ఏసీ..దోచేసి!

6 May, 2018 09:26 IST|Sakshi
లక్డీకాపూల్‌ వద్ద శనివారం రాత్రి ట్రావెల్స్‌ బస్సుల కోసం వేచిచూస్తున్న ప్రయాణికులు

టికెట్‌ చార్జీలు డబుల్‌ చేసిన ట్రావెల్స్‌

వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్‌ను క్యాష్‌ చేసుకుంటున్న వైనం  

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నిల్‌.. సరిపోని స్పెషల్‌ ట్రైన్స్‌  

నియంత్రణ చర్యలు శూన్యం

నగరంలోని బోరబండకు చెందిన చంద్రశేఖర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి అన్నవరంలోని బంధువుల పెళ్లికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన ఏసీ బస్సులో వెళ్లాలని భావించి టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్‌ చేయాలనుకున్నాడు. గతంలో సిటీ నుంచి అన్నవరం వరకు ఏసీ టికెట్‌ ధర రూ.975 ఉంటే ఇప్పుడు రూ.2000కు చేరింది. అంటే నలుగురు సభ్యులు కలిసి అన్నవరం వెళ్లి రావాలంటే బస్సు చార్జీలకు ఏకంగా రూ.16,000 చెల్లించాలి. ఇది చంద్రశేఖర్‌ సమస్య మాత్రమే కాదు.. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు సీట్లు లభించక, రైళ్లలో బెర్తులు దొరక్క ప్రైవేట్‌ బస్సులను ఆశ్రయిస్తున్న ప్రతిప్రయాణికుడి వ్యధ. ఇలాంటి వారంతా ట్రావెల్స్‌ ఆపరేటర్ల దోపిడీకి గురవుతున్నారు. పైగా ఒక్కో ఏజెన్సీ ఒక్కోలా చార్జీ వసూలు చేస్తూ దోచుకుంటున్నాయి. 

సాక్షి, సిటీబ్యూరో: సగటు ప్రయాణికుడిని ప్రైవేట్‌ బస్సులు కూల్‌గా దోచేస్తున్నాయి. వేసవి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ధరలను అమాంతం పెంచేసి జేబులు లూఠీ చేస్తున్నాయి. సాధారణ చార్జీలను రెట్టింపు చేసి మరీ దోపిడీకి పాల్పడుతున్నాయి. ఒకవైపు వేసవి సెలవులు, మరోవైపు పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో నగరం నుంచి ఇతర రాష్ట్రాలు, నగరాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎలాంటి అదనపు బస్సులను ఏర్పాట్లు చేయలేదు. దక్షిణమధ్య రైల్వే 150కి పైగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి ప్రయాణికుల డిమాండ్‌ను భర్తీ చేయలేకపోతున్నాయి. దీంతో గత్యంతరం లేక ప్రైవేట్‌ బస్సులను ఆశ్రయిస్తున్న నగర ప్రయాణికులను ట్రావెల్స్‌ సంస్థలు దోచుకుంటున్నాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లేందుకు ఏసీ స్లీపర్‌ క్లాస్‌ బస్సు చార్జీ గతంలో రూ.650 ఉంటే ప్రస్తుతం రూ.1574కు పెరిగింది. వైజాగ్‌కు ఏసీ బస్సు చార్జీ గతంలో రూ.950 ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.1984కి పెంచారు. ప్రత్యామ్నాయ రవాణా సదుపాయం లేక, గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో చార్జీల రూపేణా రూ.వేలల్లో సమర్పించుకోవలసి వస్తోందంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సగటు ప్రయాణికుడే బాధితుడు..  
హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, చిత్తూరు, కర్నూలు, కడప, తిరుపతి, బెంగళూరు తదితర ప్రాంతాలకు ప్రతిరోజు 650 నుంచి 700 ప్రైవేట్‌ బస్సులు నడుస్తుంటాయి. నగరంలోని బీహెచ్‌ఈఎల్, మియాపూర్, కూకట్‌పల్లి, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట్, లకిడీకాపూల్, కాచిగూడ తదితర సెంటర్ల నుంచి ప్రయాణికుల పాయిట్లు ఉన్నాయి. రాష్ట్రస్థాయి కాంట్రాక్ట్‌ క్యారేజీలుగా గుర్తింపు పొందిన ట్రావెల్స్‌ బస్సులన్నీ స్టేజీ క్యారేజీలుగా తిరుగుతూ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నాయి.

దోపిడీని నియంత్రించేదెవరు..?  
ప్రైవేట్‌ బస్సు చార్జీలపైన ఎలాంటి అధికారిక నియంత్రణ లేదు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మోటారు వాహన నిబంధనల ఉల్లంఘన నెపంతో అప్పుడప్పుడూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేసే రవాణాశాఖ.. చార్జీల నియంత్రణ తమ పరిధి కాదని చేతులెత్తేస్తుంది. పర్మిట్లు లేకుండా తిరిగే బస్సులపైన, అదనపు సీట్లు ఏర్పాటు చేసే బస్సులపైనా కేసులు నమోదు చేస్తారు. సరుకు రవాణాకు పాల్పడినా తరచుగా కేసులు పెట్టి జరిమానాలు విధిస్తుంటారు. కానీ ఇలా వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్‌ వంటి ప్రత్యేక సందర్భాల్లో సాధారణ చార్జీలను రెండు రెట్లు పెంచినా రవాణా అధికారులు పట్టించుకోవడం లేదు. మరోవైపు ప్రైవేట్‌ బస్సుల చార్జీలను నియంత్రించే ఏ వ్యవస్థా ప్రభుత్వంలో లేకపోవడం గమనార్హం. ప్రైవేట్‌ బస్సుల చార్జీలతో పోలిస్తే కొన్ని సందర్భాల్లో విమాన చార్జీలే నయమనుకొనే పరిస్థితి నెలకొంది. వేసవి సెలవుల్లో టూర్లకు వెళ్లేవారు, తిరుపతి, షిరిడీ, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు కనీసం నెల రోజులు ముందుగా ఫ్లైట్‌ బుక్‌ చేసుకుంటే ప్రైవేట్‌ బస్సులకు వెచ్చించే రెట్టింపు చార్జీల ధరల్లోనే హాయిగా విమానయానం చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు