నిత్యావసరాల రవాణాకు ఇబ్బందులు

27 Mar, 2020 04:23 IST|Sakshi

అంతర్రాష్ట్ర వాహనాలను రోడ్లపైకి అనుమతించడం లేదంటూ కిరాణా వ్యాపారుల గగ్గోలు

పౌర సరఫరాల శాఖ కమిషనర్‌తో హోల్‌సేల్‌ వర్తకుల భేటీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసర సరుకుల రవాణా విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చే సరుకుల విషయంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేయడం, రాష్ట్రాల సరిహద్దుల వద్ద అడ్డుకోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని హోల్‌సేల్‌ వ్యాపారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయమై గురువారం హోల్‌సేల్‌ వ్యాపారులు పౌర సరఫరాల కమిషనర్‌ సత్యనారాయణరెడ్డితో భేటీ అయ్యారు. నిత్యావసరాల ధరలు పెంచవద్దని ప్రభుత్వం విన్నవిస్తోందని, అయితే సరుకు రవాణా జరుగకుండా ధరల పెరుగుదలను అడ్డుకోవడం సాధ్యం కాదని వ్యాపారులు ఆయన దృష్టికి తెచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి చక్కెర, గుజరాత్‌ నుంచి ఉప్పు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ నుంచి శనగపప్పు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కందిపప్పు, రాజస్తాన్‌ నుంచి పెసరపప్పు, కృష్ణపట్నం, కాకినాడ, చెన్నై ఓడరేవుల నుంచి ముడి వంట నూనెలను నిరంతరం దిగుమతి చేసుకుంటున్నామని వ్యాపారులు తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద వీటిని అనుమతిస్తేనే ధరల పెరుగుదలను అడ్డుకోవచ్చని తెలిపారు. స్పందించిన కమిషనర్, ఎక్కడైనా చెక్‌పోస్టుల దగ్గర సరుకుల రవాణా వాహనాలను నిలిపివేస్తే డ్రైవర్‌ పేరు, నంబర్‌ తెలియజేస్తే  సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అధిక ధరలకు విక్రయిస్తే పీడీ కేసులు  
లాక్‌డౌన్‌కు ముందున్న ధరల ప్రకారమే నిత్యావసరాలను విక్రయించాలని పౌరసరఫరాల కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి సూచించారు.  అధిక ధరలపై విజిలెన్స్‌ బృందాలు ప్రత్యేకంగా నిఘా వేసి ఉంచాయని, అధిక ధరలకు విక్రయిస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు