తప్పని భారం!

15 Jun, 2019 07:52 IST|Sakshi

కొత్తకోట: జూన్‌ మాసం వచ్చిందంటే తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేసి వెళ్తుంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నెల కావడంతో మామూలు రోజులకంటే సామాన్యులకు ఖర్చులు రెట్టింపవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 14 మండలాల పరిధిలో మొత్తం 852 పాఠశాలలు ఉండగా ఇందులో ఉన్నత పాఠశాలలు 101 , ప్రాథమికోన్నత  పాఠశాలలు 58 , ప్రాథమిక పాఠశాలలు 61, కేజీబీవీలు 15, మోడల్‌ స్కూళ్లు 3, రెసిడెన్సియల్‌ స్కూళ్లు 13, మూడు ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 55,644 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికే ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు తమ పాఠశాలల్లో అడ్మిషన్లు పరిమితంగా ఉన్నాయంటూ విస్తృత ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను మభ్య పెడుతున్నారు. టెక్నో, ఈ–టెక్నో, మోడల్, డీజీ స్కూల్‌ అనే వివిధ రకాల తోక పేర్లతో తల్లిదండ్రులను ఆకర్షితులను చేస్తున్నారు. పాఠశాలల్లో సాధించే ర్యాంకులు, ఉత్తమ మార్కులను వివిధ  మాద్యమాల్లో ప్రచారం చేస్తూ అడ్మిషన్లు పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ తల్లిదండ్రులను నిలువునా దోచుకుంటున్నారు.

ఏ పాఠశాలలో చేర్పించాలి? 
ఈనెల 12  నుంచి పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు చేస్తున్న ప్రచారం చూసి తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పిస్తే బాగుంటుందో తేల్చుకోలేక తల్లిదండ్రులు తికమక పడుతున్నారు. కొన్ని ప్రైవేటు కార్పొరేట్‌ పాఠశాలలు తాము నియమించుకున్న పీఆర్‌ఓల ద్వారా  అడ్మిషన్లు  పెంచుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు.  వారి మాయమాటలు  నమ్మి  డొనేషన్లు    ఇచ్చిన తల్లిదండ్రులను  అయోమయానికి  గురవుతున్నారు.  అడ్మిషన్లు పెంచుకునేందుకు ఇతర పాఠశాలలపై కుట్రలు చేసేందుకు సైతం వెనకాడడం లేదు. ఇప్పటికే తల్లిదండ్రుల సెల్‌ నంబర్లను సేకరించిన యజమాన్యాలు అడ్మిషన్ల కోసం తరచూ ఫోన్లకు మేసేజ్‌లు చేయడంతోపాటు తరచూ ఫోన్లు చేస్తూ విసుగెత్తిస్తున్నారు.
  
ఏటేటా పెరిగిపోతున్న భారం  
ఏటేటా ఫీజుల భారం భారీగా పెరుగుతూనే ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజులను మరింతగా పెంచేసి తల్లిదండ్రులు ఆలోచించే సమయం కూడా లేకుండా ప్రవేశాలు ఇచ్చేస్తున్నారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకే రూ. 10 వేల నుంచి రూ.20 వేల వరకు ఫీజలు లాగుతున్నారు. దాంతోపాటు అడ్మిషన్‌ ఫీజు, బస్సు ఫీజులు, స్పెషల్‌ ఫీజులను ఇష్టారాజ్యాంగా పెంచేస్తున్నారు. దీనికితోడు పాఠశాలల్లోనే ఏర్పాటు చేసిన దుకాణాల్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలను కొనుగోలు చేయాలని నిబంధనలు పెడుతున్నారు. అలాగే  పాఠ్యపుస్తకాలు, యూనిఫాం రేట్లు పెరిగిపోయాయి. అధికారుల కళ్లముందే ఈ తతంగమంతా జరుగుతున్నా విద్యా హక్కు చట్టం నిబంధనలు పాటించకపోయినా పట్టించుకోకపోగా ఫీజుల నియంత్రణపై అధికారులు దృష్టి సారించకపోవడంతో తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రతీ పాఠశాలలో పేరెంట్స్‌ కమిటీలను ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణను చేపట్టాల్సి ఉండగా ఏ పాఠశాలలో అలాంటి చర్యలు కనిపించడం లేదు.   

నామ్కేవాస్తెగా బడిబాట 
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్యను పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం యేటా బడిబాట కార్యక్రమాన్ని చేపడుతోంది. అయినా ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం లేదు. ఎన్నో కోట్ల రూపాయాలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్న విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడం లేదు. విద్యాశాఖా«ధికారులు ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఇప్పటికే ప్రభుత్వ నివేదికలు జిల్లాలో డ్రాపౌట్ల సంఖ్య పెరిగిపోతుందుని స్పష్టం చేసిన అధికారులకు కనువిప్పు కలగడంలేదు.

మరిన్ని వార్తలు