అయ్యో.. ప్రైవేట్‌ టీచర్లకు ఎంత కష్టం

28 Jun, 2020 09:20 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా సుమారు 900లకు పైగా పాఠశాలల్లో 22 వేల మందికి పైగా ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. కరోనా కారణంగా 3 నెలలుగా యాజమాన్యాలు జీతాలు చెల్లించక పోవడం, విద్యాసంవత్సరం ప్రారంభమైనా బడులు తెరుచుకోక పోవడంతో కుటుంబ పోషణకు ఏ పని దొరికితే ఆ పనికి వెళ్తూ అరిగోస పడుతున్నారు. విద్యార్థులకు పాఠాలు బోధించే తమకు ఇంతటి కష్టం వస్తుందనుకోలేదంటూ ఆవేదన చెందుతున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో కుటుంబ పోషణ కోసం కొందరు దినసరి కూలీలుగా మారగా మరికొందరు ఆటోలు నడుపుతూ, వ్యవసాయ పనులకు వెళ్తూ, కట్టెలు అమ్ముకుంటూ, కులవృత్తులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం, ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు స్పందించి, ఈ కష్టకాలంలో తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.  

మార్చి నెల వరకే చెల్లింపు
లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయులకు మార్చి నెల వరకే వేతనాలు చెల్లించి, చేతులు దులుపుకున్నాయి. పాఠశాలలు ప్రారంభమైతేనే జీతాలు అనే ధోరణిలో ఉన్నాయి. కొన్నిచోట్ల ఇప్పటికే ఉపాధ్యాయులను తొలగిస్తుండగా మరికొన్ని చోట్ల అడ్మిషన్ల పేరిట టార్గెట్లు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఉన్నత విద్యనభ్యసించి, గురువులుగా గుర్తింపు పొందిన వారు నేడు కూలీ పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. 

10 శాతం మంది ఆన్‌లైన్‌లో బోధన
ఇటీవలి కాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌లో క్లాస్‌లను చెప్పడం ప్రారంభించాయి. ఒక్కో బడిలో 10 శాతం మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి, వారితో పాఠాలు చెప్పిస్తున్నారు. ఇలా ఆన్‌లైన్‌లో బోధించేవారికి వేతనాలు ఇచ్చేందుకు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. మిగతా ఉపాధ్యాయుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.

టైలరింగ్‌ పని చేస్తున్నా..
మాది పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం మల్యాల. బీఎస్సీ, బీఈడీ చేసిన. పదేళ్లుగా పలు ప్రైవేటు స్కూళ్లలో టీచర్‌గా పని చేస్తున్నాను. లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన పాఠశాల ఇప్పటికీ తెరుచుకోలేదు. మాకు యాజమాన్యాలు ఏప్రిల్, మే నెలల వేతనాలు ఇవ్వలేదు. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారడంతో టైలరింగ్‌ పని చేస్తున్నా. ప్రభుత్వం స్పందించి, ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలి. 
– బాలవేణి రాణి, ప్రైవేట్‌ టీచర్‌ 

బీడీలు చుడుతున్నా..
మాది రేకుర్తి పరిధిలోని సాలెగనర్‌. నేను ఎంఏ బీఈడీ చేసిన.  ఆరేళ్లుగా ఒక ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్నా. కరోనా కారణంగా జూన్‌ నెల గడిచిపోతున్నా పాఠశాల తెరుచుకోలేదు. మూడు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నాం. బీడీలు చుట్టడం నాకు తెలిసిన పని కావడంతో ప్రస్తుతం అదే చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నా. ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. 
– నౌసీన్, ప్రైవేట్‌ టీచర్‌ 

మాస్కులు కుడుతున్నా..
మాది కొండపల్కల గ్రామం. నేను ఎంఏ. బీఈడీ చదివిన. 20 ఏళ్లుగా ప్రైవేట్‌ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా. మార్చి నెల నుంచి వేతనాలు రాకపోవడంతో కుటుంబం గడవని పరిస్థితి నెలకొంది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవడంతో మాస్కులు కుడుతూ కాలం వెల్లదీస్తున్నా. ఈ విపత్కర కాలంలో పాఠశాలల యాజమాన్యాలు, ప్రభుత్వం వేతనాలు అందించి ఆదుకోవాలి. 
– పచ్చునూరి శ్రీనివాస్, ప్రైవేట్‌ టీచర్‌ 

కూలీ పనులకు వెళ్తున్నా..
మా స్వగ్రామం తిమ్మాపూర్‌. బీఏ బీఈడీ చదివిన. 15 ఏళ్లుగా ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా. ప్రస్తుతం పాఠశాలలు తెరుచుకోక పోవడంతో కూలీ పనులకు వెళ్తున్నా. కరోనా వైరస్‌ ప్రైవేట్‌ ఉపాధ్యాయుల జీవితాలను ఆగం చేసింది. కుటుంబ పోషణ భారమవుతోంది. ప్రభుత్వం మాపై దయచూపి, ఆర్థికసాయం అందించి అండగా నిలవాలి.
 – వినయ్‌కుమార్, ప్రైవేట్‌ టీచర్‌  

మరిన్ని వార్తలు