ముందే దొరికినా వదిలేశారు!

1 Dec, 2019 02:55 IST|Sakshi
ప్రియాంకను హత్య చేసిన ఉన్మాదులను ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ శనివారం షాద్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ను ముట్టడించిన ప్రజలు

ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు

ఘటనకు ఒకరోజు ముందు ఓవర్‌ లోడ్‌తో పట్టుబడిన లారీ 

సీజ్‌ చేయకుండా వదిలేసిన మహబూబ్‌నగర్‌ ఆర్టీఓ 

తొండుపల్లి వద్ద లారీ అక్రమ పార్కింగ్‌ 

వెళ్లిపోవాలంటూ హెచ్చరించి వదిలేసిన పోలీసులు 

అనంతరం ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డులో లారీ పార్కింగ్‌ 

స్కూటీ పార్కింగ్‌ చేస్తుండగా ప్రియాంకపై నిందితుల కన్ను 

పథకం ప్రకారం కిడ్నాప్, అత్యాచారం, హత్య 

రిమాండ్‌ రిపోర్టులో కోర్టుకు తెలిపిన పోలీసులు

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదు.. పైగా ఓవర్‌ లోడ్‌.. అలాంటి లారీ కనిపిస్తే ఆర్టీఓ ఏం చేయాలి? స్వాధీనం చేసుకోవాలి. కానీ మహబూబ్‌నగర్‌ ఆర్టీఓ ఆ పని చేయలేదు. ముందు హైవేపై అక్రమ పార్కింగ్‌.. తర్వాత సర్వీస్‌ రోడ్డులో గంటల తరబడి లారీ... అప్పుడు పెట్రోలింగ్‌ పోలీసులు ఏం చేయాలి? లారీని తీసేలా చర్యలు తీసుకోవాలి. కానీ వారు ఆ పని చేయలేదు. ఈ రెండు ఘటనల్లో ఎవరి పని వారు సక్రమంగా నిర్వర్తించి ఉంటే.. ప్రియాంక ప్రాణాలతోనే ఉండేది. అక్కడ ఆర్టీఓ, ఇక్కడ పోలీసులు తమ విధులు కచ్చితంగా పాటించి ఉంటే ఓ అమాయక అతివ..ఉన్మాదుల పశువాంఛకు బలయ్యేది కాదు.

సాక్షి, హైదరాబాద్‌/రంగారెడ్డిజిల్లా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకారెడ్డి హత్యాచారం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వేర్వేరు అంశాల్లో నిబంధనలు ఉల్లంఘించిన నిందితులను రెండుసార్లు వదిలేయడమే ప్రియాంక పాలిట శాపమైంది. ఆమెపై హత్యాచారం జరగడానికి ఒకరోజు ముందు నిందితులు వస్తున్న లారీని మహబూబ్‌నగర్‌ ఆర్టీఓ పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడం, పైగా ఓవర్‌ లోడ్‌ ఉండటంతో నిబంధనల ప్రకారం దానిని సీజ్‌ చేయాల్సి ఉండగా.. ఆర్టీఓ ఆ పని చేయకుండా వదిలేసి వెళ్లిపోయారు. అనంతరం తొండుపల్లి చేరుకున్న నిందితులు లారీని హైవేపై అక్రమంగా పార్క్‌ చేశారు.

ఘటన జరగడానికి 12 గంటల ముందు అటుగా వచ్చిన హైవే పెట్రోలింగ్‌ పోలీసులు.. లారీని అక్కడి నుంచి తీసేయాలని హెచ్చరించి వెళ్లిపోయారు. దీంతో నిందితులు తొండుపల్లి టోల్‌ప్లాజా గేట్‌ దగ్గరున్న సర్వీస్‌ రోడ్డులో లారీని నిలిపి అలాగే ఉంచారు. అక్కడే చాలాసేపు లారీ ఉండటం.. ఆపై అక్కడకు వచ్చిన ప్రియాంకను నిందితులు చూడటంతో వారి మదిలో దుర్బుద్ధి పుట్టి పథకం ప్రకారం ఘాతుకానికి తెగబడ్డారు. ఒకవేళ ఆర్టీఓ ఆ లారీని సీజ్‌ చేసినా.. సర్వీస్‌ రోడ్డులో కూడా అంతసేపు లారీని నిలపకుండా పోలీసులు చర్యలు తీసుకున్నా.. ఈ దురాగతం జరిగి ఉండేది కాదని రిమాండ్‌ రిపోర్ట్‌ చూస్తే అర్థమవుతుంది. ప్రియాంకారెడ్డి హత్యాచారం కేసుకు సంబంధించిన రిమాండ్‌ రిపోర్ట్‌ను పోలీసులు శనివారం షాద్‌నగర్‌ మొదటి శ్రేణి జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు సమర్పించారు. అందులోని ముఖ్యాంశాలివీ.. 

ఆర్టీఓకి చిక్కి ... 
నిందితులు మహ్మద్‌ ఆరిఫ్, జొల్లు శివ నవంబర్‌ 21న బూర్గుల గ్రామం నుంచి ఇనుప కడ్డీలు తీసుకుని వెళ్లి కర్ణాటకలోని రాయచూర్‌లో ఆన్‌లోడ్‌ చేశారు. అనంతరం లారీ యజమాని సూచనలతో నవంబర్‌ 24న గంగావతికి వెళ్లి ఇటుకలు లోడ్‌ చేసుకొని హైదరాబాద్‌ బయలుదేరారు. వచ్చేదారిలో నవీన్, చెన్నకేశవులు గుడిగండ్ల గ్రామంలో కలిశారు. అదే గ్రామంలో పొదల్లో ఉన్న ఐరన్‌ చానల్స్‌ను లోడ్‌ చేసుకుని తీసుకొస్తుండగా 26న మహబూబ్‌నగర్‌ ఆర్టీఓ లారీని ఆపి తనిఖీలు చేశారు. ఆరిఫ్‌కు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదని, పైగా లారీ ఓవర్‌ లోడ్‌తో ఉందని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆర్టీఓకు లారీ అప్పగించి రావొద్దంటూ యజమాని స్పష్టంచేయడంతో ఆరిఫ్‌.. లారీ స్టార్ట్‌ కాకుండా చూసేందుకు సెల్ఫ్‌ స్టార్ట్‌ వైర్‌ పీకేశాడు. దీంతో ఆర్టీఓ లారీని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అక్కడి నుంచి బయలుదేరి మార్గమధ్యంలో రాయ్‌కల్‌ టోల్‌ ప్లాజా వద్ద ఇనుప కడ్డీలను విక్రయించిన నిందితులు రూ.4 వేలు సంపాదించారు. 

అనంతరం తొండుపల్లి వచ్చి అక్కడే లారీ కేబిన్‌లో నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు పోలీసు పెట్రోలింగ్‌ వాహనం వచ్చి అక్కడి నుంచి లారీని తీసేయాలని హెచ్చరించడంతో.. సమీప దూరంలోని ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్డులోకి లారీని తీసుకెళ్లి అక్కడ నిలిపి ఉంచారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో మద్యం కొనుగోలు చేసి, కేబిన్‌లోనే తాగుతూ కూర్చున్నారు. ఆ సమయంలో లారీ పక్కనే స్కూటీ పార్క్‌ చేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ ప్రియాంకారెడ్డిని చూశారు. ఆమె అందంగా ఉందని, స్కూటీ కోసం తిరిగి వచ్చినప్పుడు ఆమెపై అత్యాచారం చేయాలని నిందితులు కుట్ర పన్నారు. 

పథకం ప్రకారం స్కూటీ వెనుక టైర్‌ను నవీన్‌ పంక్చర్‌ చేశాడు. అప్పటికే ఫుల్‌ బాటిల్‌ మద్యం తాగిన నిందితులు మరో హాఫ్‌ బాటిల్‌ తెచ్చుకుని తాగుతూ కూర్చున్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో ప్రియాంక రావడాన్ని గమనించారు. ఆరిఫ్, చెన్నకేశవులు ఆమె వద్దకు వెళ్లి.. మేడమ్, మీ స్కూటీ టైర్‌ పంక్చర్‌ అయిందని చెప్పి మాట కలిపారు. వారి వాలకం చూసిన ప్రియాంక స్పందించలేదు. కానీ నిందితులు ఆమెకు సహాయం చేస్తున్నట్టు నటించారు. స్కూటీ టైర్‌లో గాలి నింపుకొని తీసుకురావాలని ఆరిఫ్‌.. శివను పంపించాడు. ఆరిఫ్‌ మాట్లాడుతుండగానే ప్రియాంక తన చెల్లెలికి ఫోన్‌ చేసి లారీ డ్రైవర్లును చూస్తుంటే భయమేస్తోందని చెప్పింది. కొద్దిసేపటికి షాప్‌ మూసి ఉందంటూ శివ తిరిగి వచ్చాడు. 

హెల్ప్‌.. హెల్ప్‌ అన్నా వదిలిపెట్టలేదు
మరో షాప్‌లో గాలి నింపుకొని వస్తానంటూ శివ మళ్లీ బండి తీసుకుని వెళ్లాడు. అతడు గాలి నింపుకొని తిరిగి వచ్చిన వెంటనే నిందితులు తమ పథకాన్ని అమలు చేశారు. ఆరిఫ్‌ ప్రియాంక చేతులు పట్టుకోగా.. చెన్నకేశవులు ఆమె కాళ్లు, నవీన్‌ నడుము వద్ద పట్టుకుని ప్రహరీ గోడ లోపలున్న చెట్ల పొదల్లోకి బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో ఆమె హెల్ప్‌.. హెల్ప్‌ అంటూ ఆర్తనాదాలు చేసినా నిందితులు కనికరించలేదు. అరుపులు బయటకు వినిపించకుండా ఆరిఫ్‌ ఆమె నోటిని తన చేతితో మూసివేశాడు. వెంటనే నవీన్‌ ఆమె సెల్‌ఫోన్‌ను స్విచ్చాఫ్‌ చేశాడు. శివ ఆమె దుస్తులను లాగేశాడు. దీంతో మళ్లీ హెల్ప్‌.. హెల్ప్‌ అని అరవడంతో నవీన్, చెన్నకేశవులు ప్రియాంక నోట్లో మద్యం పోశారు. అనంతరం ఒకరి తర్వాత ఒకరు పాశవికంగా అత్యాచారం చేశారు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రియాంక స్పృహ కోల్పోయింది. కొంతసేపటికి స్పృహ రావడంతో నిందితులు ఆమెను చంపాలని నిర్ణయించుకున్నారు. 

ఆరిఫ్‌ ఆమె నోరు, ముక్కును చేతులతో గట్టిగా అదిమి పట్టడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. నవీన్‌ కుమార్‌ ఆమె సెల్‌ఫోన్, పవర్‌ బ్యాంక్, వాచీలను కవర్‌లో పెట్టి లారీలో ఉంచాడు. అనంతరం ఓ బెడ్‌షీట్‌లో మృతదేహాన్ని చుట్టి లారీలో పడేశారు. అక్కడి నుంచి నవీన్, శివ స్కూటీపై, మహమ్మద్‌ ఆరిఫ్, చెన్నకేశవులు లారీలో షాద్‌నగర్‌ వైపు రాత్రి 11 గంటలకు బయలుదేరారు. నవీన్, శివ బాటిల్‌ తీసుకుని పెట్రోల్‌ కోసం కొత్తూరు శివారులోని బంకుకు వెళ్లారు. అయితే, వారిపై అనుమానం వచ్చిన బంక్‌ ఉద్యోగి లింగరామ్‌ గౌడ్‌ బాటిల్లో పెట్రోల్‌ పోయడానికి నిరాకరించాడు. దీంతో దగ్గర్లో ఉన్న ఐవోసీ పెట్రోల్‌ బంక్‌లో నిందితులిద్దరూ పెట్రోల్‌ కొనుగోలు చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి అండర్‌పాస్‌ వద్దకు అందరూ చేరుకున్నారు. మృతదేహాన్ని లారీ నుంచి దింపి అండర్‌పాస్‌ కిందికి తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత ప్రియాంక సిమ్‌కార్డులు, బ్యాగ్‌ను అదే మంటల్లో వేసి కాల్చేశారు. అనంతరం అక్కడి నుంచి ఆరాంఘర్‌ వైపు వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు
28 నిమిషాల్లోనే చంపేశారు!

పోలీసుల నిర్లక్ష్యమే కొంపముంచిందా?

పశువులు తిరుగుతున్నాయి జాగ్రత్త

ప్రియాంక కేసులో ఇదే కీలకం

‘నా కొడుకుకు ఉరిశిక్ష వేసినా ఫర్వాలేదు’

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు