ప్రభుత్వ అండతోనే ప్రైవేట్‌ స్కూళ్ల ఫీజుల దోపిడీ

11 Feb, 2018 02:08 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు

ఆల్‌ ఇండియా సేవ్‌ ఎడ్యుకేషన్‌ కమిటీ అధ్యక్షుడు విశ్వేశ్వరరావు  

హైదరాబాద్‌: ప్రభుత్వ అండతోనే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల దోపిడీని కొనసాగిస్తున్నాయని ఆల్‌ ఇండియా సేవ్‌ ఎడ్యుకేషన్‌ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు విమర్శించారు. ‘ఫీజుల పెంపుదలతో తల్లిదండ్రులపై జరుగుతున్న దోపిడీ, విద్యాప్రమాణాల పతనం’అనే అంశంపై పేరెంట్స్‌ అసోసియేషన్‌ కో–ఆర్డినేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వేసిన తిరుపతిరావు కమిషన్‌ సిఫార్సులను పక్కనపెట్టి ప్రైవేట్‌ యాజమాన్యాలు ఏటా ఫీజులు పెంచుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీలను ఫీజుల నియంత్రణ కోసం కాకుండా ఫీజుల రద్దు కోసం ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రైవేట్‌ విద్యను రద్దు చేసి ప్రభుత్వమే ఉచిత నిర్భంద విద్యను అమలు చేయాలని సూచించారు. ఆర్థోపిడీషియన్‌ డాక్టర్‌ ఆసిఫ్‌ అనీఫ్‌ మాట్లాడుతూ.. విద్యా సంస్థల విధానాల వల్ల పుస్తకాల బరువుతో చిన్నారుల్లో స్సైనల్, భుజం నొప్పి వస్తున్నాయని, ఇది గూని సమస్యకు దారితీసే అవకాశం ఉందన్నారు. డాక్టర్‌ సత్తార్‌ఖాన్‌ మాట్లాడుతూ.. ఒక దేశం భవిష్యత్తు నిర్ణయించేది విద్యారంగమేనని కానీ దురదృష్టవశాత్తూ నేటి ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యా వ్యాపారీకరణ కారణంగా ప్రైవేటు రంగంలోకి నెట్టబడుతుం దన్నారు. పీఏసీసీ సభ్యులు తేజ మాట్లాడుతూ, రాజ్యాంగాలు కల్పించిన ఉచిత నిర్బంధ విద్యను అన్ని ప్రభుత్వాలు ఉల్లంఘించాయన్నారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు