార్‌ అనే వ్యక్తి గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో తిరుగుతూ రోగులు, రోగి సహాయకులను పరిచయం చేసుకుంటాడు. ఆస్పత్రి ల్యాబ్‌లో వైద్యపరీక్షల నిర్వహణలో తీవ్రజాప్యం జరుగుతుందని, నివేదికలు కూడా సరిగా ఉండవని,  పక్కనే ఉన్న ప్రైవేటు ల్యాబ్‌లో అన్ని రకాల వైద్యపరీక్షలు తక్కువ ఖర్చుతో చేయిస్తానని నమ్మిస్తారు. అనంతరం రోగుల నుంచి రక్తనమూనాలు సేకరించి తన ల్యాబ్‌లో వైద్యపరీక్షలు నిర్వహించి నివేదికలను అందించి డబ్బులు వసూలు చేసి తన కమీషన్‌ తీసుకునేవాడు. ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులనుంచి రక్తనమూనాలు సేకరించడం నేరమని తెలిసినా కమీషన్లకు ఆశపడి పదుల సంఖ్యలో దళారీలు నిత్యం ఆస్పత్రిలో రక్తనమూనాలు సేకరిస్తున్నారు. 

థైరాయిడ్‌ టెస్ట్‌ కోసం..
లేబర్‌వార్డులో చికిత్స పొందుతున్న దుర్గశ్రీ అనే మహిళ రోగితో థైరాయిడ్‌ టెస్ట్‌ కోసం బేరం కుదుర్చుకున్న రవికుమార్‌ శుక్రవారం ఉదయం ఎన్‌ఐసీయూ ప్రవేశద్వారం గుండా లోపలకు వచ్చి లేబర్‌వార్డులోకి వెళ్లి రోగి నుంచి రక్తనమూనాలు సేకరించాడు. అదే సమయంలో లేబర్‌వార్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న  సెక్యూరిటీ ఇన్‌చార్జి ప్రదీప్‌కుమార్‌ అనుమానాస్పదంగా తచ్చాడుతున్న రవికుమార్‌ను తనిఖీ చేయగా అతని  జేబు నుంచి రక్తనమూనాలు బయటపడ్డాయి. దీనిపై విచారణ చేపట్టగా ఈ దందాలో ఎన్‌ఐసీయు వార్డు వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీగార్డు శ్యామూల్‌ పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. దళారి రవికుమార్‌తోపాటు సెక్యూరిటీగార్డు శ్యామూలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.  

దళారులను నమ్మవద్దు
గాంధీఆస్పత్రిలో అత్యాధునికమైన ల్యాబొరేటరీలు, సౌకర్యాలు ఉన్నాయని, దళారీల మాయమాటలు విని మోసపోవద్దని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ అన్నారు. ఓపీ విభాగంలో అన్ని హంగులతో ల్యాబ్‌ను  ఏర్పాటు చేశామని, సెంట్రల్‌ ల్యాబ్, ఎమర్జెన్సీల్యాబ్‌లు రౌండ్‌ది క్లాక్‌ సేవలు అందిస్తున్నాయన్నారు.  క్షణాల్లో నివేదికలు అందిస్తున్నామన్నారు.  ప్రైవేటు ల్యాబ్‌లకు చెందిన దళారులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. –శ్రవణ్‌కుమార్, సూపరింటెండెంట్‌ 

మరిన్ని వార్తలు