తొమ్మిదింటికే ‘ప్రైవేట్‌ హారన్‌’!

10 Jul, 2018 11:24 IST|Sakshi

వేళ కాకముందే రోడ్డెక్కుతున్న ప్రైవేట్‌ బస్సులు

ప్రధాన రహదారులపై భారీ రద్దీ

ట్రాఫిక్‌ జామ్‌లతో జనం గగ్గోలు

సిటీని ప్రైవేట్‌ బస్సులు, రవాణా వాహనాలు ముంచెత్తుతున్నాయి. రాత్రి తొమ్మిది గంటలు కూడా దాటకముందే రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి 8 గంటల నుంచి 11 వరకు నగరం పూర్తిగా ప్రైవేటు రవాణా వాహనాల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు నిత్యం ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ఈ వాహనాల వల్ల గంటల కొద్దీ ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. వాహనదారులు నరకం చవిచూడాల్సి వస్తోంది. రాత్రి వేళల్లో  ప్రైవేట్‌ బస్సులు, రవాణా వాహనాల రాకపోకలను నగర శివార్లకే పరిమితం చేసి అక్కడి నుంచి ఔటర్‌ రింగురోడ్డు  ద్వారా దూరప్రాంతాలకు నడపాలనే  ప్రతిపాదన ఉన్నప్పటికీ అది ఏళ్లుగా కాగితాలకే  పరిమితమైంది.  

సాక్షి, సిటీబ్యూరో: నగర రహదారులపై ప్రైవేట్‌ బస్సులు, సరుకు రవాణా వాహనాలు  హడలెత్తిస్తున్నాయి. ఎక్కడికక్కడ నిబంధనలకు పాతరేసి సిటీ రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. రాత్రి 9 దాటకుండానే రోడ్ల మీదకు వస్తున్న బస్సులు, లారీలు రవాణా చట్టాలను, రహదారి భద్రతను యధేచ్ఛగా తుంగలో  తొక్కేస్తూ  స్వైరవిహారం చేస్తున్నాయి. రాత్రి 8గంటల నుంచి  11  వరకు  నగరం పూర్తిగా ప్రైవేటు రవాణా వాహనాలు  కబంధహస్తాల్లో చిక్కుకొంటుంది. మియాపూర్‌ నుంచి  ఎల్‌బీనగర్‌ వరకు  వాహనాల రాకపోకలతో   నిత్యం రద్దీగా  ఉండే అతి పెద్ద కారిడార్‌లో   ప్రైవేట్‌ బస్సులు  ట్రాఫిక్‌ రద్దీకి  మరింత ఆజ్యం పోస్తున్నాయి. రాత్రి  వేళల్లో  ఈ వాహనాల రాకపోకలను నగర శివార్లకే పరిమితమం చేసి అక్కడి నుంచి ఔటర్‌ రింగురోడ్డు  ద్వారా దూరప్రాంతాలకు నడపాలనే  ప్రతిపాదన ఉన్నప్పటికీ అది ఏళ్లకు ఏళ్లుగా కాగితాలకే  పరిమితమైంది. మియాపూర్, పెద్ద అంబర్‌పేట్‌ల వద్ద  బస్సులు, ట్రక్కులు,  లారీలు, తదితర రవాణా వాహనాల కోసం  టర్మినల్స్‌  ఏర్పాటు చేసి అక్క డి నుంచే నడాపాలని ఇటీవల రవాణాశాఖ సమీ క్షా సమావేశంలనూ  ఆ శాఖ మంత్రి  స్పష్టం చేశా రు. ఇందుకోసం ట్రాక్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ కు గతంలో  కేటాయించిన భూములను వినియోగించాలని  పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు  ఆ దిశగా  ఎలాంటి చర్యలు లేవు.  దీంతో  రాత్రి వేళ ల్లో, తెల్లవారు జామున రహదారులన్నీ ప్రైవేట్‌ బస్సులు, లారీలకు అడ్డాగా మారుతున్నాయి. 

చీమ కూడా కదలడం కష్టమే....
కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ రోడ్లు సాయంత్రం 5 గంటల నుంచే రద్దీగా ఉంటాయి. ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్ధులు, వ్యాపారులు, వివిధ రకాల పనుల కోసం రాకపోకలు సాగించే వాళ్లతో  æరోడ్లు జనసముద్రాన్ని తలపిస్తాయి.  ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆర్టీసీ బస్సులతో ప్రధాన రహదారులు నిండిపోతాయి. అలాంటి రోడ్లపై  ఒక్కసారిగా అలజడి మొదలవుతుంది.  కాలనీల నుంచి ఒకటెనుక ఒకటిగా ప్రైవేట్‌ బస్సులు బయలుదేరుతాయి. క్రమంగా  ట్రాఫిక్‌ స్తంభించిపోతుంది.  ఒకటి, రెండు కిలోమీటర్‌ల పొడవునా  ప్రైవేట్‌ బస్సులే కనిపిస్తాయి. దీంతో  అప్పటి వరకు సాఫీగా  సాగిపోయిన వాహనాలకు  ఎక్కడికక్కడ  బ్రేకులు పడుతాయి. దీంతో లక్షలాది మంది  రోడ్లపైనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఒక్క కూకట్‌పల్లి ప్రజలే కాదు. అటు మియాపూర్‌ నుంచి కూకట్‌పల్లి, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట్, పంజగుట్ట, ఖైరతాబాద్, లకిడాకాఫూల్, హిమాయత్‌నగర్, కాచిగూడ, ఆబిడ్స్, కోఠీ, చాదర్‌ఘాట్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్‌ వరకు అడుగడుగునా  ట్రాఫిక్‌ నిలిచిపోతుంది. ప్రధానమైన  బస్టాపులు, బస్‌బేలలో ప్రయివేట్‌ బస్సులను నిలిపివేస్తున్నారు.లకిడికాఫూల్‌లోని టెలిఫోన్‌ భవన్, కాచిగూడ, అమీర్‌పేట్‌ బస్టాపులు రాత్రి వేళల్లో  ప్రైవేట్‌  బస్సుల అడ్డాలుగా మారుతున్నాయి. ఈ బస్సులను  నియంత్రించడంలో పోలీసులు,ఆర్టీఏ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు.

నిబంధనలు బేఖాతర్‌...
మోటారు వాహన  నిబంధనల ప్రకారం  రాత్రి 10 గంటల నుంచి  ఉదయం 8 గంటల వరకు మాత్రమే ఈ వాహనాలు సిటీలోకి ప్రవేశించాలి. కానీ ఎక్కడా ఇది అమలుకు నోచుకోదు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను దాటి మరీ దూసుకొస్తాయి. దీంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.ఖైరతాబాద్‌ వంటి అతి పెద్ద కూడళ్లలో  రెడ్‌సిగ్నల్‌  వెలుగుతున్నప్పటికీ  దూసుకొనిపోయే  ప్రైవేట్‌ బస్సులు  ప్రతి రోజు కనిపిస్తాయి. ఒకవైపు లకిడికాఫూల్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు రాజ్‌భవన్‌ వైపు వెళ్తూనే ఉంటాయి. కానీ అదేమీ పంజగుట్ట నుంచి  లకిడికాఫూల్‌ వైపు వెళ్లే   బస్సులు మాత్రం రెడ్‌ సిగ్నల్‌ను లెక్కచేయకుండా పరుగులు తీస్తూనే ఉంటాయి. రాత్రయిందంటే చాలు అపరిమితమైన వేగంతో ఏ వైపు నుంచి దూసుకొస్తాయో తెలియదు.  హైదరాబాద్‌ నుంచి ప్రతి రోజు రాత్రి  సుమారు 550 బస్సులు వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్తాయి. అలాగే మరో 500 బస్సులు ఉదయం పూట నగరానికి చేరుకుంటాయి. శని,ఆది వారాలు వంటి వీకెండ్స్‌లో వీటి  రాకపోకలు మరింత అధికంగా ఉంటాయి.  నగరంలోకి వచ్చే వాహనాలు కానీ తిరిగి వెళ్లేవి కానీ  ఎక్కడా సమయపాలన పాటించడం లేదు. ప్రైవేట్‌ బస్సులకు తోడు  హైదరాబాద్‌ మీదుగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు మరో  50 వేల లారీలు కూడా  ఇదే తరహా ఉల్లంఘనలతో  ట్రాఫిక్‌  టెర్రర్‌ను సృష్టిస్తున్నాయి. 

పర్మిట్ల ఉల్లంఘన ...  
ప్రయాణికులను ఎక్కించుకోవలసిన అనేక బస్సులు  సరుకు రవాణా అవతారమెత్తాయి.  కేవలం  ప్రయాణికుల  రవాణా కోసమే ఇచ్చిన  పర్మిట్లను  ఉల్లంఘించి  హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు   వాణిజ్య,వ్యాపార వస్తువులను రవాణా చేస్తున్నాయి. అక్రమంగా తిరుగుతున్న   ఇలాంటి  బస్సులు  వల్ల  రహదారి భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. ఒక్కొక్క బస్సుపైన 4 నుంచి 5 టన్నుల సరుకు రవాణా జరుగుతోంది. ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు, బహదూర్‌పురా, లకిడికాఫూల్, తదితర  ప్రాంతాల్లో  రవాణా అధికారులు నిర్వహించే తనిఖీల్లో ఇలాంటి ఓవర్‌లోడ్‌పై  కేసులు నమోదువుతూనే ఉన్నాయి.  హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరు,నెల్లూరు,కడప,అనంతపురం,తదితర ప్రాంతాలకు ఇనుప షీట్‌లు, బట్టలు, వివిధ రకాల ఇనుప వస్తువులు, ఎలక్ట్రికల్‌ విడిభాగాలను  వ్యాపారులు భారీ ఎత్తున తరలిస్తున్నారు. లారీల్లో మాత్రమే తీసుకెళ్లాల్సిన అనేక వస్తువులు టూరిస్టు బస్సుల్లో రవాణా అవుతున్నాయి.ఒక్క ప్రైవేట్‌ బస్సులకే కాకుండా అన్ని రకాల రవాణా వాహనాలకు నగర శివార్లలోనే హాల్టింగ్‌ కల్పించి అక్కడికి ప్రయాణికులను తరలించేందుకు సిటీ  బస్సులను నడిపితే తప్ప పరిష్కారం లభించదు.

మరిన్ని వార్తలు