వేలం వేయరు.. దుకాణాలు తెరవరు 

31 Jul, 2019 10:07 IST|Sakshi
వేలానికి నోచని షాపింగ్‌కాంప్లెక్స్‌

ఏడాదిన్నరగా ఎదురుచూపు  

ఎమ్మెల్యే గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తేనే ముందడుగు  

మార్కెట్‌యార్డులో రూ.30 లక్షల ఆదాయానికి గండి

సాక్షి, మహబూబ్‌నగర్‌ : జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ దుకాణాలకు అధికారులు, పాలకులు వేలం వేయడంలేదు.. దుకాణాలను తెరవడంలేదు. ఫలితంగా సర్కారు ఖజానాకు చిల్లు పడుతోంది. పట్టణంలోని పాతబస్టాండ్‌ ఏరియాలో రూ.1.56 కోట్ల వ్యయంతో నిర్మించిన 28 దుకాణాలను, అలాగే కూరగాయల మార్కెట్‌లో రూ.38 లక్షల వ్యయంతో 16 దుకాణాలను నిర్మించారు. వాటిని గతేడాది ఫిబ్రవరి 17న అప్పటి మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే ఆ దుకాణాలకు వేలం వేయకుండా తెరవకుండా ఉండటంతో మార్కెట్‌ యార్డుకు దాదాపు ఇప్పటివరకు రూ.30 లక్షల మేర ఆదాయం రాకుండా పోయింది. 

గ్రీన్‌సిగ్నల్‌ ఎప్పుడో? 
మార్కెట్‌యార్డు పాలకవర్గాన్ని పొడగించేందుకు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఇటీవలే ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఏడాది కాలంలో పాలకవర్గం షాపింగ్‌కాంప్లెక్స్‌లోని దుకాణాలను వేలం వేయడంలో విఫలమైంది. ఈ అంశం గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా ఎమ్మెల్యే గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడమే తరువాయి.. వారంరోజుల్లో టెండర్లకు ఆహ్వానిస్తామని అధికారులు అంటున్నారు. వ్యాపారులు ఆ సిగ్నల్‌ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా పట్టణంలోని సత్యనారాయణ చౌరస్తా నుంచి మార్కండేయ దేవాలయం వరకు రోడ్డు విస్తరణ పనులు జోరందుకున్నాయి. రోడ్డుకు ఇరువైపుల ఉన్న దుకాణాలు తొలగించారు. వ్యాపారస్తులకు సిద్ధంగా ఉన్న దుకాణాలు కావాలంటే నూతనంగా నిర్మించిన ఈ దుకణాలే దిక్కు. వాటిని ఎప్పుడు వేలం వేస్తారోనని ఏడాదిన్నరగా వేచి ఉన్నారు.  
 
రూ.30 లక్షల ఆదాయం పోయినట్టే.. 
మార్కెట్‌ విలువను బట్టి రైతుబజార్‌లోని 16 దుకాణాల సముదాయంలో ఒక్కొక్కదానికి రూ.2,200, వాణిజ్య సముదాయ దుకాణాలకు ఒక్కొక్క దానికి రూ.5,200 సర్కార్‌పాటను వేలానికి సిద్ధం చేశారు. కానీ రూ.5,200 అద్దె ఎక్కువ అవుతుందని వాటిని రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు తగ్గించాలని ఇంతవరకు దుకాణాలకు వేలం నిర్వహించలేదు. నిబంధనల ప్రకారం వేలం వేసిన తర్వాత ఆ దుకణాలకు టెండర్లు ఎవరూ వేయకపోతే మళ్లీ రెండోసారి పిలవడం అప్పుడు రానట్లయితే మూడోసారి టెండర్లను రీకాల్‌చేస్తూ అద్దెలో మార్పులు చేర్పులు తీసుకునే అవకాశం ఉంటుంది. దుకాణాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో టెండర్లను ఇదివరకే పిలిచి ఉంటే ఇప్పటివరకు మార్కెట్‌కు రూ.30 లక్షల ఆదాయం వచ్చేది. ఇకనైనా పాలకులు, అధికారులు పట్టించుకుని వేలం వేసి దుకాణాలను వినియోగంలోకి తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభించాలని వ్యాపారులు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు