‘ప్రైవేట్‌’ బాదుడు..

7 Oct, 2019 04:27 IST|Sakshi

ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులకు పట్టపగలే చుక్కలు

రెట్టింపు చార్జీలు వసూలు చేసిన ప్రైవేట్‌ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు 

గ్రేటర్‌ పరిధిలో రోడెక్కిన 1200 బస్సులు

సాక్షి, హైదరాబాద్‌:దసరాకు పల్లెబాట పట్టిన ప్రయాణికులకు ప్రైవేట్‌ బస్సుల దోపిడీ పట్టపగలే చుక్కలు చూపింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు, ఆర్టీసీ అద్దె బస్సుల్లో టికెట్‌ ధరపై రెట్టింపు చార్జీలు వసూలు చేసి ప్రయాణికులపై గుదిబండ మోపారు. ఎంజీబీఎస్, జేబీఎస్‌ బస్‌స్టేషన్ల నుంచి పొరుగు రాష్ట్రాలు, తెలంగాణలోని పలు ప్రాంతాలకు 2000 బస్సులు రాకపోకలు సాగించినట్లు అధికారులు తెలిపారు. వీటిల్లోనూ టికెట్‌ ధరపై 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేశారు. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 29 ఆర్టీసీ డిపోల్లో 3,800 బస్సులకుగాను ఆదివారం 1,200 బస్సులే రోడ్డెక్కాయి.

ఈ బస్సుల్లోనూ తాత్కాలిక కండక్టర్లు చేతివాటం ప్రదర్శించారు. శని, ఆదివారాలు కలిపి గ్రేటర్‌ ఆర్టీసీకి రూ.6 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. పలు ఆర్టీసీ డిపోల వద్ద రెగ్యులర్‌ కార్మికులు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. తాత్కాలిక ఉద్యోగులను అడ్డుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని అతికష్టం మీద కొన్ని బస్సుల రాకపోకలకు మార్గం సుగమం చేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆటోలు, క్యాబ్‌లు అందినకాడికి దండుకున్నారు.

సుమారు 127 ఎంఎంటీఎస్‌ సర్వీసుల్లో 1.75 లక్షల మంది వరకు రాకపోకలు సాగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇక ఎల్బీనగర్‌–మియాపూర్, నాగోల్‌–హైటెక్‌ సిటీ రూట్లలో రద్దీని బట్టి ప్రతి మూడు, ఐదు నిమిషాలకో మెట్రో రైలును నడిపారు. ఆదివారం సుమారు 4 లక్షల మంది మెట్రో జర్నీ చేశారని అధికారులు అన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడా రైల్వే స్టేషన్ల నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లు సైతం ప్రయాణికుల రద్దీతో కిక్కిరిశాయి.

మరిన్ని వార్తలు