జంగల్‌ కబ్జా!

12 Feb, 2018 17:03 IST|Sakshi
నిమ్మపల్లి–ఎగ్లాస్‌పూర్‌ మధ్య సేద్యానికి సిద్ధంచేసిన అటవీ భూమి

అటవీ భూములపై అక్రమార్కుల కన్ను

గుట్టల్లో చెట్లు నేలమట్టం

తరలుతున్న వన సంపద

జిల్లా వ్యాప్తంగా 800 ఎకరాలు అన్యాక్రాంతం

ఫా‘రెస్ట్‌’లో అధికారులు

సిరిసిల్ల :  రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. భూమి ధరలు పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో అటవీ భూములపై అక్రమార్కులు కన్నేశారు. వనాన్ని గొడ్డళ్లతో తెగనరికేస్తున్నారు. రిజర్వ్‌ ఫారెస్టులోని చెట్లను నరికివేస్తూ భూమిని సాగు చేస్తున్నారు. అటవీ సంపదను రక్షించాల్సిన అధికారులు ఆఫీసులకే పరిమితవుతుండగా, దట్టమైన అడవులు నేలమట్టమవుతున్నాయి. జిల్లా సరిహద్దు అడవుల్లో సాగుతున్న వన సంహారంపై కథనం.

అడవి తల్లి గుండెలపై గొడ్డలి వేటు..
జిల్లా పరిధిలో 379.14 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో 18.78 శాతం మాత్రమే అడవులు ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, గంభీరావుపేట మండలాలను కలుపుతూ దట్టమైన అడవి విస్తరించి ఉంది. ఒకప్పుడు నక్సలైట్లకు ఆశ్రయం కల్పించిన ఈ అడవులు ఇప్పుడు స్వార్థపరుల గొడ్డలి వేట్లకు నేలకూలుతున్నాయి. అడవులను నరకడాన్ని అప్పట్లో నక్సలైట్లు తీవ్రంగా పరిగణించేవారు. ఎవరైనా స్మగ్లర్లు చెట్లను నరికితే.. కఠిన శిక్షలు అమలు చేసేవారు.

దీంతో నక్సలైట్ల భయంతో ఎవరూ జంగల్‌ని నరికే సాహసం చేయలేదు. దశాబ్ద కాలంగా నక్సలైట్ల కదలికలు తగ్గిపోయాయి. గ్రామీణులు విచ్చలవిడిగా పచ్చని చెట్లను నరికివేస్తూ భూమిని ఆక్రమిస్తున్నారు. ఏళ్ల తరబడి సహజ సిద్ధంగా పెరిగిన అడవులు గంటల్లోనే నేలకూలుతూ మోడులు దర్శనమిస్తున్నాయి. అడవుల్లో యథేచ్ఛగా అక్రమార్కులు చెట్లను నరికివేయడంతో అడవి తల్లి దీనంగా రోదిస్తోంది. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కరువుకు క్షీణిస్తున్న అడవులే కారణమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తుండగా, అడవిని ఆక్రమిస్తూ అటవీ భూమి కోసం నరికివేత కొనసాగుతోంది.

నరికిన వారికి నరికినంత..
వీర్నపల్లి మండలం గర్జనపల్లి, రంగంపేట, వన్‌పల్లి, శాంతినగర్, రుద్రంగి మండలం మానాల, కోనరావుపేట మండలం వట్టిమల్ల, ఎగ్లాస్‌పూర్, మరిమడ్ల, నిమ్మపల్లి, నిజామాబాద్, ప్రాంతాల్లోని అటవీ భూములను ఇటీవల కొందరు నరికివేసి సాగు చేసుకుంటున్నారు. వట్టిమల్ల నారాయణ చెరువు ప్రాంతంలో 20 ఎకరాలు ఆక్రమణకు గురైంది. వృక్షాలను నేలకూల్చి సేద్యానికి సిద్ధం చేశారు. మరిమడ్ల, మానాల సరిహద్దుల్లో గుట్టల మధ్యలో నీటి ఆధారం ఉండడంతో అడవి ని నరికివేసి భూములు ఆక్రమించుకుంటున్నారు. నరి కిన వారికి నరికినంత భూమి దక్కుతోంది. వేసవి సీజ న్‌కు ముందే అడవులన్నీ ఆకురాలి ఉండడంతో చెట్లను నరికివేస్తూ భూములను చదును చేస్తున్నారు. ఈ సీజన్‌లోనే 300 ఎకరాలను కొత్తగా నరికివేసిన అక్రమార్కులు ఖరీఫ్‌లో సాగు చేసేందుకు సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 800 ఎకరాల ఫారెస్ట్‌ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. నరికివేసిన చెట్లను వంటచెరుకుగా, విలువైన టేకు కలపను గృహోపకరణాలకు వినియోగించుకుంటూ అటవీ సంపదను దోచుకుంటున్నారు.

ఫా‘రెస్ట్‌’..
అడవుల నరికివేత కొనసాగుతుండగా క్షేత్రస్థాయిలో ఉండాల్సిన అటవీ శాఖ సిబ్బంది పట్టణాల్లో నివాసముంటూ మొక్కబడిగా నిఘా కొనసాగిస్తున్నారు. నిజానికి అడవిలో గొడ్డలి చప్పుడు వినిపిస్తే పట్టుకుని చట్టబద్ధంగా శిక్షించాల్సిన ఫారెస్టు అధికారులు క్షేత్రస్థాయిలో లోపాయికారి అంగీకారంతో అటవీ భూముల ఆక్రమణకు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వన సంరక్షణ పేరిట లక్షల్లో మొక్కలు నాటుతూ వాటి ఆలనాపాలన పట్టించుకోని అధికారులు సహజ సిద్ధంగా పెరిగిన ప్రకృతి సంపద నేలకూలుతుంటే కనీసం అడ్డుకోకపోవడం విడ్డూరం. కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్‌లో ఫారెస్ట్‌ భూములు ముంపునకు గురవుతున్నాయని నిజామాబాద్‌కు చెందిన యువకుడు హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ఫారెస్ట్‌ అధికారులకు నోటీసులు జారీ చేసింది. జిల్లాలో అటవీ భూముల పరాధీనంపై అటవీశాఖ అధికారులు దృష్టిసారించి అక్రమార్కులను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎవరినీ వదలం
జిల్లా పరిధిలో అటవీ భూములను ఎవరు అక్రమించినా వదిలిపెట్టం. చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ భూరికార్డుల ప్రక్షాళనతో మా భూములపై క్లారిటీ వస్తుంది. ఎక్కడైనా అటవీ భూములను సాగుచేస్తే వారికి నోటీసులు జారీ చేసి స్వాధీనం చేసుకుంటాం. కొత్తగా మొక్కలను నాటుతాం. మల్కపేట రిజర్వాయర్‌ విషయంలో చట్ట పరిధిలోనే పని చేశాం. లక్ష చెట్లు ముంపునకు గురవుతుంటే ఏడు లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధం చేశాం. – వేముల శ్రీనివాస్‌రావు, డీఎఫ్‌వో.

 

మరిన్ని వార్తలు