పైకంతోనే ప్రైవేట్ మెడికల్ సీటు !

4 Jun, 2014 00:30 IST|Sakshi
పైకంతోనే ప్రైవేట్ మెడికల్ సీటు !

* ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లకే ఇక ఎంసెట్!  
* కన్వీనర్, ‘బి’ కేటగిరీ సీట్లూ ‘ప్రైవేట్’ చేతుల్లోకి!
* ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ప్రత్యేక పరీక్ష?
* ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పరిధిలోనే కౌన్సెలింగ్

 
 సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌లో ర్యాంకు సాధించి ప్రతిభ చూపిస్తే చాలు.. ఒకవేళ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీటు రాకపోయినా ర్యాంకును బట్టి కన్వీనర్ కోటా లేదా కనీసం ‘బి’ కేటగిరీ సీటుతో ప్రైవేట్ కాలేజీల్లో చేరవచ్చనేది విద్యార్థుల ఆశ. అయితే ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడిక ఆ పరిస్థితి తారుమారు కానుంది. డబ్బు పెడితేనే ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అడుగుపెట్టడానికి అవకాశం లభిస్తుంది. ఇటీవలే వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం లక్ష మందికి పైగా విద్యార్థులు ఎంసెట్ రాశారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో నాలుగు వేలకు పైగా సీట్లున్నాయి.
 
 ఇకపై ఎంసెట్ కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లకు మాత్రమే వర్తిస్తుందని వైద్య విద్యాశాఖ వర్గాల నుంచి సమాచారం. 2014-15 సంవత్సరానికి నిర్వహించిన ఎంసెట్ కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్లకు మాత్రమే జరుగుతుంది. మొన్నటి వరకూ ప్రైవేటు కళాశాలల్లో ఉన్న సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా కింద, 10 శాతం సీట్లను ‘బి’ కేటగిరీ కింద భర్తీ చేసేవారు. కన్వీనర్ కోటా సీట్లకు ఏడాదికి రూ. 60 వేలు, బి కేటగిరీ సీట్లకు రూ.2.4 లక్షలు చొప్పున ఫీజు ఉండేది. ఇప్పుడు ప్రైవేట్ వైద్య కళాశాలలు నిర్వహించే ప్రత్యేక ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించినా... ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్సీ) నిర్ణయించిన ఫీజు రూ.3.10లక్షల నుంచి రూ. 3.75 లక్షల వరకు ఏటా విద్యార్థులు చెల్లించాల్సిందే.
 
 ఎంసెట్ తరహాలోనే ప్రైవేటు ప్రైవేశపరీక్ష ‘ఎంసెట్‌ఏసీ’ (మెడికల్ కామన్ ఎంట్రెన్ టెస్ట్ అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్) ఉంటుంది. ఈ పరీక్షను ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలోనే నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అంతేకాదు కౌన్సెలింగ్ కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఎంసెట్‌ఏసీపై రెండ్రోజుల్లోనే ఏదో ఒక నిర్ణయం వెలువరించేలా యాజ మాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. లేదంటే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడితే కన్వీనర్ కోటా సీట్లను వదులుకోవడానికి అంగీకరించబోవని, ఈ లోగానే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. మొత్తం 3,800 సీట్లు ఉండగా, కన్వీనర్ కోటా కింద 1,900 సీట్లు (మొత్తం ప్రైవేట్ సీట ్లలో 50 శాతం), ‘బి’ కేటగిరీ కింద 380 సీట్ల (మొత్తం ప్రైవేటు సీట్లలో 10 శాతం) ను ప్రభుత్వమే కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేసేది. ఇప్పుడా అవకాశం ఉండదు.
 
 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లకు కోత
 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 వైద్య కళాశాలలు ఉన్నాయి. మొత్తం 2,450 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈఏడాది మౌలిక వసతులు లేవన్న కారణంగా భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) ఒంగోలు రిమ్స్‌లో 100 సీట్లు, నిజామాబాద్‌లో 100 సీట్లు, గాంధీ వైద్య కళాశాలలో 50 సీట్లు, ఎస్వీ వైద్య కళాశాలలో 50 సీట్లు, కర్నూలు మెడికల్ కాలేజీలో 50 సీట్లు, గుంటూరు వైద్య కళాశాలలో 50 సీట్లకు కోత విధించింది. ఇలా మొత్తం 400 సీట్లు విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోయాయి. ఇక మిగిలిన 2,050 సీట్లకు మాత్రమే ఎంసెట్ ద్వారా కౌన్సెలింగ్ జరుగుతుంది. ఈ సీట్లకు 1.11 లక్షల మంది ఎంసెట్ ద్వారా పోటీపడుతున్నారు.

మరిన్ని వార్తలు