ట్రావెల్స్‌ బస్సు నిలిపివేత

24 Mar, 2020 02:48 IST|Sakshi
నిలిపివేసిన ట్రావెల్స్‌ బస్సు (ఇన్‌సెట్‌లో) ప్రయాణికుడి చేతిపై క్వారంటైన్‌ ముద్ర

జహీరాబాద్‌లో నిలిపివేసిన పోలీసులు

32 మంది దుబాయ్‌ నుంచి వచ్చినట్లు గుర్తింపు

జహీరాబాద్‌/ మనూరు (నారాయణఖేడ్‌): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం మాడ్గి చెక్‌పోస్టు వద్ద ముంబై నుంచి వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును సోమవారం పోలీసులు నిలిపివేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను పోలీసులు అనుమతించడంలేదు. ఈ బస్సులో దుబాయ్‌ నుంచి వచ్చిన నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వాసులు 32 మంది ఉన్నారు. ముంబైలో దిగి రాష్ట్రానికి వస్తున్న వీరి వాహనాన్ని నిలిపివేసి అదే బస్సులో తిప్పి పంపించారు.

నిజామాబాద్, కరీంనగర్‌ వెళ్లాల్సి ఉంటే వెనుకకు తిరిగి బీదర్‌ మీదుగా వెళ్లాలని సూచించడంతో అక్కడి నుంచి తెలంగాణ, కర్ణాటక సరిహద్దులోని నాగల్‌గిద్ద మండలం కరస్‌గుత్తి చెక్‌పోస్టువద్ద నుంచి వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా వారిని గుర్తించిన పోలీసు సిబ్బంది బస్‌ను నిలిపివేశారు. ఎయిర్‌పోర్ట్‌లో వారి చేతులపై వేసిన ముద్రలను గుర్తించారు. స్థానిక ఎస్‌ఐ శేఖర్, నారాయణఖేడ్‌ సీఐ రవీందర్‌రెడ్డి, స్థానిక తహసీల్దార్‌ విజయ్‌కుమార్, ఎంపీడీఓ బాలయ్య, వైద్యాధికారులు హుటాహుటిన చెక్‌పోస్టువద్దకు చేరుకొని వారి వివరాలు తెలుసుకున్నారు.  

దుబాయ్‌ నుంచి ప్రత్యేక విమానంలో.. 
వీరందరూ ఈ నెల 21న దుబాయ్‌ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి వచ్చారు. వారికి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి ట్రావెల్స్‌ బస్సులో ప్రభుత్వ అనుమతితో నిజామాబాద్, జగిత్యాల ప్రాంతాలకు పంపించే ఏర్పాటు చేశారు. వీరు ముంబై నుంచి కర్ణాటక మీదుగా తెలంగాణకు చేరుకోవాల్సి ఉంది. వారి చిరునామాలు, ఫోన్‌ నంబర్లు సేకరించి పోలీస్‌ ఎస్కార్టు ద్వారా నారాయణఖేడ్‌ మీదుగా నిజామాబాద్‌ పంపించారు. వారంతా స్వస్థలాలకు చేరుకునే వరకు దారివెంట స్థానిక పోలీసు ఎస్కార్టు ఉంటుందని నారాయణఖేడ్‌ సీఐ తెలిపారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే వారి కి వ్యాధి లక్షణాలు ఏమీ లేనందునే ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి, చేతులపై ముద్రలు వేసి పంపించినట్లు తెలిసింది. కాగా వారి చేతులపై వచ్చే నెల 4వ తేదీ వరకు బయట సంచరించకుండా ఎయిర్‌పోర్టులో క్వారంటైన్‌ ముద్ర వేసినట్లు గుర్తించారు.

మరిన్ని వార్తలు