కొలువుకు... రవాణా భారం! 

28 Jun, 2020 06:12 IST|Sakshi

లాక్‌డౌన్‌ ప్రభావంతో మార్చి 15 నుంచి స్తంభించిన ప్రజా రవాణా

సడలింపులిచ్చినా బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్లు తిప్పలేని స్థితి

దీంతో ఉద్యోగాలు చేస్తున్న వారికి సొంత వాహనాలే ఆధారం

దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారికి వదులుతున్న చేతిచమురు

చిరు ఉద్యోగుల నెలవారీ వేతనంలో 30% రవాణా ఖర్చుకే.. 

రమేశ్‌ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. నెలకు 14 వేల వేతనం. తాను నివసించే చోటు నుంచి ఆఫీసుకు దూరం 35 కిలోమీటర్లు. సాధారణ రోజుల్లో బస్‌ పాస్‌ కోసం నెలకు రూ.వెయ్యి ఖర్చు చేసేవాడు. కోవిడ్‌–19 ప్రభావంతో ప్రస్తుతం సిటీలో ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. దీంతో ప్రైవేటు వాహనాల్లో లేదా సొంత బైక్‌పై కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. ఎలా వెళ్లినా రోజుకు కనీసం రూ.120 ఖర్చవుతోంది. కార్యాలయానికి వెళ్లాలంటే నెలకు సగటున మూడున్నర వేలు ఖర్చు. ఈ లెక్కన తన వేతనంలో పావువంతు రవాణా చార్జీలకే ఖర్చు చేస్తున్నాడు. 

సాక్షి, హైదరాబాద్‌: సగటు ఉద్యోగి సంకటస్థితిలో పడ్డాడు. ‘కార్యాలయానికి ఎలా వెళ్లాలి... తిరిగి వచ్చేదెలా..?’ అనే ప్రశ్నతో ప్రతిరోజూ సతమతమవుతున్నాడు. కోవిడ్‌–19 కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో ప్రజారవాణా వ్యవస్థ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే స్థితి లేదు. హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రోరైల్, ఎంఎంటీఎస్‌ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఎక్కడికి వెళ్లాలన్నా ప్రైవేటు వాహనాలు లేదా సొంత వాహనంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. సాధారణ ప్రయాణాల సంగతి అటుంచితే ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ప్రతి ఉద్యోగికి ఖర్చు డబుల్‌
మన హైదరాబాద్‌ నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తు ఉద్యోగులు, కార్మికులు దాదాపు 40 లక్షల మంది ఉంటారు. ఇందులో సంఘటిత రంగంలో పనిచేసే వారితో పాటు అసంఘటిత రంగ కార్మికులు సైతం ఉన్నారు. వీరంతా విధులకు హాజరు కావాలంటే ఎంతో కొంత దూరం ప్రయాణం చేయాల్సిందే. సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుపై ఆధారపడేవారు నెలకు సగటున ఒక ఉద్యోగి రూ.800 నుంచి 1,200 వరకు ఖర్చు చేసేవారు. ఈ మొత్తంతో గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు సిటీ రీజియన్‌ మొత్తం ఎన్నిసార్లు చక్కర్లు కొట్టినా అదనపు వ్యయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రజారవాణా పూర్తిగా స్తంభించడంతో ప్రతి ఉద్యోగి ప్రైవేటు వాహనాలైన ఆటోలు, ట్యాక్సీల్లో వెళ్లాల్సి వస్తోంది. లేకుంటే సొంత వాహనాన్ని సర్దుకోవాల్సిందే.

సాధారణ రోజుల కంటే ప్రస్తుతం ప్రైవేటు వాహనదారులు రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు రూ.20 తీసుకునే ఆటో డ్రైవర్‌... ప్రస్తుతం 40 వసూలు చేస్తున్నాడు. సాయంత్రం 6 గంటలు దాటితే రేటు మరింత పెరిగి రూ.50కి చేరుతోంది. హైదరాబాద్‌లో ఆటో కనీస చార్జీ రూ.20గా ఉండడం గమనార్హం. మరోవైపు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఆర్టీసీ బస్సులు కొంత వరకు నడుస్తున్నా... గతంలో మాదిరిగా సమయానుకూలంగా నడవకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు కరోనా వైరస్‌ సోకుతుందనే భయంతో కూడా ఇరుకిరుకు ప్రయాణాలకు జనాలు ఆసక్తి చూపడం లేదు.

సొంత వాహనంతోనూ కష్టాలే
ప్రైవేటు వాహనాలకు బదులు సొంత వాహనాలను వినియోగించే వారికి సైతం ఖర్చు పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగడంతో ఖర్చు అమాంతం 20 శాతం పెరిగింది. ఇంధన ఖర్చులే కాకుండా నిర్వహణ వ్యయం సైతం పెరుగుతున్నాయి. నిత్యం ఆఫీసుకు తీసుకురావడంతో ఎక్కువ కిలోమీటర్లను తక్కువ రోజుల్లో తిరగడంతో వాహనాలు సర్వీసింగ్‌కు తొందరగా వస్తున్నాయి. ఈక్రమంలో ఒకే ఆఫీసులో పనిచేసే నలుగురు ఉద్యోగులు కారులో వెళ్లి ఖర్చును షేర్‌ చేసుకుంటున్నారు. మరికొందరు బైక్‌ వినియోగించి ఇద్దరు వెళ్లేలా ప్లాన్‌ చేసుకుని సర్దుకుంటున్నారు. ఈ షేరింగ్‌ విధానంతో కేవలం ఆఫీస్, ఇళ్లు మాత్రమే వెళ్లే వెసులుబాటు ఉంటుంది. ఇతర చోట పనులుంటే మళ్లీ ప్రైవేటు వాహనాల్ని నమ్ముకుని చేతిచమురు వదిలించుకోవాల్సిందే. కొందరు తక్కువ ఖర్చుతో నెట్టుకురావచ్చని భావించి బైక్‌లను వినియోగిస్తున్నా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావడంతో వెన్నునొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు