300 మంది క్లినికల్‌ ట్రయల్స్‌

29 Sep, 2019 02:30 IST|Sakshi

నిలోఫర్‌లో ఏడాది పాటు చిన్నారులపై ఔషధ ప్రయోగాలు

క్లినికల్‌ ట్రయల్స్‌ రిజిస్ట్రీ ఇండియా నివేదిక వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: నిలోఫర్‌లో వంద లాది మంది పిల్లలు ఔషధ కంపెనీల క్లినికల్‌ ట్రయల్స్‌ బాధితులుగా మిగిలారు. గతేడాది మే నుంచి ఏడాది పాటు 300 మంది పిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరిగాయి. ఇన్‌పేషెంట్లుగా వచ్చిన నవజాత శిశువులు మొదలు 14 ఏళ్లలోపు పిల్లలపైనే ఈ ప్రయోగాలు జరిగినట్లు క్లినికల్‌ ట్రయల్స్‌ రిజిస్ట్రీ ఇండియా నివేదికలో వెల్లడించింది. 300 మందిలో 100 మంది ని జనరల్‌ వార్డు నుంచి, మరో 100 మందిని పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (పీఐసీయూ) నుంచి, ఇంకో 100 మందిని నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఎన్‌ఐసీయూ) నుంచి ఎం పిక చేశారు. వీరిపై యాంటీ బయోటిక్స్‌ మందుల ప్రయోగం జరిగిందని నివేదిక తెలిపింది. పిల్లలు రోగాలతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారిపై యాంటీ బయోటిక్స్‌ ప్రయోగించారు. తద్వారా వారిపై అదెలా పనిచేసిందో వివరాలు సేకరించారు. ఔషధ సామర్థ్యాన్ని నిర్ధారణ చేశారు. ఈ కాలంలో ఇతర మందులతో పోలుస్తూ అధ్యయనాలు జరిగినట్లు తేలింది. ఇద్దరు వైద్యులు ఈ క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొనగా, కంపెనీల ప్రతినిధులు, ఇతరులు వారికి సహాయకులుగా ఉన్నారు. నిలోఫర్‌లో పదేళ్లుగా క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయని నివేదిక తెలిపింది. ఈ పదే ళ్లలో 13 ట్రయల్స్‌ జరిగాయని, ఈ పిల్లల ఆరోగ్య పరిస్థితిపై సమాచారం లేదు. అది విచారణలోనే వెల్లడి కావాల్సి ఉంది. 

వయసు వారీగా వర్గీకరించి.. 
క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపిన పిల్లలను వయసు వారీగా విభజించి ప్రయోగాలు నిర్వహించారు. సాధారణ వార్డులో నెల నుంచి ఏడాది వయసున్న పిల్లలు 18 శాతం, ఏడాది నుంచి ఐదేళ్ల వరకు 34 శాతం, 5 నుంచి 12 ఏళ్ల వయసు పిల్లలు 48 శాతం ఉన్నారు. పీఐసీయూలో నెల నుంచి ఏడాది వరకు 44 శాతం, 1 నుంచి ఐదేళ్ల వయసు వారు 32 శాతం, 5 నుంచి 12 ఏళ్ల వారు 24 శాతం ఉన్నారు. ఎన్‌ఐసీయూలో నెల నుంచి ఏడాది వయసు పిల్లలు 58 శాతం, ఏడాది నుంచి ఐదేళ్ల వరకు 28 శాతం, 5 నుంచి 12 ఏళ్ల పిల్లలు 14 శాతం ఉన్నారు. సాధారణ వార్డులో మగ పిల్లలు 64%, ఆడ పిల్లలు 36 శాతం ఉన్నారు. పీఐసీయూలో మగ పిల్లలు 54 శాతం, ఆడ పిల్లలు 46 శాతం ఉన్నారు. ఎన్‌ఐíసీయూలో మగ పిల్లలు 48%, ఆడ పిల్లలు 52% ఉన్నారు. వీరంతా వివిధ రకాల వ్యాధులతో ఆసుపత్రిలో చేరినవారే. రోగాల వారీగా కూడా పిల్లలను ఎంపిక చేసి వారిపై ప్రయోగాలు చేశారు. ప్రస్తుతం అక్కడ రోటా వైరస్‌ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నట్లు నివేదిక తెలిపింది. 

అంతా పేద పిల్లలే.. 
నిలోఫర్‌కు వచ్చే పిల్లల్లో 99 శాతం మంది పేద పిల్లలే కావడం గమనార్హం. క్లినికల్‌ ట్రయల్స్‌కు అను మతి పేరుతో వారిపై జరిగిన ప్రయోగాల్లో కొందరికి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చినట్లు అనుమానాలున్నాయి. దీనిపై విచారణ జరగాలని నిపుణులు కోరు తున్నారు. కేంద్ర నివేదికలో పిల్లల వివరాలు, ఎప్పుడు ఈ క్లినికల్‌ ట్రయ ల్స్‌ పూర్తయ్యాయన్న సమాచారాన్ని పేర్కొనలేదు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రుల్లోనూ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయని తేలింది. ఉస్మానియా, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రుల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ జరిగాయని రిజిస్ట్రీ తన నివేదికలో తెలిపింది. కాగా సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ అధికారులు శనివారం నిలోఫర్‌కి వచ్చి వివరాలు సేకరించినట్లు సమాచారం. ఈ క్లినికల్‌ ట్రయల్స్‌కు బాధ్యులైన వారిపై బదిలీ వేటు పడే అవకాశాలున్నట్లు వైద్య విద్యా విభాగం వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు