చర్లపల్లి జైలుకు ఉన్మాదులు

1 Dec, 2019 03:46 IST|Sakshi
ప్రియాంకరెడ్డిని హత్య చేసిన హంతకులు

ప్రియాంకారెడ్డి హత్య కేసు నిందితులను రిమాండ్‌ తరలింపు

షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే నిందితులకు వైద్య పరీక్షలు 

తహసీల్దార్‌ ఎదుట నిందితులను హాజరుపరచిన పోలీసులు 

14 రోజులు రిమాండ్‌

షాద్‌నగర్‌టౌన్, షాద్‌నగర్‌ రూరల్‌: ప్రియాంకారెడ్డి హత్యోదంతంలో పాల్గొన్న దుండగులు ఆరీఫ్, శివ, నవీన్, చెన్నకేశవులును పోలీసులు శనివారం తెల్లవారు జామున 4గంటల సయమంలో శంషాబాద్‌ నుంచి ప్రత్యేక వాహనంలో షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించా రు. పోలీసులు స్టేషన్‌లోనే నిందితులకు వైద్య పరీక్షలు చేయించి తహసీల్దార్‌ ఎదుట హాజరు పర్చి ఆ తర్వాత చర్లపల్లి జైలుకు తరలించారు.  
పోలీస్‌ స్టేషన్‌లోనే నిందితులకు వైద్య పరీక్షలు  
ప్రియాంకరెడ్డిని హత్య చేసిన దుండగులు ఆరీఫ్, శివ, నవీన్, చెన్నకేశవులును మెజిస్ట్రేషన్‌ ఎదుట హాజరు పరిచే ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు. షాద్‌నగర్‌ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో నిందితులకు వైద్య పరీక్షలు చేయించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, నిందితులు పోలీస్‌స్టేషన్‌లో ఉండటం.. బయట ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ముగ్గురు డాక్టర్లు పోలీస్‌ స్టేషన్‌కే వచ్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ సురేందర్, డాక్టర్‌ కిరణ్‌లు నిందితులకు సుమారు రెండు గంటల పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు.  

జడ్జి అందుబాటులో లేకపోవడంతో.. 
పట్టుబడిన నిందితులను షాద్‌నగర్‌ కోర్టులో శనివారం ఉదయం హాజరుపరచాల్సి ఉంది. అయితే, మహబూబ్‌నగర్‌ జిల్లా కోర్టులో సమావేశం నిమిత్తం షాద్‌నగర్‌ కోర్టు జడ్జిలు అక్కడికి వెళ్లారు. దీంతో ఫరూఖ్‌నగర్‌ తహసీల్దార్‌ పాండునాయక్, ఆర్‌ఐ ప్రవీణ్‌ పోలీసు వాహనంలో స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్‌లో తహసీల్దార్‌ పాండునాయక్‌ ఎదుట పోలీసులు నిందితులను హాజరుపరిచారు. వారికి తహసీల్దార్‌ 14రోజుల రిమాండ్‌ విధించారు. 

చర్లపల్లి జైల్‌ వద్ద పోలీసులతో వాగ్వివాదం చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలు 

చర్లపల్లి జైలు వద్ద ఉద్రిక్తత... 
కుషాయిగూడ: వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకారెడ్డి హత్య కేసులో అరెస్టైన నిందితులను శనివారం కట్టుదిట్టమైన భద్రత నడుమ షాద్‌నగర్‌ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. విద్యార్థి సంఘాల నాయకులు పెద్దెత్తున్న జైలు వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. నిందితులను ఉరి తీయాలంటూ నినాదాలు చేస్తూ జైలు వైపు దూసుకొచ్చారు. జైలు మెయిన్‌ గేట్‌కు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. జైలు వద్ద భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

నిందితులను తరలిస్తున్న వాహనాలు జైలు వద్దకు చేరుకునే సమయంలో చక్రిపురం నుంచి, చర్లపల్లి నుంచి జైలు వైపుగా వచ్చే వాహనాలను నిలిపేశారు. నిందితులను తరలిస్తున్న వాహనం సాయంత్రం 6:05 నిమిషాలకు జైలులోకి ప్రవేశించింది. ఈ క్రమంలో జైలు వైపు వచ్చిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు రోప్‌తో అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో వారందరిని పోలీసులు అరెస్టు చేసి కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితులను చర్లపల్లి జైలులోని హై సెక్యూరిటీ బ్యారక్‌లో వేర్వేరు సెల్‌లలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు:
ముందే దొరికినా వదిలేశారు!

28 నిమిషాల్లోనే చంపేశారు!

మరిన్ని వార్తలు