కొత్తగా 3,350 పడకలు

30 Mar, 2020 02:25 IST|Sakshi

‘కరోనా’ సేవల్లో ‘ప్రైవేటు’ బోధనాసుపత్రులు 

సాక్షి, హైదరాబాద్‌ : ప్రైవేట్‌ మెడికల్‌ బోధన ఆసుపత్రులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 22 ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రులు (ఒకట్రెండు మినహా) సోమవారం నుంచి కరోనా బాధితుల సేవల్లో భాగస్వామ్యం కానున్నాయి. ఇప్పటికే ఆయా మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలతో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రైవేటు బోధనాసుపత్రుల్లో ఉన్న 3,350 పడకలు, 236 ఐసీయూ పడకలు, 80 వెంటిలేటర్లు పూర్తిగా కరోనా బాధితుల కోసమే వినియోగిస్తారు. ప్రస్తుతం ఆయా బోధనాసుపత్రుల్లో ఉన్న రోగులను ప్రత్యామ్నాయ ఆసుపత్రులకు తరలించారు. కొన్ని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు రెండు మూడు అనుబంధ ఆసుపత్రులున్నాయి. వాటిలో ఒక దానిలోకి రోగులను తరలించారు. కొన్ని కాలేజీలకు ఒకటి చొప్పున మాత్రమే అనుబంధ ఆసుపత్రులున్నాయి. అలాంటిచోట్ల ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సమీప జిల్లా ఆసుపత్రులకు రోగులను తరలిస్తున్నారు. కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా మూడో దశకు చేరుకుంటే కేసులు మరింత పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా సర్కారు వీటిని స్వాధీనం చేసుకుంది.

ఉచితంగానే ప్రైవేట్‌ డాక్టర్లు, సిబ్బంది సేవలు
ప్రైవేటు బోధనాసుపత్రుల్లోని వసతులను, డాక్టర్లను, సిబ్బందిని ప్రభుత్వం ఉచితంగానే ఉపయోగించుకోనుంది. సిబ్బంది జీతాలను ప్రైవేటు వారే ఇచ్చుకోవాలి. యాజమాన్యాలకు సర్కారు నయాపైసా చెల్లించదు. అయితే కరోనా బాధితులకు సేవచేసే వైద్యులకు, నర్సులకు, ఇతరత్రా సిబ్బందికి అవసరమైన పర్సనల్‌ ప్రొటెక్ట్‌ ఎక్విప్‌మెంట్స్, సర్జికల్‌ ఐటమ్స్, మాస్క్‌లు, శానిటైజర్లు, ఇతర పరికరాలను ప్రభుత్వమే రూ.30 కోట్ల మేర వెచ్చించి ప్రైవేట్‌ మెడికల్‌ బోధనాసుపత్రులకు అందచేస్తుంది. అంతేతప్ప ఈ నిధులను ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా ఇవ్వదు. దీనివల్ల నిధులు దుర్వినియోగం కావని సర్కారు భావిస్తోంది. ప్రైవేటు మెడికల్‌ కాలేజీలున్న వారిలో కొందరు మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా, ఇంకొందరు సానుభూతిపరులుగా ఉన్నారు. ఈ పరిచయాల ఆధారంగా ప్రైవేటు బోధనాసుపత్రులను స్వాధీనంలోకి తీసుకోవడంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, వీసీ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారని అధికారులు చెబుతున్నారు.

ఎంబీబీఎస్‌ విద్యార్థులకు సెలవులు
మొత్తం ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు, బోధనాసుపత్రులను ఖాళీచేసి సర్కారుకు అప్పగించడంతో వాటిల్లోని ఎంబీబీఎస్‌ విద్యార్థులకు సెలవులు ఇచ్చారు. ముఖ్యంగా మొదటి, రెండు, మూడో సంవత్సరం విద్యార్థులకు సెలవులు ఇచ్చారని, మిగిలిన తరగతుల, పీజీ విద్యార్థులు మాత్రం కరోనా సేవల్లో ఉంటారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. కాగా, కరోనా బాధితుల్లో విదేశాల నుంచి వచ్చినవారు, ధనికులు ఎక్కువ ఉన్నారు. ప్రస్తుతం సర్కారు ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌లో ఉండలేమని వారంతా అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు బోధనాసుపత్రుల్లోని వసతులు అటువంటి వారికి గొప్పగా ఉపయోగపడతాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. కాగా, గాంధీ ఆసుపత్రిని పూర్తిగా కరోనా చికిత్సలకే పరిమితం చేయగా, మరో ఏడెనిమిది సర్కారు బోధనాసుపత్రులు కూడా కరోనా సేవలకే పరిమితమైన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు