ప్రైవేటు టీచర్ల మెడపై అడ్మిషన్ల కత్తి

2 Mar, 2020 07:56 IST|Sakshi

టార్గెట్లు పెట్టి వేధిస్తున్న విద్యాసంస్థల యాజమాన్యాలు

ఆందోళన చెందుతున్న టీచర్లు

ఫెర్టిలైజర్‌సిటీ (రామగుండం): పెద్దపెల్లి జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులపై అడ్మిషన్ల కత్తి వేలాడుతోంది. 2020–2021 విద్యా సంవత్సరానికి ప్రవేశాల టార్గెట్‌ విధిస్తున్నాయి. పిల్లలను చేర్పిస్తేనే కొలువు ఉంటుందని లేకుంటే భద్రత భరోసా ఇవ్వమని యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి. దీంతో తమ కొలువులు ఉంటాయో, ఊడుతాయో తెలియని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి అడ్మిషన్లకోసం తల్లిదండ్రులను ప్రాధేయపడుతున్నారు. బోధనతోపాటు అదనపు తరగతులు, శనివారం, ఆదివారం సెలవు వచ్చిందంటే పాఠశాల అడ్మిషన్లుకోసం యాజమాన్యాలు వేధించడంతో కొందరు మానసికంగా శారీరకంగా తమ జీవితం నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ లాగా ఇంటింటికి తిరుగుతూ అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

జిల్లాలో 1950 మంది ప్రైవేటు టీచర్లు
జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో సుమారు 190 ఉన్నాయి. వీటిలో దాదాపు 1950 మంది డిగ్రీ , బీఎడ్, డీఎడ్‌ చేసి ప్రభుత్వ ఉద్యోగాలు రాక గత్యంతరం లేక కుటుంబ పోషణకోసం ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్నారు. ప్రైవేటు కార్పొరేట్‌ పాఠశాల యాజమాన్యాలు రెండునెలల ముందుగానే పాఠశాలకు పిలిపించి అడ్మిషన్ల టార్గెట్‌ విధించారు. వేసవిసెలవుల్లో కూడా అడ్మిషన్లు చేస్తేనే వచ్చే విద్యా సంవత్సరం పని చేస్తారని లేదంటే వేరే పని చూసుకోవచ్చని స్పష్టం చేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతున్నారు. తమ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను వేడుకుంటున్నారు ఇప్పటికే సంవత్సరంలో పదినెలల జీతం మాత్రమే చెల్లిస్తున్న యాజమాన్యాలు పని మాత్రం 12 నెలలు చేయించుకుంటున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉదయం నుంచి రాత్రి వరకు
జిల్లాలో ఉన్న ప్రైవేట్‌ పాఠశాలల టీచర్ల తెల్లారేసరికి క్యాంపెయినింగ్‌ పేరుతో రోడ్డు ఎక్కుతున్నారు. పాఠశాలలోని సౌకర్యాలు, మీ పిల్లలను చేర్పిస్తే ఉజ్వల భవిష్యత్‌ అందిస్తామంటూ తల్లిదండ్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అడ్మిషన్లు చేయకపోతే కాస్తోకూస్తో వచ్చే జీతం ఈ ఉద్యోగం ఊడిపోతుందని భయంతో ఉపాధ్యాయులు మార్కెటింగ్‌ ఏజెంట్‌ అవతారమెత్తి కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

చాలీచాలని జీతాలు
ప్రైవేట్‌ పాఠశాలలో పని చేసే టీచర్లకి యాజమాన్యాలు ఇచ్చే వేతనం అరకొర మాత్రమే. ప్రాథమికస్థాయి విద్యాబోధనకు 3వేల నుంచి 5 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు. హైస్కూల్‌ అనుభవం ఉన్న సీనియర్‌ ఉపాధ్యాయులకు 5 వేల నుంచి 10 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు. ప్రభుత్వం జీవో ప్రకారం విద్యార్థుల ఫీజు నుంచి వసూలు చేసిన వాటిలో 59శాతం టీచర్ల వేతనాలకు ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ ఎక్కడా అమలు చేయడం లేదు. జీవో విడుదల చేసిన ఫలితం లేకుండా పోయింది. కష్టపడి పాఠాలు బోధించి విద్యార్థులకు ర్యాంకులు సాధించే పాఠశాలకు మంచి పేరు తెచ్చిపెడుతున్న టీచర్లకు సరైన వేతనాలు ఇవ్వకుండా వారి కష్టాన్ని దోచుకొని యాజమాన్యాలు తమ జేబులు నింపుకుంటున్నాయనే అనే ఆరోపణలు ఉన్నాయి.

టార్గెట్‌ పూర్తి అయితేనే ఉద్యోగం
ఇచ్చిన అడ్మిషన్‌ పూర్తి చేస్తేనే రెండు నెలల వేసవి సెలవుల్లో జీతం ఇస్తామని కొన్ని కార్పొరేట్‌ పాఠశాలలు నిబంధనలు విధిస్తున్నాయి. ఒక ఉపాధ్యాయుడు 10 నుంచి పదిహేను మంది పిల్లలను ఖచ్చితంగా పాఠశాలలో చేర్చాలని నిబంధనలు విధించారు.

మరిన్ని వార్తలు