తూచ్...ఆ ఫైలు కాదు..!

26 Feb, 2015 01:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పరిపాలనా అనుమతుల అంశం గందరగోళంగా మారింది. ఇప్పటికే ముఖ్యమంత్రి సంతకం చేసిన ఫైలు నీటి పారుదల శాఖ సెక్షన్ అధికారుల తప్పిదంతో మళ్లీ మొదటికి వచ్చింది. అనేక అడ్డంకులు దాటుకొని ఆర్థిక శాఖ ఆమోదం పొందిన ఫైలు విషయంలో అధికారులు చేసిన పొరపాటు ప్రాజెక్టు అనుమతుల జాప్యానికి దారితీసింది. తేరుకొని  వాస్తవ అంచనా రూ.15,850 కోట్లతో కొత్త ఫైలును రెడీ చేసి మళ్లీ ఆర్థికశాఖకు పంపారు.
 
 పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 10లక్షల ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని సంకల్పించిన ప్రభుత్వం గత జూలైలో నివేదిక తయారీ బాధ్యతను ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీకి అప్పగించింది. జూరాల నుంచి  70 టీఎంసీల నీటిని తరలించేందుకు 5 కిలోమీటర్ల మేర ఓపెన్ చానల్, 25 కి.మీ.మేర టన్నెల్‌ను నిర్మించాల్సి ఉంటుందని, ఇక్కడికి చేరే నీటిని 70 టీఎంసీల సామర్థ్యం ఉంటే మొదటి రిజర్వాయర్ కోయిలకొండలోకి 170 మీటర్ల ఎత్తునుంచి ఎత్తిపోయాల్సి ఉంటుందని తన నివేదికలో తెలిపింది.
 
 దీనికోసం 160మెగావాట్ల కెపాసిటీ కలిగిన 14 పంపులను సంబంధిత స్టేషన్ వద్ద ఏర్పాటుచేయాల్సి ఉంటుందని వివరించింది. ఈ తొలిదశ నిర్మాణానికి సుమారు రూ.14,350కోట్లు అవసరమని అంచనా వేసింది.  సంస్థ డీపీఆర్‌ను పరిశీలించిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీఓ) ప్రాజెక్టు రాక్స్ స్టేటస్(రాయి సామర్థ్యం)ను బట్టి అలుగు పునాది (ఫౌండేషన్ లెవల్)ని 405 మీటర్ల నుంచి మరింత 395 మీటర్ల కిందకు తీసుకెళ్లాలని సూచించింది. పునాది స్థాయిలో మరింత కిందకు వెళ్లిన పక్షంలో ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.15,850కోట్లకు పెరుగుతుందంటూ అదే నివేదికను ఆర్ధిక శాఖ పరిశీలనకు పంపారు. ఇక్కడ అన్ని అంశాలను పరిశీలించిన ఆర్థిక శాఖ ఇదే అంచనాకు ఆమోదం సైతం తెలిపింది.
 
 
 తప్పును గుర్తించిన మంత్రి హరీశ్
 ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన అంచనా వ్యయ ఫైలును సీఎం ఆమోదం కోసం పంపేటప్పుడు పొరపాటు జరిగింది. సవరించిన అంచనా వ్యయంతో సిద్ధం చేసిన ఫైలుకు బదులు, ప్రాథమిక అంచనాలున్న పాత ఫైలునే సీంఎంకు పంపినట్లుగా తెలుస్తోంది. ప్రాజెక్టుకు త్వరితగతిన శంకుస్థాపన చేయాలనే యోచనతో ఆయన ఆ ఫైలుపై వెంటనే సంతకం చేశారు. ఇలా రూ.14,350 కోట్ల పరిపాలనా అనుమతుల ఫైలుపై సీఎం సంతకం చేసినట్లు సీఎంవో తెలిపింది.
 
 అయితే తాము పంపిన అంచనాలు ఒకలా ఉండటం, సీఎం ఆమోదించిన ఫైలులో మరో అంచనా ఉండటంతో నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు కంగుతిన్నారు. అధికారుల తప్పిదంతోనే ఇదంతా జరిగిందని తెలుసుకొని వెంటనే కొత్త అంచనాల ఫైలును ఆర్థిక శాఖ ఆమోదానికి పంపి, మరోమారు సీఎంతో సంతకం పెట్టించేందుకు సిద్ధపడ్డారు. పరిపాలనా అనుమతులు పొందిన ప్రాజెక్టుకు త్వరలోనే టెండర్లు పిలుస్తారని అంతా భావించినా అధికారిక ఉత్తర్వు (జీవో) రాలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జీవో రాలేదని అంతా భావించినా, అధికారుల తప్పిదం ఉందని ఆలస్యంగా వెలుగు చూసింది.

>
మరిన్ని వార్తలు